Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఆరుగురు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ తరఫున ఇప్పటివరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తమ పార్టీ పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నదని చెప్పారు. -మిగిలిన ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎంపిక -మొత్తం12 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు తథ్యం -పార్టీ నాయకుడు కే కేశవరావు ధీమా -సీఎం కేసీఆర్ ఇచ్చినమాట నిలబెట్టుకునే నాయకుడు

TRS MLC Candidates

అందులో భాగంగానే ఖమ్మం స్థానానికి బాలసాని లక్ష్మీనారాయణ, నిజామాబాద్‌కు రేకులపల్లి భూపతిరెడ్డి, కరీంనగర్‌లోని రెండు స్థానాలకు భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావులను, ఆదిలాబాద్‌కు పురాణం సతీశ్, మెదక్‌కు వెన్నవరం భూపాల్‌రెడ్డిని పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించిందని వివరించారు.

నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని ఇదివరకే ప్రకటించామని, మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలో వెల్లడిస్తామని కేకే చెప్పారు. నిజామాబాద్‌లో తమ అభ్యర్థి గెలుపునకు ఢోకా లేదని, ఇతర స్థానాల్లోనూ అనుకూల పరిస్థితులున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు మొత్తం 12 స్థానాల్లోనూ గెలవడం తథ్యమన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతిబిడ్డ తెలంగాణ కావాలని కోరుకున్నారని, ప్రజా ఉద్యమంలో నుంచి తెలంగాణ రాష్ట్రం పుట్టిందని, ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, ఆయన చేపట్టిన ప్రతిపనిలోనూ నిజాయితీగా వ్యవహరించే నాయకుడన్న విషయం రుజువవుతుందన్నారు.

మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి ఉండటం అదృష్టమని, ఆయన తెలంగాణ అభివృద్ధికోసం ఏదైనా చేయాలని ప్రతిక్షణం తపన పడుతారన్నారు. ఇటువంటి సీఎం ఉండటం వల్ల రాష్ట్రం పురోగతి సాధించేందుకు వీలవుతుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ అన్ని విధాలా ఆలోచించి, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో చర్చించి పార్టీని బలోపేతం చేసే విధంగా అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే అభ్యర్థులను ఖరారు చేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రజల్లో ఉండి వారి విశ్వాసాన్ని చూరగొన్నదని, వరంగల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పార్టీపై ప్రజల్లో ఉన్న అనుకూలత వెల్లడైందని ఆయన చెప్పారు.

ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ పూర్తి పేరు: బాలసాని లక్ష్మీనారాయణ; పుట్టిన తేదీ: 6-7-1959 తల్లిదండ్రులు: సన్యాసయ్య, రత్నమ్మ; స్వగ్రామం: మరికాల, వెంకటాపురం మండలం; రాజకీయ ఆరంగేట్రం: 1987, మరికాల సొసైటీ చైర్మన్ పదవులు: 1987-1990 వరకు డీసీఎంఎస్ చైర్మన్. 1990- 1994 వరకు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు. 1995- 2004 వరకు డీసీసీబీ చైర్మన్. 1997- 2000 వరకు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు. 2004- 2009 వరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. 2009- 2015 ఎమ్మెల్సీ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి 2014లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక.

కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి భానుప్రసాద్ పూర్తి పేరు: తానిపర్తి భానుప్రసాద్‌రావు; జననం : 1966 తల్లిదండ్రులు: ప్రేమలత, ప్రభాకర్‌రావు; విద్యార్హత: బీటెక్ (ఆర్కి టెక్చర్); స్వగ్రామం: ఎలిగేడు మండలం లోకపేట; చేపట్టిన పదవులు: 2009 మే 2 నుంచి 2015 మే 1 వరకు కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ.

కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి నారదాసు లక్ష్మణ్‌రావు పూర్తి పేరు: నారదాసు లక్ష్మణ్‌రావు: పుట్టిన తేదీ: 15-09-1955; తండ్రి పేరు: కేశవరావు; కులం: ఎల్లాపు (బీసీ ఏ): విద్యార్హతలు: ఎంఏ రాజనీతి శాస్త్రం (ఉస్మానియా యూనివర్సిటీ): వృత్తి: న్యాయవాది; స్వగ్రాం: తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం: పదవులు: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా 2008 డిసెంబర్ 18 నుంచి 2013 మార్చి 29 వరకు.

మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూపాల్‌రెడ్డి పూర్తి పేరు: వెన్నవరం భూపాల్‌రెడ్డి; పుట్టిన తేదీ: 1 మే, 1947; చదువు: పీయూసీ రాజకీయ ప్రవేశం: ఇందిరాగాంధీ స్ఫూర్తితో 1967లో కాంగ్రెస్‌లో చేరిక. నిర్వహించిన పదవులు: 1969లో పటాన్‌చెరు విద్యాకమిటీ అధ్యక్షుడిగా.. 1975 -78 వరకు రెండు పర్యాయాలు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా.. 1987లో రామచంద్రాపురం మండల ప్రెసిడెంట్‌గా.. 1987లోనే జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా సేవలందించారు. 1996లో పీసీసీ సభ్యుడిగా, 2000లో పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. 2007లో, 2009లో ఎమ్మెల్సీగా, 2012-14 వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి పూర్తిపేరు: డాక్టర్ భూపతిరెడ్డి రేకులపల్లి: తల్లిదండ్రులు: రేకులపల్లి లక్ష్మి, రాజారెడ్డి; పుట్టిన తేదీ : 12 ఫిబ్రవరి 1964: స్వగ్రామం: జలాల్‌పూర్, నిజామాబాద్ మండలం: చదువు: ఎంఎస్(ఆర్థో) ఉస్మానియా కళాశాల: నిజామాబాద్ ఖలీల్‌వాడిలో నర్సింగ్ హోం ఏర్పాటు చేసి 1996 నుంచి ఆర్థోపెడిక్ సర్జన్‌గా సేవలందిస్తున్నారు; సేవలు : టీఆర్‌ఎస్ స్థాపించిన నాటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 2001నుంచి 2009 వరకు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, డిచ్‌పల్లి ఇన్‌చార్జిగా.. 2009-2014 వరకు టీఆర్‌ఎస్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేశారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి పురాణం సతీశ్ పూర్తిపేరు: పురాణం సతీశ్‌కుమార్; స్వగ్రామం: కోటపల్లి పుట్టిన తేదీ: 9 నవంబర్, 1964; చేపట్టిన పదవులు: 1987లో రాజకీయ రంగ ప్రవేశం. 1995లో ఎంపీటీసీగా, 1997లో టీడీపీ జిల్లా కార్యదర్శిగా, 1998లో చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, టీడీపీలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 ఫిబ్రవరి 7న టీఆర్‌ఎస్‌లో చేరిక. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా సేవచేశారు. 2010 నుంచి తూర్పు జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.