Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సోనియాకు బాధెందుకు?

-తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి కడుపు తరుక్కుపోతున్నదా?
-నీకు సూటుకేసులు వస్తలేవని తల్లడిల్లుతున్నవా?
-చేనేత కార్మికుల ఆత్మహత్యలు బంద్ అయినందుకా?
-రైతులకు 24 గంటలు కరంట్ ఇస్తున్నందుకా?
-రైతులకు బాధలు పోయి, భరోసా వచ్చినందుకా?
-బీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నందుకా?
రూ.17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసినందుకా?
-మళ్లీ 24 కోట్ల రైతుల రుణమాఫీ చేస్తం అన్నందుకా?
-అవినీతిని బంద్‌పెట్టి.. సంపద పెంచి..దానిని పంచుతున్నందుకా?
-యాభై వేలమందికి ఐదు రూపాయలకే అన్నం పెడుతున్నందుకా?
-మిషన్‌భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇవ్వబోతున్నందుకా?
-ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే మా పరిశ్రమలన్నీ పోవాల్నా?
-రాబోయే ఎన్నికల్లో కూటమి చిత్తే..
-తాజా సర్వేలో 103 నుంచి 108 సీట్లు టీఆర్‌ఎస్‌కే
-ఆగం వద్దు, ఆలోచన చేయాలె.. మోసపోతే గోసపడుతం
-తెలంగాణ యుద్ధం ముగియలేదు.. కాంగ్రెసోళ్లు తిన్న సొమ్ము మొత్తం కక్కిస్తం
-ప్రజాఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-చంద్రబాబు ఓ మెంటల్ కేసు!

తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంటే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీకి బాధ ఎందుకని, ఎందుకు కడుపు తరుక్కుపోతున్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సూటిగా ప్రశ్నించారు. ఆదివారం వికారాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్రజాఆశీర్వాదసభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సోనియా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఒక్కో పథకాన్ని వివరించిన సీఎం.. ఈ పథకాలతో ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్నందుకు సోనియా కడుపు తరుక్కుపోతున్నదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

ఎందుకు బాధపడుతున్నవో చెప్పాలె
మొన్న రాష్ర్టానికి సోనియాగాంధీ వచ్చిండ్రు. అమె కడుపు తరుక్కుపోతున్నదట మరి ఏం జరిగిందో! ఇక్కడి కాంగ్రెస్ దద్దమ్మలు రాసిస్తరు.. ఆ సోనియాగాంధీ చదివిపోతరు. తెలంగాణ గడ్డమీద మీటింగ్‌పెట్టి ఆంధ్రకు ప్యాకేజీ ప్రకటించి పోతరు. మన దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ పోవాల్నా? తల్లడిల్లుతున్నదట సోనియాగాంధీ. ఎందుకు తల్లడిల్లుతున్నవమ్మా? సమైక్యరాష్ట్రంలో వచ్చినట్టు నెలవారీ మామూళ్లు వస్తలేవా? సూటుకేసులు, మూటలు బంద్ అయినందుకే కదా నీ బాధ! ఏం కొంపలంటుకున్నయని.. ఎందుకు కడుపు తరుక్కుపోతుందో.. తల్లడిల్లుతున్నవో చెప్పాలె. ఇప్పుడు తెలంగాణలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినయి. మీ కాంగ్రెస్ రాజ్యంలో భూదాన్‌పోచంపల్లి, సిరిసిల్ల, దుబ్బాకలో ఒక్కొక్క రోజు 11 మంది, ఏడుగురు, పదిమంది చచ్చిపోయిండ్రు. ఇయ్యాల అవన్నీ బంద్ అయినందుకు నీ కడుపు తరుక్కుపోతున్నదా? మీ 40 ఏండ్ల పాలనలో కరంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరంట్ పోతే వార్త. మీ పాలనలో మోటర్లు కాలుడు, ట్రాన్స్‌ఫార్మర్లు పేలుడు.. పంటలు ఎండిపోవుడు! ఇయ్యాల 24 గంటలు కరంట్ రైతులకు ఇస్తున్నందుకు బాధ అవుతున్నదా? 24 గంటలు కరెంట్ ఇయ్యకూడదా? పదేండ్ల కాంగ్రెస్ రాజ్యంలో ఐదారుగంటలు కూడా కరంట్‌లేదు. ఐదుసార్లు కట్ అయ్యేది.

ఇప్పుడు మంచిగ కరంటు వస్తన్నందుకా బాధ? వట్టిగనే వచ్చి మాట్లాడితే వినేందుకు గొర్రెలమా? ఐదు రూపాయలకు అన్నం రోజుకు 50,000 మంది తింటున్నందుకా బాధ? మిషన్‌భగీరథతో నీళ్లు ఇవ్వబోతున్నాం. దానికి బాధనా? ఎటువడితే అటు మాట్లాడితే అయితదా? ఢిల్లీ నుంచి ఒకాయన వచ్చిండు అవినీతి జరిగింది అంటడు! ఏడ జరిగింది? అసెంబ్లీ ఎందుకు డిసాల్వ్ అయింది? ఈ నేతల తీరును ఎండగట్టేందుకే కదా?

సమైక్యరాష్ట్రంలో కంటే ఇప్పుడు కోటిపాళ్లు నయం
ఇప్పుడు రైతులకు బాధలుపోయి, భరోసా వచ్చింది. సోనియాగాంధీ.. దానికోసం తల్లడిల్లుతున్నవా? రాసిచ్చినోడు ఎవడో.. ఆమె ఏం సదివిందో! ఏం తెలుసో.. ఏం తెల్వదో! వాళ్లకే అర్థం కావాలె. ఇంత ఘోరమా! ఏం అన్యాయం జరిగిపోయింది? సమైక్యరాష్ట్రంలో తెలంగాణ ఉన్నదానికంటే ఇయ్యాల కోటిపాళ్లు నయం ఉన్నది కదా! ఆడిపిల్ల పెండ్లికి మీ జిందగీలో లక్ష రూపాయలు ఇయ్యాలని ఆలోచన చేసిండ్రా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉపన్యాసాలు కొట్టిపోయిండ్రు.. మొసలికన్నీరు కార్చిండ్రు తప్ప ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? ఇయ్యాల రైతుల ట్రాక్టర్లకు పన్నులు రద్దు చేసినం. ప్రాజెక్టు కింద నీటి తీరువా రద్దు చేసినం.

రైతు కుటుంబాలు చేతులెత్తి దండం పెడుతున్నాయి..
ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రైతుబంధు స్కీం తెచ్చినం. దాన్నిమించినది రైతు బీమా. చిన్న రైతు అయినా సరే చనిపోతే రూ.5 లక్షలు బీమా ఇస్తున్నం. ఇప్పటివరకు 3,500 మందికి బీమా సొమ్ము చెల్లించినం. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఆ రైతు కుటుంబాలు చేతులెత్తి దండం పెడుతున్నయి. వారిని ఆదుకున్నందుకు నీ కడుపు తరుక్కుపోతున్నదా? మోసం చేసుడు కాంగ్రెస్ నైజం. మా నైజం కాదు. నిండుసభలో అడుగుతున్న.. రెండు లక్షల అప్పు ఉన్న రైతులు ఉన్నరా? తెలంగాణ రైతాంగానికి మీ పాలనలో రూ.2 లక్షల అప్పుకు ఎల్జిబిలిటీ ఇచ్చిండ్రా? గతంలో మేం సిన్సియర్‌గా చెప్పినం. లక్ష రుణమాఫీ చేసినం. ఇప్పుడు మళ్లీ లక్ష రుణమాఫీ చేస్తం.అందుకని కడుపు తరుక్కుపోతున్నదా?

పంజాబ్ ప్రభుత్వం పైసల్లేవ్ అన్నది..
పంజాబ్‌లో ఎన్నికల ముందు ఇట్లనే డంభాచారం కొట్టారు. కాంగ్రెస్ గెలిచినంక తెల్లారే సీఎం చేతులెత్తాడు. ప్రతిపక్షాలు ధర్నాచేస్తే, రైతులు నిలదీస్తే..ప్రభుత్వం దగ్గర పైసల్లేవ్.. ఏం జేత్తరో జే యుండి అంటున్నరు. ఇప్పటివరకు అక్కడ రైతులకు ఇచ్చింది రూ.1400 కోట్లే! కానీ తెలంగాణలో రూ.17 వేల కోట్ల రైతు రుణాలు మాఫీచేసినం. మళ్లీ ఇప్పుడు 24 వేల కోట్ల రుణాలు మాఫీచేస్తం. దీనికోసమే సోనియా తల్లడిల్లుతున్నరా? ఇవన్నీ మంచిగ కనబడ్తలేవా? రైతులకు మంచి జరుగద్దా! మీ రాజ్యంల ఎన్నడన్న పేదలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తున్నరా? మేం ప్రకటించినదానికి కట్టుబడి ఉన్నం. రాత్రింబవళ్లు కష్టపడి, నోరుగట్టి, కడుపుకట్టుకుని, అవినీతి బంద్‌పెట్టి, కుంభకోణాలు, లంబకోణాలు లేకుండాచేసి, సచివాలయం చుట్టూ పైరవీకారుల మంద లేకుండాచేసి ప్రభుత్వ ఆదాయం పెంచినం. దాన్ని ప్రజలకు పంచుతున్నం. దీన్నిచూసి నీ కడుపు తరుక్కుపోతున్నదా?

అవినీతి చరిత్ర మీది
అలిండియా కాంగ్రెస్ కమిటీ నేత సుర్జేవాల్ అని ఒగడొచ్చిండు. టీఆర్‌ఎస్ అవినీతి చేసిందట! ఇండియాలో కాంగ్రెస్ నేతలను మించిన అవినీతిపరులు మరెవ్వరైనా ఉన్నారా? కుంభకోణాల చరిత్ర మీది. నిన్నగాక మొన్న.. భక్త చరణ్‌దాస్.. టిక్కెట్లు ఇచ్చేదాంట్ల ఆయనొక్కడు! మూడుకోట్లకో టిక్కెట్టు అమ్ముకున్నడు. ఇబ్రహీంపట్నంలో మల్లేశ్‌యాదవ్‌ను మూడుకోట్లు అడిగారు. ఆయన ఇప్పుడు రెడీగా ఉన్నడు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు. భక్తచరణ్‌దాస్ కొడుకు ఈ మూడు కోట్ల అడిగిండని ఆడియో రికార్డు కూడా వచ్చినది. దేశమంతటా ఈ బాగోతాన్ని చూసిండ్రు. పీసీసీ అధ్యక్షుడు టిక్కెట్లు అమ్ముకున్నరని కాంగ్రెసోళ్లే చెప్పుతున్నరు.

అటువంటి అవినీతి చరిత్ర కాంగ్రెసోళ్లకు ఉంది.
వెన్నెముక, పౌరుషం లేనివారు కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఉన్న తెలంగాణను ముంచింది తెలంగాణ కాంగ్రెస్. మధ్యలో అడిగితే కాల్చిచంపింది తెలంగాణ కాంగ్రెస్. మళ్లీ చంద్రబాబును భుజాల మీద తెచ్చి, సోనియాగాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే మా సంగతి ఏందమ్మా? అని ఒక్కడూ అడుగరు. అప్పట్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేను తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను పో అన్నరు. ఒక్కడన్న లేచారా? ఆయన చుట్టే ఉన్నరు ఈ పొన్నాల, గద్వాల ఆమె, ఒక్కరు లేవలేదు! అట్ల ఎట్ల అంటవని అడుగలే. మనమే పేగులు తెగేదాకా కొట్లాడినం. నాటినుంచి నేటిదాకా వెన్నెముక, పౌరుషం లేనివిధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నరు.

ఇది పోరాటాల గడ్డ.. ఎంతకైనా తెగిస్తం..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎక్కడ మీటింగ్‌కు వచ్చినా.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్న! నువ్ ఆంధ్రాకు ప్యాకేజీ ఇచ్చుకో.. గంగలో పో.. మాకేం సంబంధం లేదు. ఏపీకి పారిశ్రామిక ప్యాకేజీలో భాగంగా ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తరో.. అవి తెలంగాణకు ఇస్తవా ఇయ్యవా? రాహుల్ చెప్పాలె. చెప్పి నిజాయతీ రుజువు చేసుకోవాలె. విభజన చట్టంలో పెట్టారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో చెప్పారు. ఆ మాట మీద ఉండాలె. లేకపోతే తెలంగాణ.. మీ లాగు పగిలేదాకా దంచుతది జాగ్రత్త! మేం ఉద్యమం చేసేవాళ్లం. పోరాటం చేసేవాళ్లం. భయపడం. ఎంతకైనా తెగిస్తం.. నీ సంగతి చూస్తం. ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే రాహుల్‌గాంధీ ఓట్లు అడగాలి.

అవినీతి సొమ్మంతా కక్కిస్త
పోయిన టర్మ్‌లో నేను ఎవరి జోలికి పోలే. కాంగ్రెసోళ్ల అరాచకాలు ఆకాశమంత ఉన్నయి. ఒకవేళ వాటిపై ఎంక్వయిరీ వేస్తే.. కేసీఆర్ పగబట్టిండని బద్నాంచేస్తరు. నాకు కూడా టైంవేస్ట్ అనుకున్న. ముందు తెలంగాణలో కరంట్ కావాలె. ప్రాజెక్టులు పూర్తిచేయాలె. సమస్యలు పోవాలె. సంక్షేమం రావాలె. ఆత్మహత్యలు బంద్ గావాలె. ఇవన్నింటికోసం నేను ఎవరి తెరువుపోలె. మంచిగున్నం. నిజాయతీగా ఉన్నోళ్లతోని గోక్కుంటే.. ఈసారి గ్యారంటీగా మా ప్రభుత్వమే వస్తది. మీ ప్రభుత్వంలో ఎవరెవరు ఏమేం చేసిండ్రో మొత్తం కక్కిస్తం జాగ్రత్త! ఒక్కన్ని కూడా వదిలిపెట్టం. అన్నీ బయటకు తీస్తం. అవినీతితో మింగిన సొమ్మును మొత్తం కక్కించి సంక్షేమానికి ఖర్చు చేస్తం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.