రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన స్వైన్‌ఫ్లూ ప్రభావాన్ని రాష్ట్రంలో తగ్గించడానికి ఇక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగా ఉపయోగపడ్డాయని పేర్కొంది.

-ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కేంద్ర బృందం ప్రశంస -ఆరోగ్యశ్రీలో చేర్చడంవల్ల పేదలకు లాభం -పత్రికల్లో వార్తలు షాక్‌కు గురిచేశాయి -సీఎంతో కేంద్ర బృందం సారథి డాక్టర్ అశోక్‌కుమార్ -మరింత సమర్థంగా వైద్యారోగ్యశాఖ : సీఎం కేసీఆర్ వెల్లడి వచ్చే ఐదేండ్ల వరకూ సరిపోయేలా మందులు అందుబాటులోకి తెచ్చుకోవడం, స్వైన్‌ఫ్లూ బాధితులకు ఉచితంగా వైద్యం అందించడం గొప్ప విషయమని అభిప్రాయపడింది. రెండురోజులపాటు ఈ బృందం నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ దవాఖానలను సందర్శించింది. అక్కడ స్వైన్‌ఫ్లూ రోగులకు అందిస్తున్న చికిత్స, నివారణకు తీసుకున్న చర్యలను పరిశీలించింది. అనంతరం శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ఆయన క్యాంపు కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు ప్రజారోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ శశిఖరే, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రణయ్‌కుమార్ కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎంతో మాట్లాడిన బృందం సభ్యులు.. పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. ఆస్పత్రుల్లో పరిస్థితులను చూసి తాము షాక్‌కు గురయ్యామంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు తమను విస్మయానికి గురి చేశాయని కేంద్ర ప్రత్యేక బృందం ప్రతినిధి డాక్టర్ అశోక్‌కుమార్ సీఎంతో చెప్పడం గమనార్హం. ఆరోగ్యశ్రీలో స్వైన్‌ఫ్లూను చేర్చడంవల్ల పేదలకు మెరుగైన వైద్యం, అందులోనూ ఉచితంగా అందుతుందని ఆయన సీఎంతో అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ప్రభావాన్ని బాగా తగ్గించడానికి ఉపయోగపడ్డాయని చెప్పారు.
స్వైన్‌ఫ్లూపై యుద్ధం ప్రకటించి, రాష్ట్ర రాజధాని నుంచి ఏరియా ఆస్పత్రుల వరకు మందులను అందుబాటులో ఉంచడం తమ దృష్టికి వచ్చిందని అశోక్‌కుమార్ సీఎంతో అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో, దేశాల్లోని చాలా రాష్ర్టాల్లో స్వైన్‌ఫ్లూ ప్రభావం ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా స్వైన్‌ఫ్లూ చలికాలంలో వ్యాప్తి చెందుతున్నదని వారన్నారు. స్వైన్‌ఫ్లూపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించిందన్నారు. స్వైన్‌ఫ్లూ బాధితులకు ఉచితంగా వైద్యం అందించడం గొప్ప విషయమని, ఆరోగ్యశ్రీలో కూడా చేర్చడంవల్ల పేదలుకూడా వైద్యం చేయించుకోగలిగారని డాక్టర్ అశోక్‌కుమార్ చెప్పారు.
సవాళ్ళను ఎదుర్కొనేలా వైద్య, ఆరోగ్య శాఖ: సీఎం కేసీఆర్ వైద్యపరమైన సమస్యలు, సవాళ్ళు, సంక్షోభాలు ఎదురైనప్పుడే కాకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సమర్థంగా ఎదుర్కొనే విధంగా రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖను తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ కేంద్ర బృందానికి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వారికి వివరించారు. గత ప్రభుత్వాలు సమస్యలు తలెత్తినప్పుడు హడావుడి చేయడం తప్పితే.. శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఈ లోపాన్ని సవరిస్తున్నదని చెప్పారు.
వేసవిలో కొన్ని, వర్షాకాలంలో కొన్ని, చలి కాలంలో మరికొన్ని ఇలా కాలానుగుణంగా వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయని, ఆ సమయంలో హడావుడి చేయడంకన్నా ముందే ప్రజలకు అవగాహన కల్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఏ కాలంలో ఏ వ్యాధి ప్రబలుతుందో ముందే అంచనావేసి, దానికి పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకుని, గ్రామీణ ప్రాంతాల్లోకూడా అందుకు అవసరమైన మందులు ప్రభుత్వ దవాఖానల్లో ఉండేటట్లు చూస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆహారం, మంచినీళ్ళవల్లే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయని, వీటి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కువ బడ్జెట్, ఎక్కువ మంది సిబ్బంది వైద్య, ఆరోగ్య శాఖకే ఉన్నట్లు కేంద్ర బృందం దృష్టికి సీఎం తెచ్చారు. ఈ సానుకూలతను వందకు వంద శాతం ఉపయోగించుకుంటామని వెల్లడించారు. రోగ నిర్ధారణకు అవసరమయ్యే యంత్రాలుకూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచుతామన్నారు. కార్పొరేట్ దవాఖానలు కూడా సామాజిక బాధ్యతను పంచుకోవాలనే ప్రభుత్వ పిలుపునకు సానుకూలంగా స్పందించాయని తెలిపారు.
కేంద్రం స్పందించింది రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూపై తాము మాట్లాడిన వెంటనే కేంద్రంకూడా స్పందించి, పూర్తిస్థాయిలో సహకరించిందని సీఎం కేసీఆర్ కేంద్ర బృందంతో అన్నారు. అప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం కేసీఆర్ ఫోన్‌చేసి కేంద్రం సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బృందాన్ని మరోసారి రాష్ర్టానికి పంపాలని, జిల్లాల్లోని దవాఖానలనుకూడా సందర్శించేలా చూడాలని కేంద్ర మంత్రిని కేసీఆర్ కోరారు.
మేము షాక్ అయ్యాం: డాక్టర్ అశోక్‌కుమార్ స్వైన్‌ఫ్లూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు చాలా బాగుందని కేంద్ర బృందం నాయకుడు డాక్టర్ ఆశోక్‌కుమార్ కితాబిచ్చారు. వివిధ ఆస్పత్రులు సందర్శించినప్పుడు అక్కడ వైద్యం అందుతున్న తీరు కూడా తమకు తృప్తినిచ్చిందని అన్నారు. ఇదే సందర్భంలో కొన్ని పత్రికల్లో ఆస్పత్రుల్లోని పరిస్థితులపై కేంద్ర బృందం షాక్‌తిన్నట్లు వార్తలు వచ్చాయని, ఆ వార్తలు చూసి తాము షాక్ అయ్యామని డాక్టర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆరోగ్య శాఖ కార్యదర్శి సురేష్‌చందా, డీఎంఈ పుట్టా శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ బుద్ధప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.