Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అంబ‌రాన్నంటిన‌ సంబురాలు..

వైభవం..అట్టహాసం.. కోలాహలం.. రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాల ముగింపులో రాజధాని ఆదివారం సాయంత్రం పులకించిపోయింది. ట్యాంక్‌బండ్ చుట్టూ లేజర్ కిరణాల ధగధగలు, కళ్లు మిరుమిట్లు గొలిపే పటాసులు నేత్రానందం కలిగించగా, ర్యాలీలతో తరలివచ్చిన జనపదులు.. బతుకమ్మ, బోనాలతో కదిలివచ్చిన తెలంగాణ ఆడబిడ్డలు, నృత్యాలు చేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినదించిన యువతరం.. సాగర తీరాన్ని హోరెత్తించారు.

-కన్నుల పండువగా లేజర్ షో.. -వైభవంగా ముగిసిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు -కదిలివచ్చిన తెలంగాణ -మిన్నంటిన సంబురాలు -అబ్బురపరిచిన లేజర్‌షో, పటాకుల పేలుళ్లు, రోబో కైట్స్ -ట్యాంక్‌బండ్‌పైతెలంగాణ సాంస్కృతిక వైభవం -తీరొక్క కళాప్రదర్శనలు, బతుకమ్మలు -లడ్డూలు పంచిన సీఎం కేసీఆర్ -ఘనంగా ముగిసిన రాష్ట్ర అవతరణ వేడుకలు

ముగింపు వేడుకలో ప్రభుత్వం తరఫున లక్ష లడ్డూలను పంపిణీ చేశారు. ట్యాంక్‌బండ్ వేదికపై సీఎం కేసీఆర్ స్వయంగా గవర్నర్ నరసింహన్ దంపతులకు, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు లడ్డూలు తినిపించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. జూన్ 1 అర్ధరాత్రి ప్రారంభమైన ఆవిర్భావవేడుకలు రాష్ట్ర మంతటా ఆదివారం ముగిశాయి.

Telangana-Formation-Celebrations-3

విద్యుత్ కాంతుల ధగధగలు.. కళాకారుల నృత్యాలు.. డప్పుల మోతలు.. చిందు యక్షగానాలు.. ఇలా గతంలో కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల ముగింపు వేడుకలు ఆదివారం రాత్రి అంబరాన్నంటేలా అట్టహాసంగా జరిగాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరం జనసంద్రంగా మారింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కదిలివచ్చిన కళాకారులు, ప్రజలతో ట్యాంక్‌బండ్ తీరం కోలాహలంగా మారింది. ట్యాంక్‌బండ్ చుట్టూ లేజర్ కిరణాల ధగధగలతో కళ్లు మిరమిట్లు గొలిపాయి.

Telangana-Formation-Celebrations

పటాకుల పేలుళ్లు ట్యాంకు బండ్‌కు సరికొత్త అందాలు తెచ్చిపెట్టాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిటకిటలాడాయి. జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. కళాకారుల ప్రదర్శనలు, ర్యాలీతో వచ్చిన జానపదులు, బతుకమ్మ, బోనాలతో తరలివచ్చిన తెలంగాణ ఆడబిడ్డలు, జై తెలంగాణ నినాదాలు చేస్తూ నృత్యాలు చేసిన యువకులు, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినదించిన తెలంగాణవాదులతో సాగర్‌తీరం మార్మోగింది.

ఆకట్టుకున్న ప్రదర్శనలు.. జూన్ 1 అర్ధరాత్రి నుంచి 7వ తేదీ వరకు జరిగిన రాష్ర్టావతరణ వేడుకల ముగింపునకు తెలంగాణ పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం నుంచే జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు దరువులు, పోతురాజుల విన్యాసాలు, చిందు యక్షగానం, ఇంద్రజాలికులు, ఒగ్గుకథ కళాకారులు, పీరీలు, కోయదొరలు, పగటి వేషగాళ్లు, లంబాడీల నృత్యాలు,

కోలాటాలు, క్రీడాకారుల ర్యాలీ, తెలంగాణ కళాకారుల భారీ ఊరేగింపు, పోలీసుల కవాతు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల ప్రదర్శన, సఫాయి కార్మికుల చీపుళ్ల ప్రదర్శన, గుస్సాడీ నృత్యం, హరికథ కళాకారులు, కాటిపాపలు, బాలసంతలతో, దాసరి భాగవతులు, పట్నం కథ కళాకారులు, చిడుతల రామాయణం వంటి ప్రదర్శనలతో ముగింపు వేడుకలు ఆకట్టుకున్నాయి. ట్యాంక్ బండ్‌పై పెద్దపెద్ద ఎల్‌ఈడీ తెరలతో ఎక్కడికక్కడే సంబురాలను ప్రత్యక్ష ప్రసారం చేసారు. ముగింపు వేడుకలకు వచ్చిన ప్రజలు కళాకారులతో ఫొటోలు దిగారు.

Telangana-Formation-Celebrations-1

ప్రజలను ఉత్సాహరిచిన సీఎం కేసీఆర్.. ఉత్సవాలలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను పలకరిస్తూ హుషారుగా కనిపించారు. ముఖ్యమంత్రి దంపతులు ఆహుతులకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ముగింపు వేడుకలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున లక్ష లడ్డూలను పంపిణీ చేశారు. వేదికపై ఉన్నవారికి సీఎం కేసీఆర్ స్వయంగా లడ్డూలను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ నరసింహన్‌కు, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామీర్జాకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా లడ్డూ తినిపించారు.

Telangana-Formation-Celebrations-4

ఈ కార్యక్రమానికి గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, సీఎం సతీమణి శోభతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముగింపు వేడుకలకు హాజరైన ప్రజానీకాన్ని ఉత్సాహపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకల మధ్యమధ్యలో లేచి అభివాదం చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి ప్రజలు ప్రయత్నించడంతో పోలీసులు నియంత్రించారు.

Telangana-Formation-Celebrations-5

దర్శనమిచ్చిన మన పండుగలు ప్రపంచంలో ఏ ఇతర దేశాల్లో లేనివిధంగా పూలను పూజించే బతుకమ్మ పండుగ, త్యాగానికి ప్రతీకగా నిలిచిన పీర్ల పండుగ, అమ్మ బయలెల్లినాదే అని సాగే బోనాల పండుగ, తెలంగాణ సంస్కృతి ప్రతీకలు. వందలాదిమంది బతుకమ్మలతో, పీర్లతో, బోనాలతో ముఖ్యమంత్రి ముందు ప్రదర్శనగా వెళ్లారు. గండ దీపాలతో, గౌరమ్మ వెలుగులతో, పీరీల మెరుపులతో సాగిన ఈ ప్రదర్శన తెలంగాణ గొప్పదనాన్ని చాటింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఇతర పోలీసు బలగాలు, బ్రాస్‌బ్యాండ్ కవాతుతో స్వాగతం పలికాయి. ఎంతో లయబద్దంగా సాగిన ఈ ప్రదర్శన కార్యక్రమానికే వన్నెలద్దింది.

Telangana-Formation-Celebrations-6

జనమే జనం వేలాదిగా వచ్చిన యువకులు, విద్యార్థులు, మహిళలు, జై తెలంగాణ అంటూ ప్రదర్శనలతోపాటు సాగిపోయారు. భారీ త్రివర్ణపతాకాన్ని చేబూనిన యువకులు ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ తొలి వార్షిక సంబురాలు అంబరాన్ని చుంబించాయి. లేజర్ షోలు, పటాకుల మోత అలంకరించిన పడవ, తీర్చిదిద్దిన బుద్దుడు కన్నులపండువగా సాగిన ఈ సంబురం జనం మదిలో గొప్పగా నిలిచిపోయింది. సర్వత్రా హర్షాన్ని నింపింది.

సంబురాల ముగింపు విశేషాలు -పటాకుల జిగేల్ మధ్య సంబురాలు సాగాయి. -స్టేజీపై పుష్పాలతో కాకతీయ కళాతోరణంను ఏర్పాటుచేశారు. -విద్యుత్ దీపాలతో ట్యాంక్‌బండ్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. -పాలపిట్ట రూపాలతో కళకారులు ప్రజలను ఆకర్షించేలా ర్యాలీ తీశారు. -ఆడపడుచులు బోనాలు, బతుకమ్మలతో వచ్చారు. -సాగరతీరంలో అరగంట సేపు నిర్వహించిన లేజర్‌షో ముఖ్యమంత్రి సహా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం గంటపాటు పటాకుల పేలుళ్లు హోరెత్తించాయి. ఆ వెలుగుల్లో హుస్సేన్‌సాగర్ కొత్త అందాలు సంతరించుకున్నది. -లేజర్ కిరణాలతో బుద్ధుడు మరింత అందంగా కనిపించాడు. -తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగానికి చెందిన వివిధ బెటాలియన్ల జవాన్లు చేసిన బ్రాస్‌బ్యాండ్ విన్యాసాలను ఆకర్షించాయి. -స్వయం సహాయక మహిళలు కోలాటాలతో సభా స్థలికి చేరుకున్నారు. -జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో క్రీడాకారులు అమరవీరుల స్థూపం నమూనాను తీసుకువచ్చారు. -అతిపెద్ద జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ కొంతమంది ముఖ్యమంత్రి సమక్షంలో చేసిన కవాతుకు ప్రజలు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. -తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ నేతృత్వంలో వందలాది మంది కళాకారులు వివిధ కళారూపాలతో వచ్చి ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూ ముందుకు సాగారు. -స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ జీహెచ్‌ఎంసీ రూపొందించిన భారీ చీపురు నమూనా అందరినీ అలరించింది. వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు చీపుర్లతో సభాస్థలికి వచ్చారు. -పోలీసు క్రైం విభాగం స్టాఫ్ వయోలెన్స్, స్టాప్ ఈవ్‌టీజింగ్ ప్లకార్డులు ప్రదర్శించింది. -వడ్రంగి, గౌడ, కంసాలుల ప్రదర్శన ఆకర్షించింది. -పాతబస్తీ కళాకారులు ప్రముఖ నృత్యరూపకమైన మర్ఫాతో ఆకట్టుకున్నారు. -అమరవీరుల స్తూపం నమూనాతో ప్రత్యేక వాహనంతో తీసిన ర్యాలీ ఆకట్టుకుంది. -స్కేటింగ్‌తో చిన్నారులు, కాగడాల ప్రదర్శనలతో వచ్చిన యువకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -డ్రోన్‌ల ద్వారా వీడియో తీస్తూ ఎల్‌సీడీ మానిటర్ల ద్వారా ప్రసారం చేయడాన్ని చూసి పలువురు ముచ్చటపడ్డారు. -రోబో కైట్స్ విద్యుత్ వెలుగులను పంచడం చూపరులను అబ్బురపరిచింది. సంబరాలు ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు ఈ పతంగులు ఎగిరాయి. -నల్లగొండ జిల్లా చిందు, యక్షగాన కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అలరించాయి. సుమారు యాభై మంది కళాకారులు వివిధ పౌరాణిక పాత్రల వేషధారణలతో ఆకట్టుకున్నారు. పెద్దసంఖ్యలో వచ్చిన నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన డప్పుకళాకారులు వేడుకల్లో సందడి చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన కళాకారులు వీథి నాటకాలతో ఆకట్టుకున్నారు. -ఖమ్మం జిల్లానుంచి వచ్చిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు,మహిళలు తలపై బోనాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలతో సభాస్థలికి వచ్చి సందడి చేశారు. వారితోపాటు వచ్చిన డప్పు కళాకారుల వాయిద్య ఘోష పరిసరాలను హోరెత్తించింది. -ఆదిలాబాద్ జిల్లాల నుంచి అనేక మంది ఆదివాసీలు తమ సాంప్రదాయ వేషధారణతో సభా స్థలికి వచ్చారు. గోండు,గుస్సాడీ,థింసా తదితర నృత్యాలతో వారు ఆకట్టుకున్నారు. తలపై నెమిలి పింఛాలతో తయారు చేసిన పెద్ద పెద్ద కిరీటాలతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉత్సవాలకు అందం తీసుకువచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.