-ఎంఈఐఎల్- హరే రామ ట్రస్టు సహకారంతో ఐదు రూపాయలకే భోజనం -దశల వారీగా అన్ని మార్కెట్ యార్డుల్లో: హరీశ్‌రావు
రైతులకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించే సద్దిమూట పథకాన్ని మెదక్ జిల్లా సిద్దిపేట వ్యవసాయమార్కెట్ యార్డులో భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు. రాష్ట్రంలో150 మార్కెట్‌యార్డులుండగా మొదటగా సిద్దిపేట యార్డు లో ఈ పథకానికి శ్రీకారం చుట్టామని, దశలవారీగా అన్ని యార్డుల్లో పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఏరియా మాతాశిశు సంరక్షణా దవాఖానలోనూ భోజనామృతం పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఎంఈఐఎల్ కంపెనీ, హరే రామ.. హరే కృష్ణ ట్రస్ట్ సహకారంతో ఈ పథకాలను అందిస్తున్నామని తెలిపారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతులకు రూ.5 కే భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఇందులో రైతు లు రూ.5 చెల్లించగా, మార్కెట్ కమిటీ రూ.5, మిగిలిన ఖర్చుల ను ఎంఈఐఎల్ కంపెనీ, హరే రామ..హరే కృష్ణ ట్రస్టు భరించనున్నదని తెలిపారు. దవాఖానల్లో అందించే భోజనామృతం రోగులకు, సహాయకులకు ఉచితంగా అందించనున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌యార్డుల్లో కూడా దాతల సహకారంతో సద్దిమూట పథకానికి శ్రీకారం చుడుతామన్నారు. ప్రతి మార్కెట్‌లో గిడ్డంగుల స్థాయిని పెంచడానికి సర్వే చేపట్టామన్నారు. ధాన్యానికి ధర లేనప్పుడు గోదాములో నిల్వ చేసుకునే వెసలుబాటును రైతుబంధు పథకం ద్వారా కల్పించామన్నారు.
నిల్వ చేసుకున్న ధాన్యంపై 75 శాతం వరకు సుమారు రూ.2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చని, దీనికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతుకు ప్రమాద బీమా పథకం కూ డా వర్తింపజేస్తామన్నారు. అంతకుముందు పత్తి మార్కెట్ యార్డులో రూ.12 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులతోపాటు దుబ్బాక మార్కెట్ కమిటీ ఆవరణలో, సీడీపీవో, సబ్ రిజిస్ట్రార్ భవనాలు, స్టేడియం, దుకాణాల సముదాయం పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి లక్ష్మీభాయ్, జేసీ శరత్, ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్టర్ రవిరెడ్డి, హరే రామ.. హరే కృష్ణ ట్రస్ట్ ప్రతినిధి సత్యగౌరీచంద్రలతోపాటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.