
-పోలీసులకు సర్వత్రా ప్రశంసలు -నాలుగేండ్ల పాలనలో భద్రతకు భరోసా -ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలతో -మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్ర పోలీస్‌శాఖ -తగ్గిన నేరాలు.. కనుమరుగైన మతకల్లోలాలు -దేశానికే దిక్సూచిగా తెలంగాణ పోలీస్ సంస్కరణలు -షీటీమ్స్‌తో మహిళలకు రక్షణ -ప్రపంచస్థాయి టెక్నాలజీ వాడకంలో దూకుడు -అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ -సీఎం కేసీఆర్ నిర్ణయాలతో పోలీస్‌శాఖ మెరుగైన ఫలితాలు
శాంతిభద్రతలను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. 1947 నుంచి రాష్ట్రం ఏర్పడేవరకు హైదరాబాద్‌లో ఏవో ఒక అలజడులు, మతకల్లోల ఘటనలు చూశాం. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ లో వరుసగా ఐదేండ్లపాటు ప్రశాంత వాతావరణం ఏర్పడింది. వ్యవస్థీకృత నేరాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. రౌడీయిజం పూర్తిగా కనుమరుగైంది. ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో గ్యాం బ్లింగ్ సెంటర్లు, పేకాట క్లబ్బులు మూతపడ్డా యి. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలో ఎక్కడా ఉగ్రవాదఛాయలు కనిపించటం లేదు.
షీ టీమ్స్‌తో మహిళల్లో పెరిగిన భరోసా సింగపూర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనతో పురుడుపోసుకుంది షీ టీమ్స్. దేశంలోనే మరే రాష్ట్రంలో లేనివిధంగా తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ షీ టీమ్స్ పేరిట ప్రత్యేక బృందాలను 2014 అక్టోబర్ 24న హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో ఏర్పాటుచేసింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, అన్ని జిల్లాలకు షీటీమ్స్‌ను విస్తరించారు. గతేడాది అక్టోబర్ 26 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా షీటీమ్స్‌కి 15,167 ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 45,305 మంది ఆకతాయిల పనిపట్టారు షీ టీమ్స్ సిబ్బంది. వివిధ చట్టాల కింద 5,767 మందిపై కేసులు నమోదుచేశారు. వందల మంది యువతకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో పరివర్తన తెచ్చారు. రాష్ట్రంలో షీ టీమ్స్ విజయవంతంగా పనిచేయడంతో ఇతర రాష్ర్టాల పోలీసులు సైతం వీటి పనితీరుపై ఆరా తీస్తున్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టా ల అడిషనల్ డీజీ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి పోలీసు అధికారుల వరకు షీటీమ్స్ పనితీరుపై పరిశీలనకు నగరానికి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భరోసా కేంద్రాలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. బాధిత మహిళలకు, చిన్నారులకు ఒకే గొడుగు కింద న్యాయ, పోలీస్, వైద్యసహాయంతోపాటు వారికి అండగా నిలుస్తున్న భరోసా కేంద్రాలను పరిశీలించాలని స్వయంగా సుప్రీంకోర్టు సైతం ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపింది. చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగికవేధింపులను, అఘాయిత్యాలను అత్యంత వేగంగా విచారించేందుకు చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులు నెలకొల్పారు.
టెక్నాలజీలో తెలంగాణ పోలీస్ నంబర్‌వన్ నేరాలను అరికట్టడం, నేర పరిశోధన, పోలీసు సేవలను పౌరులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు సాంకేతికతను వినియోగించుకోవడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నం బర్‌వన్ స్థానంలో ఉన్నారు. సీసీటీఎన్‌ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టం) విధానంలో తెలంగాణ నాలుగేండ్లుగా మొదటిస్థానంలో కొనసాగుతున్నది. పోలీసుల రోజువారీ విధుల్లో మరింత సమన్వయం పెరిగేలా 56 రకాల సర్వీసులతో రాష్ట్రస్థాయిలో టీఎస్‌కాప్ యాప్‌ను తెచ్చింది. హ్యాక్‌ఐ, లాస్ట్‌రిపోర్టు, ఈ-పెట్టీ కేసులు వంటి యాప్స్‌ను, హైదరాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లకు ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్లను అందుబాటులోకి తెచ్చారు. కమ్యూనిటీ సీసీటీవీ, నేను సైతం వంటి ప్రాజెక్టుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని కమిషనరేట్ల పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ మాదిరిగా జిల్లాల్లోనూ సోషల్‌మీడియా మానిటరింగ్ సెల్స్ నెలకొల్పుతున్నారు. తెలంగాణ పోలీసులు వాడుతున్న యాప్స్‌కు జాతీయస్థాయిలో పలు అవార్డులు సైతం దక్కాయి.
ప్రపంచస్థాయికి మన పోలీసింగ్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే తెలంగాణ పోలీసింగ్ ప్రపంచస్థాయిలో ఉండనున్నది. ఈ సెంటర్‌లో రెండు టవర్లను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండతోపాటు అన్ని జిల్లాల్లో పరిస్థితులను ఇక్కడి నుంచి పర్యవేక్షించే వీలుంటుంది. పూర్తిస్థాయిలో భద్రత అంశాలను ఉన్నతాధికారులు ఇక్కడి నుంచే పర్యవేక్షించి, తగిన సూచనలు ఇచ్చేలా సాంకేతికంగా అత్యాధునిక హంగులతో ఇది నిర్మాణమవుతున్నది.
వేలల్లో రిక్రూట్‌మెంట్లు.. వేలపోస్టుల భర్తీతో ఓవైపు పోలీస్‌శాఖను బలోపేతంచేస్తూనే, ప్రజల రక్షణకోసం శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. తెలంగాణప్రభుత్వం ఏర్పడ్డాక 8,447 మంది కానిస్టేబుళ్లను నియమించారు. రిక్రూట్‌మెంట్‌లో 33% రిజర్వేషన్‌తో దాదాపు వెయ్యిమంది మహిళలు కానిస్టేబుళ్లుగా నియమితులయ్యారు. 18,074 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.
ప్రశంసల వెల్లువ టెక్నాలజీ వాడకం, నేరాల కట్టడికి తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న సంస్కరణలను ఇతర రాష్ర్టాలతోపాటు ఇతర దేశాల పోలీసులు సైతం ప్రశంసిస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ తెలంగాణ డీజీపీ కార్యాలయం, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ పోలీసులు వాడుతున్న టెక్నాలజీ ప్రపంచస్థాయిలో ఉందని రాష్ట్ర సందర్శనకు వచ్చిన కేంబ్రిడ్జి పోలీసులు కితాబిచ్చారు. మహారాష్ట్ర డీజీపీ దత్తపడ్సాల్గికర్ ఆశ్చర్యం, ఆనందం వ్యక్తంచేశారు. పంజాగుట్టస్టేషన్ దేశంలోనే రెండోఅత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికవడం తెలంగాణ పోలీసుల పనితీరుకు నిదర్శనం.
శాంతియుత తెలంగాణ.. -తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుదఫాల్లో రూ.700 కోట్లతో ఇన్నోవాలు, బైక్‌లు కలిపి 17,500 వాహనాలు కొనుగోలుచేశారు. -తొలుత 8,447 మంది కానిస్టేబుళ్లను భర్తీ చేశారు. ఎస్సై, కానిస్టేబుల్స్ కలిపి మరో 18,074 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. -హోంగార్డుల జీతాలను రూ.12వేల నుంచి రూ.20వేలకు పెంచారు. -మతకల్లోలాలు కనుమరుగయ్యాయి. నేరాలు తగ్గుముఖం పట్టాయి. -గతంలో నేరాలు జరిగితే.. బాధితులు కేసులు పెట్టేవారు కాదు.కానీ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ కారణంగా కేసుల నమోదుకు జంకడం లేదు.
తెలంగాణ హోంగార్డులకే అత్యధికం జీతం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ వెట్టిచాకిరీ చేయవద్దని, మరీ లగ్జరీగా కాకపోయిన కడుపునిండా అన్నం తిని ఒక మేరకైనా భద్రతతో ఉన్నామన్న ఆలోచన తేవాలన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. హోంగార్డులకు నెలకు రూ.12 వేలు ఇస్తే, హైదరాబాద్‌లో ఇంటి కిరాయికే సరిపోదు. అందుకే మానవీయ ధృక్ఫథంతో జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఇవి. నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల జీతం, ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా 18,491మంది హోంగార్డుల కుటుంబాల్లో సంబురాన్ని నింపారు కేసీఆర్. దేశంలో తెలంగాణ హోంగార్డులే అత్యధిక జీతం తీసుకుంటుండటం సంతోషించే విషయం. ఏపీలో రూ.12వేలు ఇ స్తుండగా. ఢిల్లీలో రూ.11,310 మాత్రమే. తమిళనాడులో రూ.4,500, గుజరాత్‌లో రూ.6,120, రాజస్థాన్‌లో రూ.9,750, యూపీలో రూ.9వేలు చెల్లిస్తున్నారు.
