Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

స్థానికతపై తుదినిర్ణయం రాష్ర్టానిదే

-1956కు ముందున్నవారే స్థానికులని గతంలో చంద్రబాబు జీవో ఇవ్వలేదా? -మంత్రి హరీశ్‌రావు ప్రశ్న -రాష్ట్ర విద్యార్థులకే ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుందని స్పష్టీకరణ

Harish Rao ఎన్నికల హామీలను నెరవేర్చలేననే భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

జనవరి 16న ఐటీడీఏ ఉద్యోగ నియామకాల సందర్భంగా.. 1956 ముందు తెలంగాణలో నివాసం ఉన్నవారే స్థానికులని చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. ఎంసెట్ అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాల్లో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. గురువారం సచివాలయంలో శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు.

స్థానికతను నిర్ధారించే అధికారం రాష్ర్టాల హక్కు అన్నారు. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి కోసం ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున.. రాష్ట్ర ప్రజలకు సమర్థవంతమైన పాలన, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటుందని చెప్పారు. ఏ రాష్ర్టానికి చెందిన విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించే విధానం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పొరుగురాష్ట్ర విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని చంద్రబాబు, ఏపీ మంత్రులు గొడవ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఫీజులను తెలంగాణ ప్రభుత్వంపై రుద్దాలనే కుట్రతో ఎంసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు.

ఎంసెట్ అడ్మిషన్లను ఉమ్మడిగా నిర్వహించాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఎంసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. ప్రతి ఏడాది అగస్టు చివరి వారంలో ఎంసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసి, సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి, నవంబర్‌లో తరగతులు ప్రారంభించడం లేదా ? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ తీరుతో నష్టపోయేది అక్కడి విద్యార్థులేనని.. తెలంగాణ విద్యార్థులకు జరిగే నష్టం ఏమీ లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ విద్యార్థులకు విద్యా సంవత్సరాన్ని పొడిగిస్తామని హరీశ్ స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తాం.

ఇతర రాష్ర్టాలకు చెందిన ఒక్క విద్యార్థికి కూడా ఫీజు చెల్లించే ప్రసక్తే లేదు. తెలంగాణ విద్యార్థులకు అవసరమైతే రూ.5వేలు అదనంగా పాకెట్‌మనీ చెల్లిస్తాం. రూ.10 వేలు మిగిలితే పేదలకు మెరుగైన సేవలు అందిస్తాం. మిగులు బడ్జెట్‌తో తెలంగాణలో రోడ్లు, ప్రాజెక్టులు కట్టుకుంటాం మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నిట్ కళాశాలల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన అనేక మంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో వారందరికీ ఎందుకు ఫీజులు చెల్లించలేదు? అని ప్రశ్నించారు. ఎంసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ వివాదంపై అగస్టు 4న సుప్రీంకోర్టు నిర్ణయం వెల్లడించాల్సి ఉందని తెలిపారు.

సుప్రీంకోర్టు నిర్ణయం వెల్లడైన తర్వాత ఎంసెట్ అడ్మిషన్ల నిర్వహణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమంపై దృష్టి పెడతారు. చంద్రబాబు మాత్రం పొరుగు రాష్ర్టాన్ని ఎలా ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాడు. పొద్దున లేచిన దగ్గరి నుంచి గిల్లి గజ్జాలు పెట్టుకోవాలని కుట్రలు చేస్తున్నాడు అని విమర్శించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.