దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని, రాష్ట్ర ఆదాయ వనరులకు విఘాతం కలిగించేలా మాత్రం ఉండరాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో గురువారం జరిగిన వివిధ రాష్ర్టాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రాజేందర్ పాల్గొన్నారు. దేశంలో అన్ని రాష్ర్టాల్లోనూ జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై ఆయా రాష్ర్టాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోడానికి ఉద్దేశించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశమనంతరం ఈటెల టీ మీడియాతో మాట్లాడుతూ, జీఎస్టీ విధానం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఆదాయాన్ని కోల్పోతున్నదో వివరంగా చెప్పామని అన్నారు. మద్యం, పొగాకు ఉత్పత్తులు, ఆహారధాన్యాలు, పెట్రోలు తదితరాలను గూడ్స్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)నుంచి మినహాయించాలని కోరారు.
అదే విధంగా వినోదపు పన్ను, వ్యవసాయ మార్కెట్ ఛార్జీలు, బెట్టింగ్ పన్ను తదితరాలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం 2007 మొదలు 2013 వరకు సుమారు రూ.12,386 కోట్ల మేరకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉన్నదని, ఇందులో తెలంగాణ వాటా దాదాపుగా రూ. 5000 కోట్ల వరకు ఉండవచ్చని, ఇప్పటివరకూ దాన్ని చెల్లించలేదని, ఇకపై జీఎస్టీని ప్రవేశపెడితే దాని ద్వారా రాష్ర్టాలకు ఏర్పడే ఆర్థిక భారాన్ని ఏ విధంగా కేంద్రం అందజేస్తుందో స్పష్టత ఇవ్వాలని కేంద్ర అరుణ్‌జైట్లీని కోరినట్లు తెలిపారు.
జీఎస్టీని ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం కాకపోయినప్పటికీ దీని అమలు వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులకు ఏర్పడే ఇబ్బందులపై వివరణనిస్తూ కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సమావేశం దృష్టి కి తీసుకెళ్ళామని రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక పరిపాలనా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటోందని, అవి పన్నుల విధింపు ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకునే అధికారాలకు జీఎస్టీ అడ్డుగా ఉండరాదని కూడా స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. జీఎస్టీపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేంత వరకు కొన్ని అంశాలపై ఆందోళన ఉండడం సహజమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలుపర్చడంలో ఏ మాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ఇప్పటికే పలు హామీల అమలు ప్రారంభమైందని, ఆడంబరాలు, ప్రకటనలు, ప్రగల్భాలకంటే తమ పనితనాన్ని చేతల్లోనే చూపిస్తామని స్పష్టం చేశారు.