Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

స్వపాలన, స్థానికులకే ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర పోరులో ‘610 జీవో అమలు, స్థానికులకే ఉద్యోగాలు’ నినాదాలు కీలకంగా ఉన్నాయి. సీమాంధ్ర పాలకులు తొక్కిపెట్టిన వాటిని తెలంగాణ ప్రభుత్వం బయటకుతీసింది. రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థలో మార్పులు చేసింది. కొత్త జోనల్‌ విధానం ఆమోదంపొందడంతో ఇకపై 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు బహుళ జోన్ల ప్రాతిపదికన కొత్త ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి.

జిల్లా, జోన్‌, బహుళ జోన్ల కింద ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియ కూడా సాగనున్నది. రాష్ట్రస్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. గ్రూప్‌-1 పోస్టులు కూడా మల్టీ జోనల్‌ స్థాయిలోనే నియమిస్తారు. దీనివల్ల పూర్తిగా ఉద్యోగాలన్నీ తెలంగాణ నిరుద్యోగులకే లభిస్తాయి. జిల్లాస్థాయి పోస్టుల్లో కూడా గ్రామీ ణ ప్రాంత జిల్లాల యువతకు ప్రాధాన్యం ఉండనున్నది. మల్టీజోనల్‌ పోస్టులు కూడా ఆయా ప్రాంతాల ప్రజలకే ఎక్కువగా లభిస్తాయి.పాత జోనల్‌ విధానంలో జనరల్‌ కోటా ఉండేది. దాన్ని ఆంధ్రా పాలకులు తమకనుగుణంగా మార్చుకున్నారు. ఆ కోటాను.. నాన్‌లోకల్‌ కోటాగా మార్చేశారు. ఇప్పుడు తెలంగాణలో 95 శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా జోన్ల వ్యవస్థ ఏర్పడింది. ఓపెన్‌ కోటా 5 శాతానికే పరిమితం. దీంతో ఆయా జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పరిధిలో ఉన్న నిరుద్యోగులకే ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

సరైన జోనల్‌ వ్యవస్థ లేకపోవడంతో రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగాల భర్తీ ఇబ్బందిగా మారింది. స్థానికులకే ఉద్యోగాలు లభించాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా పాత జోనల్‌ వ్యవస్థ ఉండటంతో… పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది. ఒక్కసారి పాత జోనల్‌ విధానంలో గ్రూప్‌-2, గ్రూప్‌-4 ఉద్యోగాలను భర్తీచేశారు. 2018లో రాష్ట్రపతి ఆమోదించిన ఉత్తర్వుల ప్రకారం గ్రూప్‌-1 ఉద్యోగాలు కూడా మల్టీజోనల్‌లోకి వచ్చాయి. జిల్లాల పునర్విభజన తర్వాత 31 జిల్లాలే అప్పటి ఉత్తర్వుల్లో చేర్చారు. తర్వాత ప్రజల కోరిక మేరకు మరో రెండు జిల్లాలు ఏర్పా టుచేయడంతో మరోసారి ప్రతిపాదనలు మార్చి రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వచ్చింది. దీంతో ఉపాధ్యాయ భర్తీలకు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఆగిపోయాయి. తాజాగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులతో గ్రూప్‌-1తో పాటు అన్ని గ్రూప్‌ ఉద్యోగాలు, ఉపాధ్యాయ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు అధికారులు శాఖల వారీగా సర్వీస్‌ రూల్స్‌ రూపొందించుకొని ఖాళీలను భర్తీచేయడానికి అవకాశం ఏర్పడిం ది. బదిలీల ప్రక్రియ పూర్తయితే ఖాళీల వివరాలపై క్లారిటీ రానున్నది. ఆ లెక్కలు వచ్చాక రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నది. యాభై వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా హామీ ఇవ్వడం శుభపరిణామం.

ఉద్యోగ నియామకాలు చేపట్టిన తర్వాత సాంకేతిక సమస్యలతో, స్థానికేతరులకు ఉద్యోగాలు వచ్చాయనే ఇబ్బందులతో.. అభ్యర్థులు ఆందోళన చెందకుండా అన్నీ పకడ్బందీగా సెట్‌రైట్‌ చేశాకే నియామక ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక దాదాపు లక్షా 32 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగింది. ప్రైవేటు రంగంలోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగాల సృష్టి జరిగింది.2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం తమ దగ్గరే పెట్టుకున్నది. కొత్త జోనల్‌వ్యవస్థ ఫైల్‌ను 16 నెలలు ఆల స్యం చేశారు. ఫలితంగా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ఆలస్యమైంది. ఫైల్‌ క్లియర్‌ చేయాలని మంత్రి కేటీఆర్‌ ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రంలో ఉన్నవారి చెవికె క్కలేదు. ఇప్పుడేమో ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందంటూ బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ వచ్చి ఉంటే నేడు రాష్ట్రంలో చాలామందికి ఉద్యోగాలు దొరికేవి. కానీ కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం దాన్ని కూడా పక్కనపెట్టింది. ఇంత బాధ్యతారహితంగా ఉంటూ కూడా బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం అర్థరహితం.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది కనుక రాష్ట్రంలో మరిన్ని కంపెనీల పెట్టుబడులు,యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు సహకరించాలి. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఎంతసేపు రాజకీయంగా పబ్బం గడుపుకోవడంపై తప్ప మరో అంశంపై శ్రద్ధ పెట్టడం లేదు. యువతకు అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టాలనుకోవడమే తప్ప వీళ్లకు వేరే పని చేతగావడం లేదు.

మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగ రేటు పెరిగిందని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ నివేదిక చెప్తున్నది. దేశంలో నెలరోజుల వ్యవధిలోనే 16 లక్షలకు పైగా ఉద్యోగాలు కోల్పోయారు. దీనివల్ల గత ఆగస్టులో దేశ నిరుద్యోగ రేటు 8.32 శాతానికి పెరిగింది. జాతీయ నిరుద్యోగిత రేటు జూలైలో 6.95 శాతం ఉండగా, ఆగస్టు నాటికి అది 8.32 శాతానికి పెరిగింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది. దేశంలోనే అత్యధికంగా హర్యానాలో నిరుద్యోగిత రేటు 35.7 శాతంగా ఉన్నది. యూపీలో 2017 జనవరి, ఏప్రిల్‌ త్రైమాసికంలో 7.9 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఈ ఏడాది మార్చి నాటికి 13.34 శాతానికి పెరిగింది. నిరుద్యోగిత రేటు బీహార్‌లో 13.6 శాతం, గోవాలో 12.6 శాతంగా ఉన్నది. తెలంగాణలో 4.2 శాతంగా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గుతున్నది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తెలంగాణ నిలదొక్కుకుని నిలబడగలిగింది. ఏ రాష్ట్రంలో అయినా అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలే ఉండవు. ప్రభుత్వరంగం కంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రైవేటు రంగంలోనే ఉంటాయి. తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రైవేటు ఉద్యోగ నియామకాలు జరిగాయి.

(వ్యాసకర్త: -వై.సతీష్‌రెడ్డి ,96414 66666, రాష్ట్ర సోషల్‌ మీడియా కన్వీనర్‌)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.