వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశించారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల నీటి వనరులను ఉపయోగంలోకి తేవాలని సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.263 కోట్లతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు.

-ఆర్‌డబ్ల్యూఎస్‌తో సమన్వయం చేసుకోవాలి -ఫిర్యాదులు, మీడియా వార్తలపై స్పందించాలి -వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు -అవసరమైతే అదనపు నిధులు కేటాయిస్తామని హామీ ఈ నిధులు సరిపోకపోతే అదనపు నిధుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్న రాష్ట్ర మంత్రి.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టంచేశారు. గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గతంలో వినియోగించుకున్న ప్రైవేట్ బోరుబావులకు బకాయిలు చెల్లించడంతోపాటు పంటలు వేయని భూముల నుంచి బోరు బావులను నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని చెప్పారు. ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాల్లోని కాల్ సెంటర్లకు వచ్చే ఫిర్యాదులు, మీడియాలో వచ్చే ప్రతి సమస్యపై స్పందించాలని సూచించారు.
ఉపాధి హామీని వేగవంతం చేయాలి జిల్లాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత వేగవంతంగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలని, ప్రారంభం కాని గ్రామాల్లో వెంటనే చేపట్టేందుకు ఎంపీడీవో అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రజాప్రతినిధులను విశ్వాసంలోకి తీసుకొని ఉత్పాదక పనులు చేపట్టాలని చెప్పారు. ఉపాధి హామీ పనుల కోసం దరఖాస్తుచేసుకున్న ప్రతి ఒక్క అర్హుడికి జాబ్‌కార్డు జారీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీడియా కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, కమిషనర్ అనితా రాంచద్రన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్-ఇన్-చీఫ్ బి.సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.