తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌కే సాధ్యం తెలంగాణ శక్తులే పాలించాలి ఉద్యమంలా అభివృద్ధి చేయాలి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు – ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులకు పొన్నాల అనుమతులు – హారతులిచ్చింది డీకే అరుణ – ఇలాంటి వాళ్లతో తెలంగాణ బాగుపడుతుందా? – మెట్రో దారిలో మార్పులు – జగిత్యాల సహా 24 జిల్లాలు – టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యలు – గులాబీ నీడకు డాక్టర్ సంజయ్
తెలంగాణ రాష్ట్రాన్నీ కాంగ్రెస్ పార్టీ పుణ్యానికి ఇవ్వలేదు. అనేక పోరాటాలు, ఎన్నో బలిదానాలు, త్యాగాలు చేసినందునే ఇచ్చారు. ఇవాళ తెలంగాణను మేమే తెచ్చినం అని చెప్పుకునేవాళ్లంతా మేం ఉద్యమాలు చేస్తున్నప్పుడు పదవుల్లో ఉయ్యాలలు ఊగినవారే. తెలంగాణ అంశంపై వైఎస్ అవహేళనగా మాట్లాడుతుంటే ఆయన పక్కనచేరి నవ్వారు. అయినా మొండిగా, ధైర్యంగా నిలబడ్డాం.- కేసీఆర్
హైదరాబాద్:తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌కే సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. రాష్ట్ర సాధనకు ఎలాగైతే ఉద్యమం చేశామో తెలంగాణ అభివద్ధికి కూడా అలాగే పోరాటం చేద్దామన్నారు. నీతితోకూడిన, అవినీతిరహిత ప్రభుత్వాన్ని నడిపిద్దామని చెప్పారు. కులమతాలకు అతీతంగా తెలంగాణ సమాజం రాష్ర్టాన్ని సాధించిందన్న కేసీఆర్.. వచ్చిన తెలంగాణ ఏ ఒక్క వర్గంకోసం కాదని, అన్ని వర్గాలకోసమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కష్టపడ్డవారి నేతత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని చెప్పారు. అక్రమ ప్రాజెక్టులకు అనుమతులిచ్చిన పొన్నాల వంటివారితోనూ, ఆ ప్రయత్నాలకు హారతులు పట్టిన డీకే అరుణవంటి నేతలతోనూ తెలంగాణ బాగుపడదని విస్పష్టంగా చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సంజయ్ కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్ ఆయనకు కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ కల సాకారమైందని, ఇక దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని అన్నారు. ఇది ప్రత్యేక సందర్భం. టీఆర్‌ఎస్ 14 ఏళ్లనుంచి ప్రజల మధ్యే ఉంది. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది. ఏ మండలంలో ఏ సమస్య ఉందో టీఆర్‌ఎస్‌కే తెలుసు. తెలంగాణలో నదులున్నాయి. వనరులున్నాయి. కష్టపడి పనిచేసే మనుషులున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను నంబర్ వన్‌గా మార్చుకుందాం. ఇది అసాధ్యం కానేకాదు అన్నారు. నేను తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు చాలామంది చాలా రకాలుగా అన్నరు. కొందరైతే తెలంగాణ ఎట్లొస్తదని అన్నరు. కొందరు ఎందుకు రాదు అని కలిసొచ్చిన్రు. మరికొందరు మీమాంసలోనే ఉన్నరు. కానీ 14 సంవత్సరాల పోరాటంతో తెలంగాణను సాధించినం. ఎన్నో చేసినం అని చెప్పారు. తెలంగాణ తన తలరాతను తనే రాసుకునే సందర్భంలో ఉందన్న కేసీఆర్.. టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని అన్ని పొలాలకు నీళ్లు రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ పచ్చబడాలె. కరీంనగర్‌లో ఎస్సారెస్పీ ఉంది. గతంలోనే నారాయణరెడ్డి అనే ఇంజినీర్‌తో సర్వే చేయించిన. పడువాటి నీళ్లతో ఇంకా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని అడిగితే అదనంగా లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని, ఒక్క బుగ్గారంలోనే మండలంలోనే 30వేల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పిండు. ఎంత లాభం! కాల్వల ద్వారా పారే నీళ్లు కాకుండా పొలాలు నిండగా మిగిలిన నీళ్లు గోదావరిలో కలువకుండా మళ్లించుకుంటేనే ఇన్ని వేల ఎకరాలు పారుతుంది! ఈ వ్యవస్థ ఆంధ్రలో ఉంది. కానీ మన తెలంగాణలో అమలు చేయలేదు అని వివరించారు. పుణ్యానికే ఇవ్వలేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పుణ్యానికే ఇవ్వలేదని, అనేక పోరాటాలు, ఎన్నో బలిదానాలు, త్యాగాలు చేసినందునే తెలంగాణ ఇచ్చారని అన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం తెలంగాణ సమస్య ఉందని వారే గుర్తించి తెలంగాణ ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ తెలంగాణను మేమే తెచ్చినం అని చెప్పుకునేవాళ్లంతా తాము ఉద్యమాలు చేస్తున్నప్పుడు పదవుల్లో ఉయ్యాలలు ఊగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అంశంపై వైఎస్ అవహేళనగా మాట్లాడుతుంటే ఆయన పక్కన చేరి నవ్వారని, అయినా మొండిగా, ధైర్యంగా నిలబడ్డామని అన్నారు. అసలు టీఆర్‌ఎస్ ఉనికే లేకుండా ఆగం చేసేందుకు కుట్ర చేశారని అన్నారు. కానీ ఇవాళ లేచినోడు, లెవ్వనోడు అందరూ మేమే తెలంగాణ తెచ్చినం అని మాట్లాడుతున్నారని, ప్రజలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సమయం తెలంగాణ తన తలరాతను తనే రాసుకునే సందర్భంలో ఉందని, టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల రూపాయలతో 125గజాల్లో ఇల్లు కట్టించి ఇస్తామని తెలిపారు. భూమిలేని దళితులకు మూడు ఎకరాల భూమిని కొనిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి రెండు సంవత్సరాలు కరెంటు సమస్యలుంటాయని, మూడో సంవత్సరం నుంచి 24గంటల కరెంటు అందిస్తామని తెలిపారు. పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ పీసీసీ అధ్యక్షడు అయినంక ఉన్కమీద రోకలి పడ్డట్లుగా లేస్తున్నడు. నేను ఇప్పటికే అనేక ప్రశ్నలు అడిగిన. దమ్ముందా? సమాధానాలు చెప్పు. ఇప్పటికీ నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పలేదు. ఆంధ్రలో కట్టిన అక్రమ ప్రాజెక్టుల అనుమతులపై పొన్నాలనే సంతకాలు పెట్టిండు. గాలేరు-నగరి, వెలిగొండ, వెలిగోడు, హంద్రీనీవాలాంటి అక్రమ ప్రాజెక్టులకు పొన్నాల సంతకాలు పెడితే వీటిని ప్రారంభించే సమయంలో డీకే అరుణ మంగళహారతులు పట్టింది. ఇలాంటి వారు ఉంటే తెలంగాణ బాగుపడుతుందా అని కేసీఆర్ అన్నారు. గిరిజనులకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతంలోనే చెప్పానని, అదే సమయంలో ముస్లింలకు కూడా 12 శాతంరిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. తండాలన్నింటినీ పంచాయతీలుగా మారుస్తామని చెప్పారు. తమిళనాడులో ప్రస్తుతం 67శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, ఈ స్థాయి రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగంలో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కరీంగనగర్‌లో తొలి ఎన్నికల సభ 2001లో ఉద్యమాన్ని ప్రారంభించిన్పపుడు మొదటి సభ కరీంనగర్‌లోనే పెట్టానని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల ప్రచార సభ కూడా కరీంనగర్‌లోనే పెడుతున్నానని తెలిపారు. ఆత్మగౌరవ బావుటాను ఆకాశమంత ఎత్తుకు ఎగురవేసిన జిల్లా కరీంనగర్ అని కొనియాడారు. ఈ జిల్లాకు చాలా చేయాలని తనకూ ఉందని చెప్పారు. హైదరాబాద్, కరీంనగర్ రైల్వేలైన్‌ను పూర్తిచేయిస్తానని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కాగానే కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల డివిజన్‌ను జిల్లాగా మారుస్తానని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలకు అదనంగా మరో 14 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాల పునర్విభజన సమయంలో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జిల్లాల విభజన జరగలేదని తెలిపారు. తెలంగాణ సంస్కతి, భాష, వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కతిపై దాడి జరిగిందని, తెలంగాణ చరిత్ర ప్రతీకలు లేకుండా చేశారని మండిపడ్డారు. చరిత్రలో భాగస్వామి అయిన హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌ను, అమరవీరుల స్థూపాన్ని, వారసత్వ సంపద అయిన అసెంబ్లీని ధ్వంసం చేసేందుకు మెట్రోరైల్‌తో కుట్ర చేశారని అన్నారు. మెట్రోరైల్‌ను నిర్మిస్తున్న ఎల్‌అండ్‌టీ కంపెనీ వాళ్లను ఇటీవల పిలిచి మాట్లాడానని, ఈ మూడు ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌లో పనులు చేయాలని కోరానని, మీరెట్ల అంటే అలాగే చేస్తామని చెప్పారని తెలిపారు. కరీంనగర్‌లో 13 స్థానాలూ టీఆర్‌ఎస్‌కే పార్టీలోకి సంజయ్ రావడం శుభపరిణామం. పార్టీలో ఉన్న పెద్దలందరూ సంజయ్‌ను దీవించాలి. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. గత మూడు రోజుల నుండి సంజయ్ గెలుస్తున్నాడని నాకు సమాచారం వస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది. జగిత్యాలలో టీఆర్‌ఎస్ గెలుస్తుంది కనుక కరీంనగర్‌లోని 13స్థానాల్లోనూ టీఆర్‌ఎస్సే కైవసం చేసుకుంటుంది. అని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జగిత్యాలకు చెందిన నాయకులు రాజేశ్వర్‌గౌడ్, ఓరుగంటి రమణారావు, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.