-దేశ యంగ్‌తరంగ్‌కు అంకితం.. టీ-హబ్ 2.0 ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్
-స్టార్టప్స్‌కు రాజధాని హైదరాబాద్ నగరం
-వ్యాపారవేత్తలుగా మారాలని తపిస్తున్న దేశ యువత
-ఔత్సాహికుల ఆర్తి తీర్చేందుకే టీ-హబ్ 2.0 ఏర్పాటు
-భారత వజ్రోత్సవాల ముందు ప్రారంభం చరిత్రాత్మకం
-2021లో రాష్ట్ర స్టార్టప్ మార్కెట్ 4.8 బిలియన్ డాలర్లు
-త్వరలో హైదరాబాద్ నుంచి స్టార్టప్ ఇన్నోవేషన్‌లో బ్రేక్‌త్రూ
-దేశానికే ఆదర్శంగా తెలంగాణ స్టార్టప్ పాలసీ: సీఎం కేసీఆర్

హైదరాబాద్ ఐటీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం..
భారతదేశ స్టార్టప్ వ్యవస్థల ప్రస్థానంలో మేలిమలుపు..
యూనికార్న్ ఎకోసిస్టమ్‌లో ఒక అద్భుత ఆవిష్కరణ..
ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్..
పది అగ్రశ్రేణి స్టార్టప్ వ్యవస్థల్లో అగ్రగామి..
4 వేల ప్రపంచ స్టార్టప్‌లకు ఊతమిచ్చే వేదిక..
యువత ఆలోచనలను నిజం చేసే కార్యశాల..
సృజనాత్మక ఆవిష్కరణల్లో చాంపియన్..
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలం..
ఐటీ మంత్రి కేటీఆర్ దక్షతకు నిదర్శనం..
ఇది టీ హబ్ 2.0..
భారత దేశ ఐటీ హబ్..
దేశ ఐటీ రంగ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైంది. ప్రపంచ స్టార్టప్ వ్యవస్థల చరిత్రలో ఒక కొత్త పుట ఏర్పడింది. ఈ దేశ యువత భవిష్యత్తుకు బంగారు బాట పరిచేందుకు.. వారి ఆలోచనలను సాకారం చేసేందుకు.. ఆవిష్కరణల కేంద్రం హైదరాబాద్‌లో టీ హబ్ 2.0 అవతరించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా ఈ దేశ యువతకు అంకితమైంది.
టీ-హబ్ ఇప్పటికే రెండు వేల మంది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి 1.19 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కెట్‌ను సృష్టించింది. టీ-హబ్ ప్రపంచంలో పేరొందిన పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులను అనుసంధానం చేసేవిధంగా పనిచేసి సృజనాత్మక అవిష్కరణలకు ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొచ్చింది. స్టార్టప్‌లతో యువ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు దేశ యువత ఆసక్తిగా ఉన్నట్టు టీ-హబ్ మొదటి ఫేజ్‌తోనే స్పష్టమైంది. వారికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరాన్ని గుర్తించి అత్యాధునిక హంగులతో టీ-హబ్ 2.0ను ప్రారంభించాం. తెలంగాణ స్టార్టప్‌లు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలవాలన్నదే మా లక్ష్యం.
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
భారతదేశ స్టార్టప్స్ రాజధానిగా తెలంగాణ మారనున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దార్శనికతతో టీ-హబ్ 2.0ను ఏర్పాటుచేసుకొన్నామని, మన యువ మేధస్సు ప్రపంచంతో పోటీపడేలా ఆధునిక భారత నిర్మాణమే లక్ష్యమని పేర్కొన్నారు. రాయదుర్గం నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో నిర్మించిన టీ-హబ్ 2.0ను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొద్ది వారాల్లో 75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించుకొనే సందర్భంలో టీ-హబ్ 2.0 ప్రారంభం కావడం చరిత్రాత్మకమని అన్నారు. దేశ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ‘సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించి, పెద్ద ఎత్తున యువతను వ్యాపారవేత్తలుగా మలిచి ప్రపంచానికి పరిచయం చేసేందుకు సరికొత్త ఆలోచనతో ఎనిమిదేండ్ల కిందట 2015లో టీ-హబ్‌ను ప్రారంభించాం. ఇప్పుడు దానికంటే ఐదు రెట్లు పెద్దదైన టీ-హబ్ 2.0 ను ప్రారంభించుకొన్నాం. యువతకు ఎన్నో ఆకాంక్షలున్నాయి.
ప్రపంచంలో పో టీతత్వాన్ని ఎదుర్కొని సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే తపన ఎంతో ఉన్నది. దీనిని తెలంగాణ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. యువతలోని ఆర్తిని తీర్చి పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలతో కూడిన యువ భారతాన్ని ప్రపంచపటంపై నిలిపేందుకు టీ-హబ్‌ను ప్రారంభించాం. యువత భవిష్యత్తుకు స్పష్టమైన దార్శనికత, మార్గనిర్దేశం చేయడానికి టీ-హబ్ ఎంతో దోహదపడుతుంది. తెలంగాణ స్టార్టప్ పాలసీ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుంది. రాష్ట్ర స్టార్టప్ విధానం పురోగతి సాధిస్తూ.. కార్పొరేట్, అకడమిక్ రంగంలో అత్యుత్తమ ఫలితాలను సాధించి దేశానికే ఆదర్శంగా నిలవనున్నది’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
మన స్టార్టప్‌లు దేశానికి ఆదర్శాలు
టీ-హబ్ ఇప్పటికే రెండు వేల మంది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి 1.19 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కెట్‌ను సృష్టించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘టీ-హాబ్ ప్రపంచంలో పేరొందిన పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులను అనుసంధానం చేసేవిధంగా పనిచేసి సృజనాత్మక అవిష్కరణలకు ప్రత్యేకబ్రాండ్‌ను తీసుకొచ్చింది. స్టార్టప్‌లను ఏర్పాటుచేసి యువ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు దేశ యువత ఆసక్తిగా ఉన్నట్టు టీ-హబ్ మొదటి ఫేజ్ ఏర్పాటుతో స్పష్టమైంది. వారికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరాన్ని గుర్తించి అత్యాధునిక హంగులతో టీ-హాబ్ 2.0ను ప్రారంభించాం. తెలంగాణ స్టార్టప్‌లు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలవాలన్నదే మా లక్ష్యం. టీ-హబ్ ద్వారా అవిష్కృతమైన స్టార్టప్‌లు రాష్ర్టానికి, దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొస్తాయని ఆశిస్తున్నాం. ఒక వ్యాపారవేత్తను తయారుచేసేందుకు అవసరమయ్యే అన్ని వసతులు, సాంకేతికతను అందించేందుకు టీ-హబ్‌కు అనుబంధంగా వీ-హాబ్, టీ-వర్క్స్, టీఎస్‌ఐటీ, రిచ్, ఆర్‌ఐసీహెచ్, టాస్క్‌ను ఏర్పాటుచేశాం. వీటి సహకారంతో చాలామంది.. తాము ఎంపిక చేసుకొన్న రంగంలో చాంపియన్లుగా నిలబడనున్నారు. స్టార్టప్ సిస్టమ్‌లో దేశవ్యాప్తంగా ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించేందుకు టీ-హబ్ అండగా ఉంటుంది. దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుంది’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
స్టార్టప్‌లకు అండ
హైదరాబాద్ ది బెస్ట్ లివింగ్ సిటీగా తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. స్టార్టప్‌లు సులువుగా కార్యకలాపాలు సాగించేందుకు ప్రభుత్వం అన్ని మౌలిక వసతులను కల్పిస్తుందని హామీఇచ్చారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉత్పత్తులు, సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీ-హబ్ 2.0ను దేశ యువతకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. వినూత్న, సృజనాత్మక ఆలోచనలతో వచ్చే యువతకు స్టార్టప్‌ల ఏర్పాటుకు సమీకృత వ్యవస్ధను అందిస్తామన్న సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా స్టార్టప్‌లను స్థాపించి విజేతలుగా నిలిచిన వారిని అభినందించారు. వీరి విజయం కొత్తగా ఏర్పాటుచేసే స్టార్టప్‌లకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అందరం కలిసి తెలంగాణ మరింతగా అభివృద్ధిలో రాణించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీ-హబ్ నిర్మాణంలో కృషి చేసిన ఐటీ మంత్రి కేటీఆర్, అధికారుల బృందాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఐటీ రంగం అభివృద్ధికి అత్యాధునిక సదుపాయాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు సూచించారు. టీ-హబ్ బోర్డు చైర్మన్ మోహన్‌రెడ్డి సూచించినట్టుగా స్టార్టప్ ఏర్పాట్లకు యువతలో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నాణ్యతతో కూడిన విద్యలో భాగంగా ఆవిష్కరణల విజ్ఞానాన్ని అందించేందుకు చేపట్టాల్సిన చర్యలను నోట్ రూపంలో ఇస్తే క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అగ్రశ్రేణి వ్యవస్థ
త్వరలో హైదరాబాద్ నుంచి స్టార్టప్ ఇన్నోవేషన్‌లో భారీ పురోగతి (బ్రేక్ త్రూ) రానున్నదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘ప్రపంచంలో పేరొందిన 10 స్టార్టప్ వ్యవస్థల్లో మన స్టార్టప్ వ్యవస్థ గుర్తింపు పొందడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఆసియాలో తొలి పదిహేను స్టార్టప్ వ్యవస్థల్లో మనది నిలవడంతోపాటు పెట్టుబడులను గణనీయంగా ఆకర్షిస్తున్నది’ అని చెప్పారు. 2021లో తెలంగాణ స్టార్టప్ వ్యవస్ధ 4.8 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కెట్‌ను చేరుకోవడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఐటీ, లైఫ్ సైన్సెస్, ఎయిరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, విద్యుత్తు, వాహన రంగాల్లో మన స్టార్టప్‌లు విలువైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయని, మన స్టార్టప్‌లు కీలకమైన విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశుద్ధ్యం, పర్యావరణ రంగాల్లో కూడా సామాజిక జీవనానికి అనుగుణంగా పరిష్కారాలు చూపుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్, తెలంగాణ స్టార్టప్ పాలసీ తీసుకొచ్చామని వెల్లడించారు.
తెలంగాణలో ఉన్న ఇంక్యుబేటర్స్
l టీహబ్ l వీ హబ్ l బయో హబ్
l సీఐఈ (గచ్చిబౌలి త్రిపుల్ ఐటీ)l డీ ల్యాబ్స్- ఐఎస్‌బీ హైదరాబాద్
l ఐ హబ్ – ఎంఎన్ పార్క్ l జే హబ్ – జెఎన్టీయూ
l లైఫ్ సైన్సెస్ ఇంక్యుబేటర్- ఐకేపీ పార్క్
l సొసైటీ ఫర్ బయోటెక్నాలజీ ఇంక్యుబేషన్
సెంటర్- సీఎస్‌ఆర్-ఐఐసీటీ l టీ వర్క్స్- బేగంపేట
l ఎస్‌ఆర్ ఇన్నోవేషన్ ఎక్సేంజ్ (శ్రీఎక్స్)
l ఎంఎన్‌ఆర్ ఫౌండేషన్ ఫర్ రిసెర్ అండ్ ఇన్నోవేషన్-
ఎంఎన్‌ఆర్ విద్యా సంస్థలు
l మెడ్ టెక్ ఇంక్యుబేటర్- త్రిపుల్ ఐటీ హైదరాబాద్
l బయోనెస్ట్ -యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
l ఉస్మానియా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్
ఉస్మానియా విశ్వవిద్యాలయం
l ఏజీ హబ్- పీజేటీఎస్‌ఏయూ
l అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్-ఇక్రిశాట్
l సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ అగ్రిప్రెన్యూర్‌షిప్- మేనేజ్
l న్యూట్రీ హబ్- ఐఐఎంఆర్
l అటల్ ఇంక్యుబేషన్ సెంటర్- ఐఐఐటీ హెచ్
l ఏఐఎస్‌ఈఏ- ఐఐటీహెచ్
స్టార్టప్‌ల కోసం నిర్వహిస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాలు
l సినీ ప్రెన్యూర్- మీడియా టెక్
l రెనాల్ట్ నిస్సాన్ ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్ – ఆటోమొబైల్
l రూబ్రిక్స్ l మాస్టర్ క్లాసెస్ l కాన్‌ప్లుయెన్స్
l సిటీ బ్యాంక్ సోషల్ ఇన్నోవేషన్ ల్యాబ్ – ఫిన్‌టెక్
l ల్యాబ్ 32 l అటల్ ఇన్నోవేషన్ సెంటర్
l టీ ఏంజిల్ l డిస్క్ 5 l మొబిలిటీ చాలెంజ్
l కాలేజ్‌ల్లో లాంచ్‌పాడ్ l కిక్ స్టార్ట్ l టీ-కనెక్ట్
టీహబ్ గుర్తించిన ప్రధాన రంగాలు
l అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
l ఏఆర్/వీఆర్ (ఆగ్యుమెంటెండ్ రియాల్టీ, వర్చువల్ రియాలిటీ)
l అటానమస్ మొబిలిటీ l ఆటోమోటివ్ రిమోట్ డయాగ్నస్టిక్స్
l ఆటోమోటివ్ సర్వీసింగ్ ఎఫిసియెన్సీl బిగ్ డాటా అనలిటిక్స్
l ఎలక్ట్రిఫికేషన్ l ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ l మొబిలిటీ యాజ్ ఏ సర్వీస్
l స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ l ఫిన్‌టెక్ l హెల్త్ టెక్ l హెచ్ ఆర్ టెక్
l ఎంబెడెడ్ సిస్టమ్స్ l ఎంటర్‌ప్రైజ్ l అగ్రిటెక్