– ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందిస్తాం.. – ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు
స్టార్టప్‌లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒక్కతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆగస్ట్ ఫెస్ట్-2014 ఈ నెల 30 నుంచి 31 వరకు రెండు రోజుల పాటు ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్‌బీ)లో జరగనున్నదని మంత్రి చెప్పారు.
ఇప్పటి వరకు భారత్‌లో జరిగిన సదస్సులో ఇదే అతిపెద్దదైన స్టార్టప్ పండుగన్నారు. యువ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటునందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, ఈ సదస్సుకు సుమారు 1500 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. మనసులో పుట్టిన సరికొత్త ఆలోచనలను ఆచారణలోకి తీసుకరావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఇతర దేశాలకు పోటీగా భారత్‌లో ఆలోచనలు భారీగా ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చకుండా ఎన్నో మరుగున పడుతున్నాయి, వీటిని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. ఆలోచనలు ఉండి నిధులు లేక సతమతమవుతున్నవారికి ఈ వేదిక అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తున్నదన్నారు. గతేడాది నిర్వహించిన ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా సుమారు 400 నుంచి 500 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొనగా, ఈసారి మాత్రం మూడింతలు పెరిగే అవకాశం ఉందన్నారు. రెండో ఎడిషన్ కొత్త ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎంతో లాభసాటిగా ఉండనున్నదని ఈట్ స్లిప్ డ్రింక్(ఈఎస్‌డీ) సహ వ్యవస్థాపకుడు సురేశ్ తెలిపారు. ఈ సదస్సుకు 100 మంది పెట్టుబడిదారులు కూడా పాల్గొంటుండటంతో క్రియేటర్లకు ఎంతో లాభం చేకూరనున్నది.
వచ్చే ఏడాది అందుబాటులోకి అతిపెద్ద ఇంక్యూబేటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఇంక్యూబేటర్ ఈ ఏడాది చివర్లోగాని, వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి రానున్నట్లు మంత్రి చెప్పారు. మొదటి దశలో 80 వేల చదరపు అడుగుల విస్థీర్ణంలో ఏర్పాటు చేయనున్న సెంటర్‌లో సుమారు 400 స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించుకోవడానికి వీలుంటుందన్నారు. చివరి దశలో మూడు లక్షల చదరపు అడుగుల విస్థీర్ణంలో ఏర్పాటు చేయనున్న సెంటర్‌లో 1500 వరకు కంపెనీలు తమ ఉత్ప్తలను ప్రారంభించుకోవచ్చునని చెప్పారు. ఐటీ హబ్‌గా మారిన హైదరాబాద్‌ను మరిన్ని ఉన్నత శిఖరాలను చేర్చడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదన్నారు.