మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించి, నడిపించి, ఉరికించి తీరం చేర్చిన 14ఏళ్ల ప్రస్థానంలో ఆ పార్టీలో మరో నేత కూడా ఉద్యమానికి మహా పోరాటమే చేశారు. కేసీఆర్‌కు కుడిభుజంలా ఉంటూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎలుగెత్తి చాటుతూ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం రగిలించారు. -తెలంగాణ ఉద్యమ సారధికి కుడిభుజం -సీమాంధ్ర దోపిడీపై గురిపెట్టిన ఈటెల

శాసనసభలో టీఆర్‌ఎస్‌ను ఒంటరి చేసి సమైక్యవాదులు చెలరేగిపోతుంటే తన వాగ్ధాటితో వారిని దీటుగా ఎదుర్కొని నిలిచి గెలిచారు. ఆయనే టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా నిన్నమొన్నటివరకు కొనసాగిన ఈటెల రాజేందర్. తెలంగాణ సమాజం పడుతున్న బాధలను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పటంలోనూ, యువత, ఉద్యోగులు, రైతులు, కార్మికులు ఇలా అన్నివర్గాల వారినీ ఉద్యమంలో సమన్వయం చేయటంలోనూ ఆయన నిర్వర్తించిన పాత్ర అసాధారణం. కేసీఆర్ తూటాల్లాంటి మాటలతో తెలంగాణ జనాన్ని ఉద్యమంలోకి ఉరుకులు పెట్టిస్తే, ఈటెల తన సహజసిద్ధమైన సౌమ్యతతో తెలంగాణ ఎందుకు కావాలో సామాన్యులకు సైతం విడమర్చి చెప్పారు. నిండు అసెంబ్లీలో పిడికెడంత మంది ఏం చేస్తారంటూ సీమాంధ్ర అహంకారి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హూంకరించినప్పుడు ఆయను సవాలు చేసి నిలబడి తెలంగాణ ప్రజల చేత ఈటెల శహబాష్ అనిపించుకొన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేసిన 16 స్థానాల్లో ఏడింట్లో మాత్రమే విజయం సాధించింది.
2004 ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచిన 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్ వైపు వెళ్లడంతో మళ్లీ ఉద్యమాన్ని రక్షించుకునే క్రమంలో ఈ ఎన్నికలు జరిగాయి. కేవలం ఏడు శాసనసభ స్థానాలే గెలవడంతో దీనికి శాసనసభాపక్ష నేతగా ఈటెల రాజేందర్‌ను ఎన్నుకున్నారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 10 శాసనసభ స్థానాలే గెలిచింది. ఈ సమయంలో కూడా ఈటెల రాజేందరే శాసనసభాపక్ష బాధ్యతలు స్వీకరించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బలం పెరగటంలో ఈటెల పాత్ర వెలకట్టలేనిది. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా ఆరు సంవత్సరాల కాలంలో ముగ్గురు సీమాంధ్ర ముఖ్యమంత్రులను ఎదుర్కొని నిలిచిన ఆయన, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు.