-జాతి నిర్మాణంలో పాల్గొనే యువతకు ఎన్‌ఎస్‌ఎస్ వేదిక -ఎంజీయూలో కొత్త కోర్సులు మంజూరు చేయిస్తా -విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హామీ

తెలంగాణ రక్తంలోనే సేవాభావం ఉంది. తెలంగాణవాసులు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరని చరిత్ర చెబుతోంది అని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రాజీవ్‌గాంధీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఎంజీ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ నిర్వహించిన దక్షిణాది రాష్ర్టాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారుల శిక్షణను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసి బాధ్యతను గుర్తించేందుకు, సమాజవిలువలను గుర్తు చేసేందుకు ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమాల ద్వారా కళాశాలల్లో మొక్కలు పెంచారని, నేడు ఓయూ తదితర కళాశాలల్లో నీడనివ్వడంతోపాటు ప్రజలకు శ్వాసనిస్తున్నాయన్నారు.
ఎంజీ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాఠశాలల ప్రహరీల నిర్మాణంలో పాలుపంచుకుని అభివృద్ధిలో భాగస్వాములయ్యారని కొనియాడారు. ఎంజీయూలో కొత్తకోర్సులు కావాలని రిజిస్ట్రార్ తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ ఏడాది ఏడుకోర్సులను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నందున జిల్లావాసిగా, విద్యామంత్రిగా ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. అనంతరం నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్ మాట్లాడారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ పోచన్న అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ రీజనల్ సెంటర్ హెచ్ ఆర్ గోపాలకష్ణన్, ఆకుల రవి తదితరులు పాల్గొన్నారు.