భాగ్యనగరం ఇక మనకు దక్కదు తెలంగాణకు రక్షణ కవచం టీఆర్‌ఎస్ రెండు ఓట్లూ కారు గుర్తుకే వేయాలి ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
మంచిర్యాల/సంగారెడ్డి/నిజామాబాద్:టీడీపీ, బీజేపీలకు ఓటేస్తే హైదరాబాద్‌కు మరణశాసనం రాసినట్లేనని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను మనది కాకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు.
రెండు రోజుల కిందట ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ నేత నరేంద్రమోడీ మాట్లాడుతూ హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. ఇక్కడ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆంధ్ర ప్రాంతంలో ప్రచారానికి వెళ్లి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాం, లేకపోతే రెండో రాజధానిగా చేస్తాం అని చెబుతారని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను మనకు కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. టీడీపీని చచ్చిన శవం అని అభివర్ణించిన కేసీఆర్.. టీడీపీ శవాన్ని మోడీ భుజాన వేసుకుని తిరుగుతున్నాడని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్, నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రచార సభల్లో కేసీఆర్ మాట్లాడారు.
పవన్ కల్యాణ్ నీకెన్ని గుండెలు? చిటికెనేలంత మనిషివి. కేసీఆర్ తాటా తీస్తా అంటవా? ఇంత నోటి దురుసా? ఇంత మస్తీనా? ఇంత అహంకారమా? నీ తాత, జేజమ్మ వచ్చినా నన్నేమీ చేయలేరు అని మండిపడ్డారు. చంద్రబాబూ! నువ్వు ఆంధ్రా కుక్కలా మొరుగుతున్నవ్..? నన్నే తరిమికొడతావా? నేను తలచుకుంటే నువ్వు ఇంటినుంచి కాలు బయటపెట్టేవాడివా? అని ప్రశ్నించారు.
బీజేపీ ఖతర్నాక్ పార్టీ మోడీ నీకసలు పరిజ్ఞానం ఉందా? తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కలుస్తావా? తెలంగాణ ఇస్తే తల్లి చచ్చింది.. బిడ్డ బతికిందా? ఏ తల్లి చచ్చింది? ఏ బిడ్డ బతికింది? సన్యాసి మోడీ.. తెలంగాణ ఇస్తే భరతమాత ఏడ్వలేదు సంతోషంగా నవ్వింది అని చెప్పారు. బీజేపీ ఖతర్నాక్ పార్టీ. తెలంగాణకా దుష్మన్ మోడీ. ఆంధ్రోళ్లతో కొట్లాట ఇంకా అయిపోలేదు. ఉద్యోగులు, ఆస్తుల పంచాయతీ ఒడవలే. ఇవన్నీ సవ్యంగా జరగాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అహంకారం, అజ్ఞానం వెర్రితలలు వేసినట్లు మోడీ హైదరాబాద్ ఏ ఒక్క ప్రాంతానికి చెందింది కాదంటున్నడు.
నమస్తే తెలంగాణలో ఎన్నికల స్పెషల్ పులౌట్ చదివి ఉంటరు. చదవనోళ్లు దయచేసి కచ్చితంగా చదవాలి. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మోడీ ఏమన్నడో తెలుసుకోండి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను వెంటపెట్టుకుని తాను తెలంగాణలో పర్యటించటం సరైన సంకేతమే ఇస్తున్నదని అంటున్నడు. చచ్చిన శవం టీడీపీని భుజాన వేసుకొని ఊరేగుతున్నడు. కేసీఆర్ చెప్పలేదనకండి. ఉద్యమకారుడిగా చెబుతున్నా. మోడీ పక్కా తెలంగాణ దుష్మనే. మోడీ.. హైదరాబాద్ నీ అబ్బసొత్తా? ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావ్? హైదరాబాద్ మాది కాకుంటే ఎవరిదైతది? నిజామాబాద్‌కు పేరెట్లా వచ్చింది? నిజాం పేరుమీద కట్టిన ఊరు కాబట్టి నిజామాబాద్ అయ్యింది.
హైదరాబాద్ అంటే. నాలుగు వందల సంవత్సరాల క్రితం మా తాతముత్తాతలు కట్టిన శిస్తు పైసలతో కట్టిండ్రు హైదరాబాద్‌ను. ఆంధ్రోళ్ల ఓట్ల కోసం మోడీ దీన్ని దేశానికి రెండో రాజధానిగా చేస్తానంటున్నాడు. వైఎస్ 2009 ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్ పూర్తయ్యిందోలేదో హైదరాబాద్‌కు వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకోవాలని అనలేదా? అట్లనే హైదరాబాద్‌పై మోడీ కిరికిరి పెడతడు. ఆంధ్రోలంతా ఆంధ్రోళ్లే. లంకలో పుట్టినవన్నీ రాక్షసులే. కేసీఆర్ చెప్పలేదనేరు. హైదరాబాద్‌కు ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ ద్రోహి చంద్రబాబును ఒకవైపు, సినిమా యాక్టర్‌ను ఇంకోవైపు కూర్చోబెట్టుకొని మోడీ ఆడుతున్న ఆటలపై జాగ్రత్తగా ఉండాలి. మోడీ ప్రధాని అయితే తెలంగాణకే నష్టం. మోడీని ప్రధానిని కానియ్యరాదు. వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ 111 అంటున్నడు నరేంద్రమోడీ. అదంతా ఉత్తదే. పంగనామాలేనని తెలుసుకుంటలేడు. పిచ్చి నరేంద్రమోడీ. మోడీ బోడి అయ్యిండు అన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు తమ బినామీ అస్తులు కాపాడుకోవడానికే మోడీ రూపంలో వస్తున్నారన్నారని ఆరోపించారు.
కోరుకున్న తెలంగాణ రాలేదు 14 ఏళ్ల సుదీర్ఘ మహోద్యమం ఫలించింది. తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ వచ్చినా మనం అనుకున్నట్లు రాలేదు. ఇంకా వెలితి ఉన్నది అని కేసీఆర్ చెప్పారు. ఎన్నో కష్టాలు అనుభవించాం. కొద్దిపాటి నిర్లక్ష్యం మనల్ని ఆరుదశాబ్దాలు ఏడిపించింది. 2వేల మంది మన పిల్లలు చనిపోయారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు ఎవరిచేతుల్లో ఉంటే బాగుంటుందో నిర్ణయించుకోవాలి అన్నారు.
స్థానిక నేతల కోరికతోనే గజ్వేల్ నుంచి పోటీ గజ్వేల్ నుంచి పోటీ చేయాలని తనకు తాను నిర్ణయించుకోలేదని కేసీఆర్ చెప్పారు. పార్టీల కతీతంగా స్థానిక నాయకులు కోరినందునే ఒప్పుకున్నానన్నారు. గజ్వేల్ పరిధిలోని ఎర్రవల్లిలోనే భూమి కొనుక్కుని కూరగాయ పంటలు పండిస్తున్నా. ఓ ఇల్లు కట్టుకున్నా. ఇక్కడే ఉంటా. ఇక గజ్వేల్‌తోనే నా అనుబంధం. శేష జీవితాన్ని ఇక్కడే గడుపుతా. ఈ గజ్వేల్ మట్టిలోనే కలుస్తా అని చెప్పారు. గజ్వేల్‌కు ఏదంటే అది చేస్తానని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గజ్వేల్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉంటుందని గుర్తు చేస్తూ భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. గజ్వేల్‌ను బంగారు తునకగా మారుస్తామని హామీ ఇచ్చారు.
మా ఎన్నికల ప్రణాళిక ఎగతాళి చేసి.. మాదే కాపీ కొట్టారు కాంగ్రెస్ పార్టీవి కేవలం ఆపదమొక్కులు మాత్రమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. వారు ప్రజలకు చేసేదేమీ ఉండదన్నారు. తాము ఎన్నికల ప్రణాళిక వెల్లడించగానే కాంగ్రెస్ వాళ్లు ఎగతాళి చేశారని చెప్పారు. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్య అన్నారని గుర్తు చేశారు. తిరిగి ఇప్పుడేమో రుణమాఫీ అంటూ తాము చెప్పినదాన్నే కాపీ కొట్టారని కేసీఆర్ చెప్పారు. మేం లక్ష రూపాయల రుణమాఫీ అంటే వాళ్లు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటున్నారంటూ ఇది ఆచరణ సాధ్యం కాని హామీ అన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ అంటేనే రూ. 12 వేల కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. మరి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే రూ.24 వేల కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. అది సాధ్యం కాదు కాబట్టే తాను అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేయలేనన్నారు. మనం రుణమాఫీ అన్నాం కాబట్టి కాంగ్రెస్ కూడా అదే పాట పాడుతున్నదని ఆరోపించారు. గతంలో ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ రూ.1.80 ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. అయితే, మ్యానిఫెస్టోను కాపీ కొట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కూడా అదే జరగబోతోందని అన్నారు.
రానున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఆంధ్రా పార్టీలను బొందబెడదాం. వచ్చేది ముమ్మాటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. ఈ మాట నేననడం లేదు. మీడియా, ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి అని అన్నారు. తమ సర్వేలో 90కంటే ఎక్కువ సీట్లు వస్తాయని వెల్లడయ్యిందన్నారు. ఆంధ్రా పార్టీలను బొందపెడదాం. అదే మనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నా రు. సామంతులుగా ఉందామా? స్వతంత్రులమవుదామా? ఆలోచించుకోవాలన్నారు. వచ్చిన తెలంగాణను మనమే పాలించుకుందామన్నారు. రెండు ఓట్లు కారుగుర్తుకే వేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు రక్షణ కవచం టీఆర్‌ఎస్ హైదరాబాద్‌లో అసద్ భాయ్‌ని గెలిపించుకుంటున్నం. మిగతా ఎంపీ సీట్లన్నీ మనమే గెలవాలే. సకల జనుల సమ్మెలో నాతో కలిసొచ్చిన ఉద్యోగులు, టీచర్లు, న్యాయవాదులు, డాక్టర్లు అన్నివర్గాల ప్రజలు తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి నాతో సహకరించాలే. తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఆలోచించి తీర్పు చెప్పాలి. తెలంగాణకు రక్షణ కవచం టీఆర్‌ఎస్. స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగిన మనమే అధికారంలోకి రావాలి అన్నారు. కవిత నా బిడ్డ. పుట్టినప్పుడు కవిత అని పేరుపెట్టిన. తెలంగాణ సంస్కతి పరిరక్షణ కోసం పోరాటంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమెపేరు బతుకమ్మ అయ్యింది. ఈమెను ఆదరించండి అన్నారు కేసీఆర్. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్‌పై తెలంగాణ ఉద్యమంలో 167 కేసులు బనాయించారని గుర్తు చేశారు. ఇటువంటి ఉద్యమకారులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
చంద్రబాబుకు పిచ్చిపట్టింది: హరీశ్ గజ్వేల్ సభలో టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మాట్లాడుతూ చంద్రబాబుకు పిచ్చిపట్టిందన్నారు. ఆయనకోసం ఎర్రగడ్డ ప్రభుత్వాస్పత్రిలో బెడ్ సిద్ధంగా ఉన్నదన్నారు. గజ్వేల్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం కార్యకర్తలు కుక్కల్లా పనిచేయాలని చంద్రబాబు కోరడం దారుణమన్నారు. ఇక్కడి పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు కుక్కల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీకి 4సీట్లు కూడా రావని, అయినా చంద్రబాబు గెలిచిన అభ్యర్థులకు మంత్రి పదవులు ఇస్తానంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం: కవిత నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు జిల్లాలో పెద్దనేతలైన నీళ్ల మంత్రి సుదర్శన్‌రెడ్డి, డీ శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, సురేష్‌రెడ్డిలాంటి మహాయోధులు ఉన్నప్పటికీ సోనియా ముందు ఏనాడూ జై తెలంగాణ అన్న పాపానపోలేదని విమర్శించారు. ఏనాడూ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించని వీరు తెలంగాణను తామే ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. బీజేపీ తాము మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదికాదని చెప్పడం అవహేళన చేసినట్లేనన్నారు. తెలంగాణను సాధించడంలో టీఆర్‌ఎస్, కేసీఆర్ పాత్ర పెద్దన్నలాంటిదని వివరించారు. తెలంగాణ పునర్నిర్మాణంసైతం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు.
ఈ సభల్లో నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తా, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కరిమెళ్ల బాబురావు, టీఆర్‌ఎస్ ఆదిలాబాద్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్, ఎమ్మెల్యే అభ్యర్థులు నల్లాల ఓదెలు, దివాకర్ రావు, టీబీజీకేఎస్ నేత కెంగర్ల మల్లయ్య, జంగిలి రవీందర్, మేడిపల్లి సంపత్, మండల ఇన్‌చార్జిలు చేకూరి సత్యనారాయణ రెడ్డి, మూల రాజిరెడ్డి, బాపిరెడ్డి, విద్యార్థి జేఏసీ నేత బైరి నరేష్, కవి రచయిత సుందిళ్ల రాజయ్య, మందమర్రి పట్టణ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, ఎస్. ప్రభాకర్, అబ్బాస్, తిరుపతి రెడ్డి, టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, రాజశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు సాదనబోయిన కృష్ణ,సంజీవ్, చిర్రకుంట కొంరయ్య, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జి రాజయ్యయాదవ్, మాజీ మంత్రి ఎంఎ కష్ణ, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.