Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సవాళ్లను అధిగమిస్తాం

-ఆర్థిక పరిస్థితిపై వచ్చే బడ్జెట్‌కు ముందు శ్వేతపత్రం -ఇంకా ఏపీ ఖాతాలోకే వెళుతున్న కేంద్రం నిధులు: సీఎం -దళితులకు మూడెకరాల భూమి నిరంతర ప్రక్రియ -కల్యాణలక్ష్మికి నిధుల కేటాయింపు ఖరారు చేస్తాం -విద్యుత్ విషయంలో మూడేండ్లలో అద్భుతాలు తథ్యం -జిల్లాల సమస్యలపై ఎమ్మెల్యేలతో సమావేశాలు -బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీలు -బడ్జెట్‌పై చర్చ ముగింపులో ముఖ్యమంత్రి కేసీఆర్ -బంగారు తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: ఈటెల

KCR Speech in Assembly

కొత్త రాష్ర్టానికి పరిపాలనాపరంగా వివిధ అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా అధిగమిస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తంచేసింది. ఈ క్రమంలో అందరినీ కలుపుకొనిపోతామని స్పష్టంచేసింది. మన రాష్ట్రం.. మన బడ్జెట్ అనే మాటను నూటికి నూరుపాళ్లూ అక్షరసత్యం చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై చర్చను ప్రభుత్వం అర్థవంతంగా ముగించింది. ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడమేకాకుండా.. విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, వారి సలహాలు స్వీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రప్రథమ బడ్జెట్ అమలుపై రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చేలా పద్దుల పని పూర్తి చేసింది. ఈ నెల 5న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శుక్రవారం వరకూ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం సభ్యులందరి అనుమానాలను నివృత్తి చేస్తూ, వివరణలు ఇస్తూ ఆర్థిక మంత్రి ముగింపు ఉపన్యాసం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకూడా వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ, సభ్యులకు వివిధ అంశాలపై హామీలిచ్చారు. విభజన అనంతరం అనేక అంశాలను పరిష్కరించాల్సి ఉందని సీఎం చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని నిధులు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ అవుతున్నాయని తెలిపారు. వచ్చే బడ్జెట్‌నాటికి ఇటువంటి అన్ని అంశాలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తున్న అడ్డంకులు, ఇంకా నిధుల కేటాయింపులపై జరుగుతున్న అన్యాయంవంటి సమస్యలు తెలంగాణకు ఇబ్బందికరంగా మారాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఐఏఎస్ అధికారులను కేటాయించకపోవటంవల్ల కూడా సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సమస్యలపై ఢిల్లీకి అఖిలపక్షంగా వెళదామని ప్రతిపాదించారు.

సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన సూచనలను స్వీకరించిన ముఖ్యమంత్రి.. 2015-16 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలచేస్తామని ప్రకటించారు. వచ్చే నెలాఖరులో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రిపోర్టు అందిస్తుందని, దీంతో రాష్ట్ర ఆదాయ-వ్యయాలు, ఆస్తులు-అప్పుల విభజనపై స్పష్టత వస్తుందని వివరించారు.

విద్యుత్‌పై సమస్య అధిగమించే విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్న సీఎం.. ఈ రంగంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయని ఉద్ఘాటించారు. మూడేళ్లలో 20వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కల్యాణలక్ష్మివంటి పథకాలకు ఎంత మొత్తం ఖర్చవుతుందనేది సరైన అంచనా లేదని, నాలుగైదు నెలలు గడిస్తే వచ్చే దరఖాస్తులను బట్టి ఏడాదికి సుమారుగా ఎంత ఖర్చవుతుందనేది అంచనా వేయొచ్చని చెప్పారు. ఆ తర్వాత దానికి నిర్దిష్టమొత్తంలో నిధులు కేటాయించుకుందామని అన్నారు.

భూముల పంపిణీ నిరంతర ప్రక్రియ దళితులకోసం భూముల కొనుగోలుకు బడ్జెట్‌లో వెయ్యి కోట్లు ఎలా సరిపోతాయనే విమర్శకు సీఎం సమాధానం చెబుతూ.. ఇది నిరంతర ప్రక్రియని, ప్రతి సంవత్సరం కేటాయింపులు పెంచుతూ అర్హులైన ప్రతి దళితుడికీ మూడెకరాల భూమి స్వాధీనంలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో మరోసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, గిరిజనుల ప్రగతికి బాటలు వేద్దామని అన్నారు. మెదక్ జిల్లాలోని తన సొంత గ్రామంలో 90ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే 136మంది లబ్ధిదారులకు పంచి, బాట లేకుండా, సరిహద్దులు చూపకుండా సాగుచేసుకోవాలని అంటే.. ఎలా చేస్తారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకే తమ ప్రభుత్వం ఇలాంటి లోటుపాట్లు, దుస్థితికి అవకాశం లేకుండా ప్రతి దళితుడికి మూడెకరాల భూమి ఉండేలా చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.

అన్ని జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీలు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే రోజుకో జిల్లా చొప్పున వివిధ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశమై.. ఆయా జిల్లాల్లోని ప్రాజెక్టుల స్థితిగతులు, ప్రధాన సమస్యలు, పథకాల అమలు విషయంలో చర్చిస్తానని చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించబోదని సంకేతాలిచ్చారు. బీసీల సంక్షేమానికి తగినన్ని నిధులు కేటాయించలేదని విపక్షాలు పేర్కొనడాన్ని ప్రస్తావించిన సీఎం.. బీసీల సంక్షేమంపై అఖిలపక్షం ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.

రాష్ట్రంలో 50శాతంపైగా బీసీ జనాభా ఉందని, ప్రభుత్వం వారి అభ్యున్నతిని కాంక్షిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. అందుకు తగినట్లుగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆ సెక్షన్ల ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. టీడీపీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సూచనను స్వీకరించిన సీఎం.. గత ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీ కార్పొరేషన్ నుంచి మంజూరు చేసిన యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ఉంటే వారికి న్యాయం చేస్తామని.. అందరి అభిప్రాయం మేరకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

విద్యుత్ విషయంలో అద్భుతాలు తథ్యం విద్యుత్ సరఫరా పంపిణీపై విపక్షాలు లేవనెత్తిన పలు అనుమానాలను ముఖ్యమంత్రి నివృత్తి చేశారు. వచ్చే ఏడాదిలో ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుతుందని తెలిపారు. మూడేండ్లలో వివిధ మార్గాల్లో మొత్తం 20వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందని ఉద్ఘాటించారు. సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటికే బిడ్స్ ఆహ్వానించామని.. త్వరలో ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఉర్దూ ఉత్తీర్ణత మార్కులు ఇక 22 మైనారిటీల సంక్షేమానికి గతంలో ఏ ప్రభుత్వం చూపని చొరవను టీఆర్‌ఎస్ సర్కారు తీసుకుందని సీఎం సోదాహరణంగా వివరించారు. ఉర్దూ భాష పుట్టింది హైదరాబాదులో.. పెరిగింది ఢిల్లీలో.. విరాజిల్లింది ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అంటూ.. ఇక్కడ పుట్టిన ఉర్దూ భాషను నిర్లక్ష్యం చేయటం కలలో కూడా జరగదని స్పష్టం చేశారు. ఉర్దూ భాష సబ్జెక్టులో ఉత్తీర్ణులయ్యేందుకు 22మార్కులకు తగ్గించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ సూచనను సీఎం వెంటనే అంగీకరించారు.

ఐటీఐఆర్‌కు ఇతోధికంగా నిధులు సమాచార సాంకేతిక రంగాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి కానున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)కోసం ఆరువేల కోట్ల నుంచి పది వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. విప్రో 5వేల ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చిందని, ఆదిబట్లలో టీసీఎస్ యూనిట్‌తో 27వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

వీటితోపాటు ప్రభుత్వరంగంలోని వివిధ కార్పొరేషన్లలో లక్ష ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. ఉద్యోగుల విభజన విషయంలో కమలనాథన్ కమిటీ తుది నిర్ణయం తీసుకోకపోవటంవల్ల తెలంగాణలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలెన్ని? అన్నది తేలటం లేదని తెలిపారు. ఈ విషయంలో స్పష్టత వస్తే ఏ మేరకు కొత్తగా నియమకాలు చేసుకోవాల్సి ఉంటుందో తెలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో లక్ష వరకూ ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన ఉందని, అయితే ఖాళీల విషయంలో స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.

హౌసింగ్‌లో పెద్ద ఎత్తున అవినీతి హౌజింగ్ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు సీఐడీ అధికారుల విచారణలో స్పష్టమైందని సీఎం పేర్కొన్నారు. సీఐడీ విచారణ నివేదికను సభ ముందు ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులంతా ఉన్నత స్థితికి రావాల్సిందేనని.. ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో చేయూతనిస్తుందని ఆయన వివరిస్తూ.. తాము విద్యార్థులకు వ్యతిరేకం కాదని, బోగస్ విద్యా సంస్థలకు వ్యతిరేకమని చెప్పారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకే ఫాస్ట్ పథకాన్ని రూపొందించామని తెలిపారు. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1587 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కోసం పరభుత్వం 2537 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిందని చెప్పారు. అంతకు ముందు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ దిశగానే ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజల సంక్షేమమే తమ ప్రధమ ప్రాధాన్యమని ప్రకటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.