-మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోండి -అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు -పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి ఈటెల సమీక్ష -హైదరాబాద్ నుంచి పరిశ్రమలు పోతున్నాయన్నది బాబు -గోబెల్స్ ప్రచారమేనని వ్యాఖ్య

రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోలు అంశంపై పౌరసరఫరాల శాఖ అధికారులతో ఈటెల మంగళవారం ఉదయం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు మిల్లర్లకు కనీస మద్దతు ధర కన్నా రూ.200 తక్కువకే విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి రూ.1340, దొడ్డురకం ధాన్యానికి రూ.1310, మొక్కజొన్నకు రూ.1310 చొప్పున మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దైనందిన జీవితంతో ముడిపడి ఉన్న పౌరసరఫరాశాఖ సేవలను సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సక్రమంగా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆహార భద్రత చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తామన్నారు. దీనివల్ల రాష్ట్రంపై రూ. 3వేల కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం భూస్వాముల, ధనికుల కోసం కాదని, పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ తెల్లరేషన్ కార్డులను అందజేయనున్నట్లు చెప్పారు.
ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రిగా బుధవారం ఉదయం 9:17 గంటలకు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఈటెల తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత సమశీతోష్ణమండల ప్రాంతం హైదరాబాద్ అని, అందువల్ల విత్తనోత్పత్తికి అనుకూలమైన వనరులున్నాయన్నారు. విభజన వల్ల హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, ఇతర రాష్ర్టాలకు పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారమంతా చంద్రబాబు చేస్తున్న గోబెల్స్ ప్రచారమేనని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. గతంలో విశాఖపట్నానికి తరలిపోయిన ఫార్మా కంపెనీలు కూడా దివాళా తీసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చాయని గుర్తుచేశారు. అనేక దేశాల నుంచి కంపెనీలు హైదరాబాద్‌లో వ్యాపారాలకు ముందుకువస్తున్నారని ఈటెల వివరించారు. సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల శాఖ ఎండీ అనిల్‌కుమార్, కమిషనర్ సీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
ఈటెలకు మాజీ ఆర్థిక మంత్రి ఆనం శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా ప్రమాణం చేసిన ఈటెల రాజేందర్‌కు ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు అభినందించారు. ఈటెల సొంత నియోజకవర్గం హూజురాబాద్ నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రగతికి ఉద్యోగులే కీలకం: ఈటెల తెలంగాణ రాష్ట్ర ప్రగతికి తమతోపాటు ఉద్యోగులు సమాంతరంగా పయనించాల్సిన అవసరముందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. విభజన తర్వాత తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్, అకౌంట్స్ డైరెక్టర్‌గా నియమితులైన వీ శ్రీనివాస్, తెలంగాణ పే అండ్ అకౌంట్స్ ఎంప్లాయీస్ సంఘం నేతలు బీ వెంకటరమణ, శ్రీనివాస్‌గౌడ్, జిలానీ, జాయింట్ డైరెక్టర్లు మల్లేశ్వర్‌రావు, సుధీర్ మంగళవారం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.