-2019 కాదు.. 2090లోనూ అధికారం దక్కడం కల్ల -టీఆర్‌ఎస్ గెలిచినందుకే జేపీ బాధ -గజ్వేల్ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం: హరీశ్‌రావు -తెలంగాణలో గజ్వేల్ ఆదర్శంగా ఉండాలి: కేకే -సీఎం మా ఎమ్మెల్యే కావడం గర్వకారణం: నర్సారెడ్డి -టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి -ఆయన వెంటే 52 మంది సర్పంచులు,36 మంది ఎంపీటీసీ, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు

పక్కరాష్ర్టానికి చెందిన చంద్రబాబు 2019లో తెలంగాణలో టీడీపీదే అధికారం అంటున్నాడు. ఉత్తర తెలంగాణలో ఒకటి, రెండు సీట్లు తప్ప మిగిలిన నాలుగు జిల్లాల్లో ఆయనకు బోణీయే లేదు. నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అయినా అధికారంలోకి వస్తాడట అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 2019 కాదు.. 2090కి కూడా తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాదన్నారు. హైదరాబాద్‌లో టీడీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డు తప్పదని పునరుద్ఘాటించారు. తెలంగాణను చివరి నిమిషం వరకు అడ్డుకున్నందుకు తెలంగాణలో నీకు స్థానం లేదుగాక లేదు. నీ అడ్రస్ గుంటూరే. తెలంగాణ పోరాటాల గడ్డ.
నీలాంటి వారి నాయకత్వాన్ని మేం అంగీకరించం అన్నారు. సోమవారం తెలంగాణభవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తూంకుంట నర్సారెడ్డితోపాటు ఆయన అనుచరులైన ఆ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ఓటమితో బాధ పడకుండా తెలంగాణ పునర్‌నిర్మాణంలో గజ్వేల్ అభివృద్ధి చెందాలని నర్సారెడ్డి పార్టీలో చేరారని ప్రశంసించారు. గజ్వేల్‌లో వైఎస్ హయాంలో తాగునీరు కోసం కొబ్బరికాయ కొట్టిస్తే ఇప్పటికి ముగ్గురు సీఎంలు మారినా సమస్య అలాగే ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే గజ్వేల్ ప్రజల కష్టాలు దూరం చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. చేరికలకు ఇది ప్రారంభం మాత్రమేనని, ఇకపై ప్రతిరోజూ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, మహబూబ్‌నగర్ నుంచి వరంగల్ వరకు చేరికలుంటాయని చెప్పారు.
జేపీ సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావి లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావి అని హరీశ్ రావు మండిపడ్డారు. టీఆర్‌ఎస్ విజయాన్ని జీర్ణించుకోలేక హరీశ్‌రావుపై 80, కేసీఆర్‌పై 50 కేసులున్నాయని కువిమర్శలు చేస్తున్నాడన్నారు. ఏసీ గదుల్లో కూర్చొని కేసులు తెచ్చుకోలేదని, తెలంగాణ కోసం ఉద్యమించి నందుకు ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఆ కేసులు పెట్టాయన్నారు. ప్రజలిచ్చిన తీర్పును ఎవరైనా గౌరవించాలి తప్ప డొంకతిరుగుడుగా మాట్లాడితే ప్రజలే తిప్పికొడదారని అన్నారు.
నర్సారెడ్డి నా కొడుకులాంటివాడు: కేకే గజ్వేల్ నా సొంత ఊరు. నర్సారెడ్డి నాకు కొడుకులాంటివాడు అని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వొద్దని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెప్పిన తర్వాతే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని స్పష్టం చేశారు. ఆనాడు కాంగ్రెస్ కార్యకర్తలు నర్సారెడ్డి వెంట ఉన్నారని, నేడు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి పోదామంటే నర్సారెడ్డి వారి వెంట నిలిచాడని తెలిపారు. తను చాలా మంది పెద్దపెద్ద నేతలతో మాట్లాడానని, కానీ కేసీఆర్‌కున్న విజన్, అభివద్ధి ఎజెండా మరెవరివద్దా చూడలేదని తెలిపారు. అభివృద్ధిలో గజ్వేల్‌కు ప్రత్యేక స్థానం కావాలి: నర్సారెడ్డి అభివృద్ధిలో గజ్వేల్‌కు ప్రత్యేక స్థానం కావాలనే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గజ్వేల్ ఎమ్మెల్యే అంటే తమకు కూడా గర్వంగానే ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేశవరావు, హరీశ్‌లతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఆనంతరం పార్టీలో చేరిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు కేకే, హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. పార్టీలో చేరిన వారిలో డీసీసీబీ వైస్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన 52 మంది సర్పంచులు, తూప్రాన్ జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, కొండపాక జెడ్పీటీసీ సభ్యురాలు మాధురి, ములుగు జెడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణ, 36 మంది ఎంపీటీసీ సభ్యులు, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విద్యకుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, రహీం, ఆరుగురు ప్రాథమిక వ్యవసాయ సంఘాల అధ్యక్షులు, పీసీసీ కార్యదర్శి ఉడెం కష్ణారెడ్డి, పాడి సహకార సమాఖ్య అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నర్సింహాచారి తదితరులు ఉన్నారు.