– ప్రతి గ్రామానికీ తాగునీరందాలి – రాష్ట్రంలోని నీటివనరులన్నింటినీ అనుసంధానించాలి – అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ – గ్రిడ్ ప్రణాళిక రూపకల్పనపై అధికారులతో సమావేశం
రాష్ట్రంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే చిత్తశుద్ధితో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు శాశ్వత ప్రాతిపదికన తాగునీరు అందించడానికి 160 టీఎంసీల నీరు అవసరమని భావిస్తున్న ఆయన, అందుకోసం కృష్ణానది నుంచి 80టీఎంసీలు, గోదావరి నుంచి 80టీఎంసీలు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ నీటిని గ్రామాలకు అందించాలంటే ప్రత్యేకంగా తాగునీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తాగునీటి గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కరీంనగర్‌లో మంగళవారం ప్రకటించిన మరుసటి రోజే అందుకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పనపై చర్చించడానికి బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి సరఫరాశాఖ మంత్రి కే తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగరావు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ బీ సురేందర్‌రెడ్డిలతో సీఎం సమావేశమయ్యారు. రా్ష్ట్రంలోని ప్రతి గ్రామానికి రక్షిత తాగునీరు అందుబాటులో ఉండేలా గ్రామీణ తాగునీటి వ్యవస్థను తీర్చిదిద్ధాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వాలు తాగునీటికి వేల కోట్ల రూపాయల ఖర్చు చేసినా అన్ని ప్రాంతాలకు నీరందించలేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఆవాస ప్రాంతాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించాలని, మండలాల వారిగా కాంటూర్లను గుర్తించి వీటిని అనుసరించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసేలా సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఉన్న పైప్‌లైన్లు, రిజర్వాయర్లు, నీటి వనరులతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఎంత అదనపు పైప్‌లైన్లు అవసరం? గ్రావిటీ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నీరు సరఫరా చేయవచ్చు? ఎక్కడ లిఫ్ట్‌లు అవసరం? ఇంకా ఎంత నీరు అవసరం? నీటి సరఫరాకు ఎంత విద్యుత్ అవసరం? అనే అంశాలను పరిశీలించాలని సూచించారు.
వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయడానికి అనుకూలమైన పరిస్థితి ఉందని సీఎం పేర్కొన్నారు. జిల్లాలో స్థానిక నీటి వనరులను గుర్తించాలని, జిల్లాల వారిగా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఎక్కడి వరకు నీటి సరఫరా అవుతుందో చూడాలని అధికారులకు సూచించారు. సాగునీటి కాల్వల ద్వారా గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎతైన గ్రామాలకు తాగునీరు కూడా సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు.
రాష్ట్ర మంతటా సిద్దిపేట తరహా ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో 10శాతం తాగునీటికి వాడాలని నిర్ణయించినందున తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు, వివిధ జిల్లాల్లోని రిజర్వాయర్లు, మున్నేరు లాంటి ఉపనదులు, పాకాల, రామప్ప, లాంటి చెరువులు, స్థానికంగా ఉన్న ఇతర నీటి వనరులన్నింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలని సూచించారు.