సీమాంధ్రను అభివృద్ధి చేసే విధానాన్ని చూసి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో, తెలంగాణతో పోటీ పడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. మంగళవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన మాట్లాడారు. -రెండు రాష్ర్టాలను కలుపుతాననడం అవివేకం -తెలంగాణలో అధ్యక్ష పదవిని కొనసాగించలేని దుస్థితి టీడీపీది: హరీశ్‌రావు ధ్వజం

చంద్రబాబుకు అభివృద్ధి గురించి మాట్లాడేంత సీన్ లేదని, ఆయన అభివృద్ధి ఏమిటో ప్రజలందరికీ తెలుసని దుయ్యబట్టారు. బాబు చేసిన అభివృద్ధి చూసి టీడీపీని తెలంగాణలో ప్రజలు బొందపెట్టారని విమర్శించారు. ప్రజలు 60 ఏళ్లుగా పోరాడి సాధించుకున్న తెలంగాణను, తిరిగి ఆంధ్రాలో కలుపుతామంటూ చంద్రబాబు మాట్లాడడం అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇంకా టీడీపీలో ఎలా కొనసాగుతున్నారని, తెలంగాణ నేతల వైఖరేంటో స్పష్టం చేయాలని నిలదీశారు. తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికీ కేటాయించలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందన్నారు. జిల్లా పరిషత్‌లలో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలోనే బంగారు తెలంగాణ నిర్మాణమవుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రామీణ, పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు.