-ఒకే రోజు 91% ఇండ్లలో సర్వే -ఇంటింటి సమగ్ర సర్వే దిగ్విజయం -నేడు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం -ఎంసెట్ కౌన్సెలింగ్ యథాతథం -గవర్నర్, ఇరు రాష్ర్టాల సీఎంలు సహా సర్వేలో పాల్గొన్న పది జిల్లాల ప్రజలు -గిన్నిస్ బుక్‌లో ఎక్కాలంటున్న పరిశీలకులు -సొంతూళ్లలో జనం పండుగ సందడి -యాంత్రిక జీవనానికి ఒక రోజు విరామం -ఇండ్లలోనే ఉండి.. ఎన్యూమరేటర్లకోసం ఎదురుచూపు -ఆదిలాబాద్‌లో 99%, మెదక్‌లో 98 శాతం -దాదాపు అన్ని జిల్లాల్లోనూ 90శాతం పైనే
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర సామాజిక సర్వేను మరొక రోజు కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అధికారాలిచ్చింది. విస్తృత స్థాయిలో జరిగిన ఈ సర్వేలో కాలాతీతం కావడంతో అర్ధరాత్రి వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వే చేసినప్పటికీ మరికొన్ని ఇండ్లు మిగిలి పోయాయి.
హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో నేడు కూడా సర్వే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆయా కాలనీలు, బస్తీలు కవర్ కాలేదనే సమాచారం రావడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ బుధవారం కూడా ఈ సర్వే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. పైగా ఎన్యూమరేటర్లు అందరికీ సెలవు ప్రకటించిన ప్రభుత్వం ఎక్కువ మంది ఉద్యోగులు, టీచర్లు ఈ సర్వేలో పాల్గొంటున్నందున బుధవారం పబ్లిక్ హాలిడేగానే ప్రకటించింది. దీంతో బుధవారం సర్వే చేసేందుకు వీరికి సమయం చిక్కింది.
జిల్లాల్లో కలెక్టర్లు కూడా తమ తమ అవసరాల మేరకు సర్వేను బుధవారం కొనసాగించేందుకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ బుధవారం కూడా సర్వే కొనసాగుతుందని ప్రకటించారు. జిల్లా కలెక్టర్లకు ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ టీ మీడియాకు మంగళవారం రాత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం రుజువైంది! సర్కారీ సంకల్పం అనుకున్నదానికి మించి విజయవంతమైంది! దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచంలో ఎక్కడా నిర్వహించని సర్వే ద్వారా తెలంగాణ రికార్డు సృష్టించింది! ఒకే రోజు రాష్ట్రంలోని 91.3% ఇండ్లలో సర్వే చేసి అపూర్వ ఘట్టాన్ని నమోదు చేసింది! తెలంగాణ ప్రజల అస్తిత్వ ప్రకటన చేసింది.. పండుగకో పబ్బానికో ఒక్క చోట కలుసుకునే ఆప్తులు.. కుటుంబ సభ్యులు ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని పండుగకంటే, సొంతింట్లో శుభకార్యానికంటే ఎక్కువగా భావించి.. సొంతం చేసుకున్నారు! మూడు రోజులుగా ఎక్కెడెక్కడివారు స్వంత ప్రాంతాలకు తరలిరావడంతో ఊళ్లన్నీ నిండిపోయాయి.. ఇళ్లన్నీ సందడి చేశాయి! కొత్త ప్రభుత్వ కొత్త ఆలోచనకు ఘనంగా స్వాగతం పలికాయి! రాష్ట్రంలో సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించాలన్న ప్రభుత్వ సంకల్పనికి మహత్తర విజయాన్ని కట్టబెట్టాయి! ఇంటింటి సమగ్ర సర్వేను మంగళ ప్రదాయకంగా సూపర్‌హిట్ చేశాయి! దూరప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల్లో సొంతూళ్లకు చేరుకున్నది కొందరైతే.. పొరుగూళ్లనుంచి సైకిళ్లేసుకుని వచ్చింది మరికొందరు! ఖట్మాండు నుంచి సర్వే కోసమే కొన్ని కుటుంబాలు తరలి వచ్చాయంటే సర్వేను తెలంగాణ ప్రజలు ఎంతగా ఆదరించిందీ అర్థమవుతున్నది.
అనివార్యకారణాల వల్ల అతి స్వల్ప శాతంలో అక్కడక్కడ మిగిలిపోయిన ఇండ్లను కూడా సర్వే చేసే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. ప్రక్రియ బుధవారం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. తొలిరోజు సర్వే విజయవంతమైన సందర్భంగా బుధవారం సాధారణ సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది.
సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలున్న పది జిల్లాల రాష్ట్రంలో మంగవారం రాత్రి బాగా పొద్దుపోయే సమయానికి ప్రాథమిక అంచనాల ప్రకారం 91.3 శాతం ఇండ్లలో సర్వే పూర్తయినట్లు తెలుస్తున్నది. నాలుగు లక్షల పైచిలుకు ఎన్యూమరేటర్లు ఈ సర్వే సందర్భంగా వివరాలు నమోదు చేశారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు ఇరు రాష్ర్టాల ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, హీరో జూనియర్ ఎన్టీఆర్ సహా ప్రముఖులు సర్వేలో పాల్గొని జయప్రదం చేశారు.
ఉదయం ఏడు గంటల నుంచే ప్రారంభమైన సర్వే ప్రక్రియ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత కూడా కొనసాగింది. సర్వేపై వివిధ ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణ వ్యతిరేక మీడియా పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారాలన్నీ పటాపంచలైపోయాయి. సర్వే ఫారాల్లో ఉన్న అంశాలేవీ వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిచేవిగా లేకపోవడం, సాధారణ వివరాలపైనే ప్రశ్నలు ఉండటంతో విస్మయానికి గురైన ప్రజలు తమకున్న సందేహాలను పక్కనపెట్టి.. ఉత్సాహంతో సర్వేలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి తెలంగాణేతరులను వెళ్లగొట్టడం లక్ష్యంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారన్న దుష్ప్రచారాన్ని పూర్వపక్షం చేస్తూ సర్వే సాగింది. ఈ సర్వే ఫార్మాట్‌లో స్థానికతకు సంబంధించిన ప్రశ్నలేవీ లేకపోవడం విశేషం. బ్యాంకు అక్కౌంట్ల వివరాలు తెలియజేయడాన్ని కూడా ఐచ్ఛికం చేశారు.
దీంతో వ్యతిరేక ప్రచారాలను తిప్పికొడుతూ పార్టీలకు అతీతంగా ప్రజలు సర్వేను విజయవంతం చేశారు. ఎన్యూమరేటర్ల కోసం ఆసక్తిగా ఎదురు చూసిన ప్రజలు.. వారిని ఆప్యాయంగా ఆహ్వానించి.. వివరాలు అందజేసి.. అందుకు తగిన పత్రాలు చూపించి నమోదు చేయించారు. పలు గ్రామాల్లో ఎన్యూమరేటర్లకు మధ్యాహ్నం భోజన వసతిని కూడా గ్రామస్తులే కల్పించారు. ఊళ్లలో పేద ప్రజలు మొదలుకుని, అన్ని వర్గాల ప్రజలు సర్వేలో పాలుపంచుకున్నారు.
గత రెండు వారాలుగా సర్వేపై జరిగిన రాద్ధాంతం అంతా తెలంగాణ అభివృద్ధి నిరోధకుల చర్యగా, రాజకీయ దుగ్ధతో ఆడిన నాటకంగా ప్రజలు గుర్తించారు. ఒకే రోజు నాలుగు లక్షల మంది ఎన్యూమరేటర్లు స్వచ్ఛందంగా 99 లక్షల గృహాల (కుటుంబాల) వద్దకు వెళ్ళి సర్వే నిర్వహించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు టీ మీడియాకు చెప్పారు.
మిగిలిపోయిన కొద్దిపాటి ఇండ్లలో కూడా బుధవారం సర్వే ముగించి.. ఎలాంటి డూప్లికేషన్ లేకుండా నూరుశాతం ఇండ్లలో సర్వే పూర్తి చేయనున్నారు. అనంతరం సర్వే అంశంపై సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ సచివాలయం నుంచి ఉన్నతాధికారులు మండలస్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వాటన్నింటినీ త్వరలో కంప్యూటరీకరించి.. వివిధ ప్రభుత్వ పథకాల అమలుకు, ప్రజలకు మౌలిక సౌకర్యాలు, సదుపాయాల కల్పన అంచనాలకు వాటి గణాంకాలను వినియోగించనున్నారు.
సర్వేలో యావత్తు సింగరేణి సమగ్ర కుటుంబ సర్వేలో యావత్తు సింగరేణి సిబ్బంది పాలుపంచుకున్నారు. సర్వే కోసం మంగళవారం సెలవు ప్రకటిస్తూ సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య ఉత్తర్వులు జారీచేయడంతో వేలమంది కార్మికులు, ఉద్యోగులు సర్వేలో భాగస్వాములయ్యారు. దీంతో సింగరేణి బొగ్గుబావులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. దాదాపు 28వేల టన్నుల బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయాయి. సర్వే రోజున సెలవు ప్రకటించడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సకల వ్యాపారాలు, వాణిజ్యాలు, పాఠశాలలు, కాలేజీలు పని చేయలేదు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా కొన్ని సెలవు ప్రకటించగా.. మరికొన్ని వర్క్ ఫ్రం హోమ్ పద్ధతి అమలు చేయడంతో హైదరాబాద్‌లోని ఐటీ ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగా కనిపించాయి.
