టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరగానే తెలంగాణలోని భూములపై రీసర్వే నిర్వహిస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. 1954లో నిర్వహించిన సర్వే తప్ప ఇంతవరకూ మళ్లీ సర్వే నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూముల వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయన్నారు. మధ్యలో భూభారతి కార్యక్రమం కింద నిర్వహించిన సర్వే అర్ధాంతరంగానే ముగిసిందన్నారు.
-ప్రభుత్వ, ప్రైవేటు భూములు మాత్రమే ఉండాలి -వచ్చింది స్వయం పాలన అందిస్తాం సుపరిపాలన -ప్రజల ఆశలు వమ్ము చేయం -తెలంగాణ తహశీల్దార్స్ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేటీఆర్

తెలంగాణలో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు మాత్రమే ఉండాలి తప్ప ఇతర కేటగిరీల వారిగా భూములు ఉండడాకి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విధానాలు ఉమ్మడి రాష్ట్రంలో అమలు కాకపోవడం వల్లే తెలంగాణ భూములన్నింటినీ సీమాంధ్ర అధికారులు కొల్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగులపై భారం పడకుండానే పారదర్శకంగా సర్వే నిర్వహిస్తామని చెప్పారు. నాంపల్లిలోని అగ్రి డాక్టర్స్ భవన్‌లోని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందజేయడంలో ఆర్డీవో, ఎమ్మార్వోల పాత్ర కీలకమన్నారు. 60ఏళ్ల ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడు స్వయం పాలన వచ్చిందని, ఇక సుపరిపాలన అందిస్తామని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నింటినీ త్రికరణ శుద్ధితో అమలు చేసి తీరుతామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంతో వచ్చే ఫలాలు కింది స్థాయి ప్రజలకు అందించి వారి కళ్లల్లో వెలుగులు చూసినప్పుడే తనకు సంతృప్తి కలుగుతుందన్నారు. తెలంగాణ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఉండడానికి వీల్లేదని కేసీఆర్ మాట్లాడుతుంటే ఆంధ్ర ప్రాంతం నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ మొదటి నుంచి ఇదే మాట చెబుతున్నారని ఇందులో తప్పేమున్నదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే కలెక్టర్లు, ఉన్నతాధికారులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. రాజకీయ అవినీతిని అంతమొందించే దిశగా అధికారులు పని చేయాల్సి ఉందని, అది సీఎం కార్యాలయం నుంచి ప్రారంభించాలని కోరారు. ఇప్పటి వరకు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ సీఎంగా రాబోతున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. తాండూర్ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. ప్రజల అభివృద్ధికి ఎమ్మార్వోలు తీవ్రంగా కృషి చేయాలని కోరారు.
తెలంగాణ ఉద్యోగుల ఐక్య వేదిక చైర్మన్ కే రాములు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి రావాలంటే రెవెన్యూ, వ్యవసాయ శాఖల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ తహశీల్దార్‌ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్య 158 ఉంటే అందులో 74మంది ఆం్రధ్రాప్రాంతానికి చెందిన వారుంటే 38 మంది మాత్రమే తెలంగాణలో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల ఐక్య వేదిక అధ్యక్షుడు పద్మాచారి, యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ కుమారస్వామి, ప్రజా కవి, గాయకులు గోరటి వెంకన్న, తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బీ నర్సింహ్మారెడ్డి, తెలంగాణ అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్‌కుమార్ ఘోష్, నాయకులు టీ రాజారత్నం, బాసిత్, సురేందర్‌రెడ్డి, మహిళా నాయకులు అఫ్జల్‌బేగం, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధికి రూ.60లక్షల విరాళం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.60లక్షలు అందజేస్తున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించారు. ఆదివారం తెలంగాణ అగ్రి డాక్టర్స్ భవన్‌లో జరిగిన తెలంగా తహశీల్దార్స్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సమక్షంలో ఆ సంఘం అధ్యక్షులు లచ్చిరెడ్డి ఈ విషయం తెలిపారు. తెలంగాణలోని తహశీల్దారుల ఒక రోజు వేతనం సుమారు రూ.10లక్షలు అవుతుందని, అదే విధంగా తెలంగాణ వీఆర్‌వోల సంఘం తరుపున రూ. 50లక్షలు ఒక రోజు వేతనంగా అందజేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి ప్రకటించారు. జైళ్ల శాఖ ఉద్యోగులు కూడా సీఎం సహాయ నిధికి రూ.30లక్షలు ఇచ్చారని ఈ సందర్భంగా వారిని కూడా అభినందించారు.