-ఉద్యమం నాటినుంచి పార్టీకి అండగా నిలుస్తున్న సైనికులు -టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు -తెలంగాణభవన్‌లో టెక్‌సెల్ కార్యాలయం ప్రారంభం

సోషల్ మీడియాలో ఏ పార్టీకి లేనంతగా స్వచ్ఛంద సైనికులు టీఆర్‌ఎస్‌కు ఉన్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. ఉద్యమసమయం నుంచి నేటిదాకా కేసీఆర్ నాయకత్వాన్ని టీఆర్‌ఎస్ సోషల్‌మీడియా స్వచ్ఛంద సైనికులు బలపరుస్తూ వస్తున్నారని చెప్పారు. బుధవారం తెలంగాణభవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి సాంకేతిక విభాగం (టెక్ సెల్) నూతన కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఆరేండ్లుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రంగా కృషిచేస్తున్నారని కొనియాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో టెక్‌సెల్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. టెక్ సెల్ 2013 నుంచి సాంకేతిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. పార్టీ సభ్యత్వ డాటాబేస్, ఇతర సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు, పార్టీ వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నిర్వహణ టెక్ సెల్ ఆధ్వర్యంలో జరుగుతున్నదని చెప్పారు. సోషల్‌మీడియాలో పార్టీ కన్వీనర్లుగా మన్నె క్రిశాంక్, పాటిమీది జగన్, సతీశ్‌రెడ్డి, దినేశ్‌చౌదరి వ్యవహరిస్తారని కేటీఆర్ ప్రకటించారు. రానున్న రోజుల్లో సోషల్‌మీడియాలో క్రియాశీలకంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొన్నారు.