బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఆ పార్టీ నేతలు స్పష్టంచేయాలి. ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా ప్రైవేట్ పరం చేసినందుకా? ఉన్న ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలు ఇవ్వనందుకా? ఐటీఐఆర్‌ను రద్దుచేసినందుకా? ఎల్‌ఐసీని, రైల్వేను, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచిస్తున్నందుకా? ఎందుకో చెప్పాలి. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నందుకా? పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలి. – తన్నీరు హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి

ఓటేసి ఆశీర్వదించండి ఇదివరకు పట్టభద్రుల ఎన్నికల్లో న్యాయవాదులు ఆడ్వకేట్‌కు ఓటేశారు. ఇప్పుడు అడ్వకేట్ బిడ్డకు ఓటేసి ఆశీర్వదించాలి. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అడ్వకేట్‌గా పనిచేశారు. ఆయన కూతురు సురభి వాణీదేవి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమెకు న్యాయవాదులంతా మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపించాలి. తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్లు ఎలా పనిచేశారో తెలుసు. వారితో కలిసి ఎన్నో ఉద్యమాలు చేశాం. వారి సమస్యలు, కష్టాలు అన్నీ తెలుసు. అందుకే దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం కేసీఆర్ అడ్వకేట్ నిధిని ఏర్పాటు చేశారు. – శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ మంత్రి

కేంద్రం కల్పించిన ఉద్యోగాలెన్ని? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో లెక్క చెప్పాలి. బీజేపీ అధికారంలో ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో తెలియజేయాలి. ఉద్యోగ కల్పనలో బీజేపీ విఫలమైతే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బహిరంగంగా తప్పుకోవాలి. దేశంలో పెట్రో ధరలను గాలికొదిలేసి, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తున్నది. – వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి

టీఆర్‌ఎస్‌తోనే సమస్యల పరిష్కారం ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. పరిశ్రమల స్థాపనకు తెలంగాణను అనుకూలంగా మార్చింది. ఆరేండ్లలోనే 14 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చి, 15 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ప్రతి నెలా 40 లక్షల మందికి పెన్షన్లు, ఏడాదికి రెండుసార్లు 60 లక్షల మందికి రైతుబంధు, 32 లక్షల మంది రైతులకు రైతుబీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఏడేండ్లల్లో మోదీ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం. – నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి

దేశంలో రాష్ట్రానికి అధిక గుర్తింపు ప్రస్తుతం దేశంలోనే తెలంగాణకు ఎంతో గుర్తింపు లభించింది. కరోనా సమయంలో కుడా రాష్ట్రం ఆర్థికంగా బలపడింది. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలే వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలి. అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ను ఆదరించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లాను గెలిపించాలి. – వినోద్‌కుమార్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు
