‘రైతులు పేదరికం నుంచి విముక్తి పొందడమే నిజమైన స్వాతంత్య్రం’ అని మహాత్మా గాంధీ చెప్పారు. రైతులు కండ్లు తెరిచిన నాడు, తమ దుస్థితికి తమ దురదృష్టం కారణం కాదని తెలుసుకున్న నాడు, రాజ్యాంగ రాజ్యాంగేతర మార్గాల మధ్య రేఖ చెదిరి పోతుందని గాంధీ హెచ్చరించారు. గాంధీజీ ఏమని హెచ్చరించారో ఇప్పుడదే జరుగుతున్నది.
నల్ల చట్టాలను రద్దు చేసేవరకు రైతులు వీరోచితంగా ఉద్యమం సాగించారు. తెలంగాణతో పాటు పలు రాష్ర్టాల్లో రైతు ఉద్యమాలు సాగుతున్నాయి. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. మోదీ ప్రభుత్వం దేశంలో రైతుల పైకి కార్లు ఎక్కించి చంపితే, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతాంగానికి పెట్టుబడి అందించి, పంట దిగుబడి రూపంలో కాసులు కురిపిస్తున్నది.
రైతులను ఆత్మహత్యల దిశగా తోసిన పాపం గత పాలకులది. రైతులకు అండగా నిలిచి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి సాగువైపు మళ్లించిన ఘనత కేసీఆర్‌ది. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేసి, గోదాములను నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రెండు సీజన్లు కలిపి సాగుకు యోగ్యమైన భూమి కోటి 31 లక్షల ఎకరాలు. 2020-21 నాటికి అన్ని పంటలు కలిపి సాగు విస్తీర్ణమైన భూమి 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు చేరుకున్నది. ఈ ఏడేండ్లలో సాగు విస్తీర్ణం 60 శాతానికి పైగా పెరిగింది. పెరిగిన సాగు విస్తీర్ణం, దిగుబడులకు అనుగుణంగా పంటల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తున్నది. వివిధ పంటల సేకరణ కోసం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందే బ్యాంకుల ద్వారా నిధులు సేకరించి, యంత్రాంగాన్ని సమాయత్తం చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణ అనంతరం ఆరు నెలలకు రైతులకు నిధులు విడుదల చేస్తుంది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల లోపు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వడ్డీ భారాన్ని కూడా మోస్తున్నది. కరోనా సమయంలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించింది. ఎఫ్‌సీఐకి గోదాముల సామర్థ్యం లేకున్నా, ప్రభుత్వ గోదాములతో పాటు ఫంక్షన్ హాళ్లు, రైతు వేదికలు, రైస్ మిల్లులు, పత్తి మిల్లులు, స్కూళ్లు, కళాశాల భవనాలు తదితర స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం నిల్వకు ఉపయోగించింది. రైతులకు అండగా నిలువాలన్న చిత్తశుద్ధి ఉంటే, ఏ రకంగానైనా ధాన్యం కొనవచ్చు. ఉదాహరణకు గతంలో మక్కల ధరలు పూర్తిగా పడిపోయాయి. అన్నదాతలు నష్టపోవద్దన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ క్వింటాలుకు రూ.1,650 పెట్టి కొనుగోలు చేశారు. ఆ మేరకు వాటిని బహిరంగ వేలం ద్వారా రూ.1200లకే అమ్మాల్సి వచ్చింది. నిజంగా కేంద్రం వద్ద నిల్వలుంటే, పండించిన పంటను కొనుగోలు చేసి, వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలి. లేదా వివిధ దేశాలకు ఎగుమతి చేయాలి. లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా రైతుల ప్రయోజనాలు కాపాడాలి.
వివిధ రాష్ర్టాల్లో పండించే ధాన్యాన్ని లేదా వాటిద్వారా వచ్చే బియ్యాన్ని సేకరించాలన్న లక్ష్యంతోనే 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. ఎఫ్‌సీఐ ఏర్పడినప్పటి నుంచి నేటివరకు యథావిధిగా కొనుగోళ్లు చేస్తున్నది. కానీ ఈ ఏడాది బీజేపీ సర్కారు మోకాలడ్డుతున్నది. ఇన్నాళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వలేదు. నిల్వలు ఎక్కువగా ఉంటే, ఆ నిబంధనలు పంజాబ్‌కు కూడా వర్తించాలి కదా. తెలంగాణ రైతులకు మాత్రమే ఎందుకు వర్తిస్తాయో చెప్పాలి. స్థానిక బీజేపీ నాయకులు కూడా పూటకో మాట మాట్లాడుతున్నారు.
కేంద్రానికి గ్రామీణ ఆర్థికవ్యవస్థ మీద అవగాహన లేదని మొన్న మా మంత్రుల బృందం భేటీలో అర్థమైంది. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు తేడా కేంద్రానికి తెలియడం లేదు. పంజాబ్‌లో రెండు పంటలు కొంటున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరు? అక్కడ గోధుమలను పిండి పట్టిస్తరా? పత్తిని బేల్స్ చేసిస్తున్నారా? పప్పు దినుసులను పప్పుచేసి ఇస్తేనే తీసుకుంటున్నారా? మరి మా వడ్లను మాత్రం బియ్యం చేసి ఇస్తేనే తీసుకొంటామని ఎందుకంటున్నరు? వాటి మాదిరిగానే వడ్లను కూడా వడ్లుగానే తీసుకోవాలనేది మా ప్రధాన డిమాండ్.
దశాబ్దాలుగా చితికిపోయిన తెలంగాణ రైతులు కొత్తగా వచ్చిన సాగునీటితో అధిక శాతం వరి సాగుకే మొగ్గు చూపారు. యాసంగిలో తెలంగాణ నేల దొడ్డురకాల సాగుకే అనుకూలం. ఈ నేపథ్యంలో హఠాత్తుగా తెలంగాణ వరి ధాన్యం కొనబోమని కేంద్రం నిర్ణయించడం తెలంగాణ రైతాంగానికి అశనిపాతమే. దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి, దాదాపు 700 మంది మరణానికి కారణమైన బీజేపీ ప్రభుత్వం ఆఖరికి రైతులకు చేతులెత్తి మొక్కి క్షమాపణ చెప్పింది. అదే రీతిలో తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పి కేంద్రం వడ్లు కొనేలా కేసీఆర్ నాయకత్వంలో వీరోచిత పోరాటం సాగిస్తాం.
ఆహారధాన్యాల సేకరణ విషయంలో దేశమంతా ఒకే పాలసీ ఉండాలి. పంజాబ్‌కు ఒక నీతి, గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఇంకో నీతి ఉండదు. కొన్ని రాష్ర్టాలు ఉద్యమించాయి. మేము సైతం తెలంగాణ రైతుల పక్షాన ఉద్యమించి విజయం సాధిస్తాం. పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ అవార్టులు, రివార్డులు తెచ్చుకుంటున్న తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపడాన్ని యావత్ దేశం తప్పుపడుతున్నది. నాటి ఆత్మగౌరవ నినాద స్ఫూర్తితో ‘పంజాబ్‌లో కొంటరెట్ల.. ఇక్కడ కొనరెట్ల?’ అని ప్రశ్నిస్తూ పోరాటం సాగించి కేంద్రం మెడలు వంచాలి.
కేంద్రం రాసుకున్న ఫార్మాట్‌లో రాష్ర్టాల నుంచి బలవంతంగా లేఖలు తీసుకొని, బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చారంటూ రాష్ర్టాలపై నిందలు వేయడం దుర్మార్గం. తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుంది. మరి రా రైస్ ఇవ్వాలంటే ఎలా సాధ్యమో కేంద్రమే సమాధానం చెప్పాలి. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధం. రా రైస్‌గా చేసుకుంటారో? బాయిల్డ్ రైస్ చేసుకుంటారో? కేంద్ర ప్రభుత్వం ఇష్టం.
–పువ్వాడ అజయ్‌కుమార్
(వ్యాసకర్త: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి)