-ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు -రికార్డు స్థాయిలో వేతన సవరణ అమలు -తెలంగాణ ఆవిర్భావం 2014 జూన్ 2నుంచే అమలు -వచ్చే నెల నుంచి చేతికి నగదు – నెలల బకాయిలు జీపీఎఫ్‌లో -ఇది తొలి తెలంగాణ పీఆర్సీ -చరిత్రలో ఇదే అత్యధికం -ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన -హర్షాతిరేకాలు ప్రకటించిన ఉద్యోగ సంఘాలు -ఊరూరా మిన్నంటిన సంబురాలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 43శాతంగా నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పీఆర్సీ అని ప్రకటించిన కేసీఆర్, పెరిగిన వేతనాలను రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ రెండునుంచే అమలు చేస్తున్నట్టు గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉద్యోగులకు పెరిగిన వేతనాలు మార్చి నెల జీతంనుంచి నగదు రూపంలో అందుతాయని చెప్పారు. ఉద్యోగుల ఇతర సమస్యల మీద ప్రదీప్‌చంద్ర హైపర్ కమిటీ కసరత్తు కొనసాగుతుందని వివరించారు. కాగా పీఆర్సీ ఫిట్‌మెంట్ ఫైల్‌పై గురువారం రాత్రి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సంతకం చేశారు.శుక్రవారం దీనికి సంబంధించిన జీవో విడుదల కానుంది.
చరిత్రలో తొలిసారి.. ఉద్యోగులకు శుభవార్త, ఉద్యోగులు కోరుకుంటున్న పీఆర్సీ వెయిటేజ్‌పైన నిర్ణయం తీసుకున్నాం. గత చరిత్రలో ఏనాడు లేనివిధంగా 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. పెరిగిన జీతాలను తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన జూన్ 2వ తేదీ నుంచే అమలులోకి తెస్తాం. జూన్ 2014 నుంచి ఫిబ్రవరి వరకు జీపీఎఫ్‌లో జమ చేస్తాం. నగదు చెల్లింపులు మార్చి 2015నుంచి అమలులోకి వస్తాయి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పీఆర్సీపైన నిర్ణయాన్ని ప్రకటించారు. కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ఫిట్‌మెంట్‌పైన నిర్ణయాలను సీఎం తెలియచేశారు. సీఎం ప్రకటన చేస్తున్నంత సేపు ఉద్యోగ సంఘాల నాయకులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.జీపీఎఫ్‌లో జమ చేసినట్లయితే ఉద్యోగులకు 8.5శాతం వడ్డీ వస్తుందని, ఉద్యోగులకు ఎక్కువ మేలు జరగాలనే ఆలోచనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇది కొత్త రాష్ట్రంలో తొలి తెలంగాణ పీఆర్సీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఎన్నికల కోడ్ వస్తుందనే.. ఒకసారి ఫిట్‌మెంట్, కటాఫ్‌తేదీ, కొత్తవేతనాలు అమలులోకి వచ్చే తేదీలపైన నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రాసెస్ ప్రారంభమవుతుందని, ప్రాసెస్ ప్రారంభమయితే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు వచ్చినప్పటికీ ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతోనే పీఆర్పీపైన వేగంగా నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉన్నంతలో ఉద్యోగులను సంతృప్తి పరచాలనే లక్ష్యంతో ఫిట్‌మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన విశదీకరించారు. ఇందుకు సంబంధించి లక్ష్మీవారం (శుక్రవారం) శుభప్రదమని అందుకే శుక్రవారమే జీవో విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు శాసనసభ కార్యదర్శితో మాట్లాడి రిటర్నింగ్ ఆఫీసర్ ఏర్పాటు తదితర వివరాలపైన సంప్రదించారని, ఈ నేపథ్యంలో ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లయితే పీఆర్సీ నిర్ణయం ఏప్రిల్ వరకు వాయిదా వేయాల్సి వచ్చేదని చెప్పారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని భావించి ఫిట్‌మెంట్, కొత్త వేతనాలు అమలులోకి తీసుకరావాల్సిన తేదీలపైన స్థూలంగా నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాలు పెంచడం వల్ల సాలీనా ప్రభుత్వంపైన రూ.6500 కోట్లు భారం పడుతుందని, అయినప్పటికీ ప్రభుత్వ కుటుంబ సభ్యులైన ఉద్యోగుల విషయంలో తాము భారంగా భావించబోమని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
వ్యత్యాసాలు సవరిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ప్రదీప్‌చంద్ర హైపవర్ కమిటీ కొనసాగుతుందని సీఎం చెప్పారు. ఉద్యోగులలో అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నాయని వీటన్నింటిపైన ఒకేసారి ఒకేరోజున నిర్ణయాలను తీసుకోలేమని అన్నారు. ఈ వ్యత్యాసాలన్నింటినీ సవరించేందుకు ప్రదీప్‌చంద్ర కమిటీ కొనసాగుతుందని, అన్నీ వ్యత్యాసాలపైన ఆర్థికశాఖ అధికారులతో, ఉద్యోగసంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతుందని, వేతనాలలో వ్యత్యాసాలను సవరిస్తుందని ఆయన తెలిపారు. తరుముకొస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్లమెంటరీ సెక్రటరీ వీ శ్రీనివాస్‌గౌడ్, టీజీవో అధ్యక్షురాలు మమత, తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్, తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్ పీ.వెంకటరెడ్డి తదితర అందుబాటులో నాయకులు, ప్రదీప్‌చంద్ర సారధ్యంలోని హైపవర్‌కమిటీ ఉన్నతాధికారులు రామకృష్ణారావు,శివశంకర్, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి తదితరులతో చర్చించామని చెప్పారు. ఫిట్‌మెంట్, కటాఫ్‌డేట్, ఇంప్లిమెంటేషన్ ఈ మూడు ప్రధాన అంశాలని, ఈ మూడింటిపైన నిర్ణయం తీసుకున్నట్లయితే పీఆర్సీపైన నిర్ణయం తీసుకున్నట్లేనని ఆయన వివరించారు.
ఉద్యమంలో ఉద్యోగులదే ప్రధాన పాత్ర.. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యోగుల పాత్ర చాలా గొప్పదని, వారు చాలా త్యాగాలు చేశారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉద్యమపథంలో ఉద్యోగులు అగ్రస్థానంలో నిలిచారని గుర్తు చేశారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల కష్టాలను, ఇబ్బందులను తాము నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూనే ఉంటామని హామీ ఇచ్చారు. సకల జనుల సమ్మె వంటి చారిత్రాత్మక ఉద్యమాలలో మొత్తం తెలంగాణను స్తంభింపచేయడంలో ఉద్యోగులు గొప్ప పోరాటం చేశారని, అప్పటి ప్రభుత్వం ఎన్ని కష్టాలను పెట్టినా, ఎంత నష్టం చేసినా తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేశారని అభినందించారు. ఏసీబీ కేసులు పెట్టినా, బైండోవర్ కేసులు బనాయించినా..బెదిరించినా, వెన్నుచూపకుండా లక్షల సంఖ్యలో ఉద్యోగులు కుటుంబాలతో సహా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ చివరి నిముషంలో హైదరాబాద్ నుండి పరిపాలిస్తుంటే ఇతర దేశం నుండి పాలిస్తున్నదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యపై మాట్లాడాలని విలేకరులు కోరగా ఆ వ్యాఖ్యపైన తాను స్పందించనని త్రోసిపుచ్చారు.