Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

శాసనసభ శోభ

బొడిగె శోభ.. ఇవ్వాళ చొప్పదండి ఎమ్మెల్యే నిన్న.. మాదిగ దండోరా నాయకురాలు మొన్న.. అజ్ఞాతదళ సభ్యురాలు.. సామ్యవాదం.. కుల ఉద్యమం.. చట్టసభలో సభ్యత్వం.. మారింది పోరాట స్వరూపమేగానీ ఆమె పనితీరుకాదు! ధనం.. కులం.. రాజకీయాల్ని ఏలుతున్న వర్తమానంలో.. చైతన్యం.. తిరుగుబాటే ఆమెకు పెట్టుబడి అయింది! ఆమె ఏది చేసినా హల్‌చలే అయితది.. బీడీ కార్మికురాల్ని అత్యాచారం చేయజూసిన ఆర్‌డీవోని తన్ని.. చెడ్డీమీద ఊరేగించింది! మహిళలకు మత్తుమందిచ్చి నీచంగా చూసిన వైద్యసిబ్బందిని.. వాళ్లకు వత్తాసుపలికిన ఎస్సైని గల్లాపట్టి కొట్టింది! భయమైతంది అన్నందుకు వెక్కిరించినోళ్ల రంగుడబ్బాల్ని బద్దలుకొట్టింది! కొన్నిరోజులకు ఆ చానళ్ల ప్రసారాలు మళ్లీ షురూ కావొచ్చు.. కాకపోవచ్చు కానీ బాధ్యత ఉన్నోళ్లు భయపడాలని మాత్రం గుర్తుంచుకుంటరు!

Bodige sobha 01

చదివింది ఇంటర్మీడియటే అయినా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొని, ఉద్యమ చరిత్రల్ని అధ్యయనం చేసిన శోభ.. మంచి వక్త. ఉపన్యాసం మొదలుపెట్టుడే గుర్తుంటది. ఎన్ని గంటలైనా అట్ల నడుస్తనే ఉంటది. మరి ప్రమాణ స్వీకారం రోజున ఎందుకు భయపడ్డవంటే.. ప్రతికూలతల్ని పక్కనపెట్టి సార్ నాకు చొప్పదండి టికెట్ ఇచ్చిండు. మాట్లాడుడు, పోరాడుడు కొత్తకాదు కానీ అది శాసనసభ! అట్టడుగు కులంలో ఒక మున్సిపాలిటీ స్వీపర్ బిడ్డగా భూమ్మీదికొచ్చిన నేను.. ఈ స్థాయికి వస్తనని ఎప్పుడూ అనుకోలేదు. పదమూడేళ్లసంది ఎట్లాంటి కష్టమొచ్చినా వెన్నుతట్టి నడిపించిన కేసీఆర్‌సార్ నా పక్కనే ఉన్నడు. చేతిలో రెండు ప్రమాణ పత్రాలున్నయ్. మొదటిదాన్ని మామూలుగానే చదివిన. రెండోది చదవబోతూ సార్ దిక్కు చూసిన.. ఆయన్ని తండ్రిలెక్కనే భావిస్తా. నన్ను నమ్మి.. ఇంత పెద్ద బాధ్యత నాకిచ్చిండు. నేను న్యాయం చేయగలనా.. అనిపించింది! భయమైతందనంగనే ఎప్పటిలెక్కనే బేటా.. నేనున్నగదాఅని కళ్లతో భరోసా ఇచ్చిండని చెమర్చిన కళ్లతో చెబుతుంది శోభ! ఆ వెంటనే ఆంధ్రచానళ్లలో వెకిలి ప్రసారాలు మొదలైనయ్. రెండు మూడు రోజులు ఇష్టమొచ్చినట్టు కూసిన్రు. టూరింగ్ టాకీస్‌లో సినిమాలు చూసేటోళ్లు.. పాశికల్లు తాగేటోళ్లు.. ఇట్ల ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన్రు. తెలంగాణ వచ్చుడు ఇష్టం లేకుంటే ఉండొచ్చుగానీ మరీ ఇట్ల బరితెగించుడు యావత్ తెలంగాణ సమాజానికి కోపం తెప్పించింది.

ఇష్యూని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న తర్వాతగానీ ఆ చానల్‌వాళ్లు శోభను కలిసి క్షమాపణకోరలేదు! వేరే చానల్ నుంచి కొత్తగా వచ్చినోళ్లవల్లే ఇలా జరిగింది. ముమ్మాటికి మా వాళ్లు చేసింది పొరపాటే. మా అంతర్గత కమిటీకూడా ఇదే తీర్మానించింది. అన్‌కండీషనల్‌గా.. అవసరమైతే రాతపూర్వకంగా బహిరంగ క్షమాపణలు అడుగుతాం. దయచేసి దీన్నింతటితో వదిలేద్దాం అన్నారట వాళ్లు! నాకొకదిక్కు కోపమొస్తనే ఉన్నది. ఒక ఆడామెని నవ్వుల పాలుచేసినందుకు ఎమ్మెల్యేని కాకపోయింటే ఆ వార్తలు రాసినోణ్ణి తంతుంటి. ఒకటేమాట.. మిమ్మల్నేం చెయ్యాల్నో సభ, సీఎం చూసుకుంటరు. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటది. నేను క్షమించాల్సిన అవసరంలేదని చెప్పి పంపిచ్చిన. ఈ విచిత్రమేందో నాకైతే అర్థమైతలేదు. అవ్.. నాయకులు తప్పుచేస్తే బాజాప్త నిలదియ్యాలె కానీ ఎమ్మెల్యేల్ని జోకర్లు చేసుడేంది? నిజం జోకర్లది పొట్టతిప్పలయితే ఆంధ్రమీడియాది బలుపు తిప్పలు!అని అంటున్నది శోభ.. జీవితం నేర్పిన చైతన్యంతో!

తిరిగితేనే బాగుపడతరు! ఎల్కతుర్తి మండలం దామెర శోభ సొంతూరు. అమ్మమ్మావాళ్లది హన్మకొండలోని కంచరకుంట. శోభవాళ్ల నాన్న సాతూరి రత్నం ఇల్లరికం పోయి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ లేబర్‌గా చేరిండు. తల్లి భాగ్యలక్ష్మి స్వీపర్. నలుగురు అక్కాచెల్లెళ్లు, ఒక తమ్ముడు. పెద్దబిడ్డ కాబట్టి ఇంటి బాధ్యతంతా శోభదే. పదోతరగతిదాకా కంచరకుంట గవర్నమెంట్ స్కూల్లో చదివింది. ఇంట్లోళ్లకి వండిపెట్టనీకని ఇంటర్ మధ్యలోనే ఆపేసింది. 16ఏళ్లకే సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన బొడిగె గాలన్నతో పెళ్లయింది. నిజానికి వాళ్లు మాకంటే ఉన్నోళ్లు. పదిహేనెకరాల భూమి, సవారి కచ్ఛురం కూడా ఉండేది. హన్మకొండలో పెరిగిన నన్ను పల్లెటూరికి ఇచ్చుడు మా వాళ్లకి ఇష్టం లేకుండే కానీ పట్టుబట్టి చేసుకున్నరని పెళ్లి ముచ్చట చెప్తది.

ఇంటర్ తర్వాత ఒక స్కూల్లో విద్యావాలంటీర్‌గా పనిచేసేటోడు గాలన్న. పెళ్లయిన కొద్దిరోజులకు డిప్లొమా చేద్దామని నిజామాబాద్ పోయిండు. అక్కడే ఆయనకి విద్యార్థి సంఘాలతో పరిచయమేర్పడింది. స్వతహాగా తిరుగుబాటు స్వభావమున్న గాలన్న కొద్దికాలంలోనే కమ్యూనిస్ట్‌గా మారిండు. తనతోపాటు భార్యను కూడా పార్టీ కార్యక్రమాలకు తీసుకుపోయేటోడు. పార్టీ అనుబంధ మహిళా సంఘంలో సభ్యురాలయింది శోభ. పేపర్లు, పుస్తకాలు చదువుడు.. ప్రతిరోజు ఏదోఒక ఆందోళనా కార్యక్రమంలో పాల్గొనుడు..ఆ టైమ్‌లోనే పట్టాపుస్తకాలు ఇస్తనని బీడీ కార్మికురాల్ని ఇంటికి పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించిన ఆర్‌డీవోని పట్టుకొని కొట్టి జైల్‌కి పంపించింది. ఇట్లా ప్రాక్టికల్‌గా సమాజాన్ని చదివిన శోభ.. చాలాకాలంపాటు అజ్ఞాతదళంలో పనిచేసింది! ఇద్దరు పిల్లలు. కూతురు దివ్య మరఠ్వాడా యూనివర్సిటీలో ఏజీబీఎస్సీ చదువుతున్నది. కొడుకు వికాస్.. సీబీఐటీలో బీటెక్ చేస్తున్నడు.

ఎమ్మార్పీఎస్.. సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా విషయమేందో తెల్సుకోవడానికి ప్రయత్నించేది శోభ. ఆ ఉత్సుకతతోనే 1997లో నిజామాబాద్‌లోని టౌన్‌హాల్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్ మీటింగ్‌కు భర్త గాలన్నతో కలిసి వెళ్లింది. స్టేజ్ మీద మంద కృష్ణ మాట్లాడుతున్నడు. మీటింగ్ అయిపోయినంక శోభను చూసి ఇక్కడున్నవేందిరా.. ఎట్లున్నవ్? అని పలకరించిండట. మందకృష్ణ ఆమెకు మేనమామ అయితడు. ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పుడు కంచరకుంటలోని శోభావాళ్లింట్లో షెల్టర్ తీసుకునేటోడు. సరే, ఇంటికి పోదురుకదా.. గదిలో ఆయుధాలు అవీ కనిపించినయ్. విషయం అర్థమైంది. ఇట్లకాదు.. మీరు నాతో కలిసి పనిచేయండని మందకృష్ణ అడిగేసరికి సరే అన్నరు శోభ, గాలన్న. ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఏబీసీడీ వర్గీకరణకోసం పోరాడింది శోభ. 1999లో మహాజనఫ్రంట్(వీరన్న వర్గం)నుంచి కమలాపూర్ శాసనసభ స్థానంనుంచి ఎం దామోదర్‌రెడ్డితో తలపడింది. ఎన్నికల్లో ఓడిపోయింది కానీ స్ఫూర్తిని మాత్రం కోల్పోలేదు.

ఆచార్యుడు చూపించిన దారిలో.. నేటితరం ఉద్యమకారుల్లో చాలామందిలాగే బొడిగె శోభ కూడా జయశంకర్‌సార్ ఉపన్యాసం విన్నతర్వాతే తెలంగాణ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నది. హైదర్‌గూడలోని 49వ నెంబర్ ఎమ్మెల్యేక్వార్టర్‌లో ఎమ్మార్పీఎస్ రాష్ట్రకార్యాలయం ఉండేది. దానికి సమీపంలోని జలదృశ్యంలో జయశంకర్‌సార్ అడ్రస్‌చేసిన మీటింగ్‌కి వెళ్లింది. తెలంగాణ ఎందుకు కావాల్నో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేరీతిలో అరటిపండు ఒలిశి నోట్లో పెట్టినట్టు వివరించేటోడు జయశంకర్‌సార్! పొలిటికల్ పవర్ అవసరాన్ని గురించి పదేపదే చెప్పేటోడు. బాధిత వర్గాలు చట్టసభల్లో ఉంటే ప్రొటోకాల్ వస్తది. సీఎం, పీఎంలనుకూడా నిలదియ్యొచ్చని సార్ చెప్పేటోడు. చట్టం చేసుకోలేకపోయినా వర్గీకరణనైతే సాధించుకున్నం. ఇకనుంచి తెలంగాణకోసం పనిచేద్దామనుకొని 27మందిమి కేసీఆర్‌ని కలిసి టీఆర్‌ఎస్‌లో చేరినం అని పార్టీలో చేరిననాటి సంగతుల్ని గుర్తుచేస్తది. ఇట్ల టీఆర్‌ఎస్ స్థాపించిన్రోలేదో.. 52 రోజులకే స్థానిక సంస్థల ఎన్నికలొచ్చినయ్. కరీంనగర్‌జిల్లా శంకరపట్నం జెడ్‌పీటీసీగా పోటీచేసేందుకు శోభకు అవకాశం వచ్చింది.

ప్రచారసామగ్రితోపాటు కొన్ని పైసలు కూడా ఇచ్చిందట పార్టీ. మధుసూదనాచారి, హరీశ్‌రావులాంటి నాయకులు కొద్దిమంది పర్సనల్‌గా ఆర్థిక సహాయం చేసిన్రట. నియోజకవర్గానికిపోయి ఆటో ఒకటి కిరాయికి తీసుకొని భర్త గాలన్నతో కలిసి చౌరస్తా ఏడ కనబడితే ఆడ మీటింగ్ పెట్టేది. అట్లా ఒకసారి కేశవపట్నంలో మాట్లాడుతుంటే కృష్ణారెడ్డి అనేటాయన ఇంత మంచిగ మాట్లాడుతున్నది.. కచ్చితంగా గెలిసేట్టున్నది కానీ ఆటోలో తిరిగితే టైమ్ సరిపోదు, రిస్క్ అయితది అని మైక్ సెట్ సహా కమాండర్ జీప్‌ను ఏర్పాటుచేసిండు. పార్టీ అభిమానులు ఇద్దరు ముగ్గురు ఎన్నికల ఖర్చును భరించడానికి ముందుకొచ్చిన్రు. ఇగ దళితవ్యతిరేకులు కొందరైతే మొఖం మీదనే తిట్టిన్రట. ఓటు అడగడానికి గడీకి పోతే మాదిగదానివి.. నీకు రాజకీయాలెందుకు అని అన్నోళ్లూ ఉన్నరట!

రేపటి కలకు ఇవ్వాళ్టి ప్రతిరూపం శంకరపట్నం జెడ్‌పీటీసీగా ఉన్నప్పుడు కొందరు మహిళలొచ్చి శోభకు చెప్పిన్రు.. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఆపరేషన్‌కోసం వచ్చేవాళ్లకు హాస్పిటల్ సిబ్బంది మత్తు మందిచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నరని! కలెక్టర్‌కు కంప్లయింట్ చేస్తే విచారణకు ఆదేశించిండు. సిబ్బంది తప్పేమీ లేదని వాళ్లని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిండు ఎస్‌ఐ. గొడవజరిగింది. మఫ్టీలో ఉన్న ఆ పోలీసోణ్ణి పొట్టుపొట్టు కొట్టిన్రు. అదొక సంచలన వార్తయింది. ఎక్కడికి పోయినా ఇదే సమస్య. ప్రతి ఆసుపత్రిలో లేడీ డాక్టర్ అవసరముంటుంది. ఒక్క హాస్పిటల్లోనేకాదు.. ప్రతిచోటా మహిళా సిబ్బందిని నియమించాలె. చట్టసభల్లో 33శాతంకాదు.. 50శాతం రిజర్వేషన్లు కల్పించాలె. అప్పుడుగానీ పరిస్థితిలో మార్పురాదంటున్నది. 2009నుంచి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న శోభ.. పార్టీలో సబ్బండవర్ణాల ప్రాతినిధ్యం పెరిగేటందుకు కృషిచేసింది.కేసీఆర్ నాకు తండ్రయితే నా భర్త గాలన్న గురువు లాంటివాడు. చిన్నవయసులోనే పెళ్లయింది. వంట తప్ప ఇతరవిషయాలేవీ తెలిసేవికాదు.

మహిళాసంఘంలో చేరిన తర్వాతే సమాజాన్ని అర్థంచేసుకున్నా. అత్యాచారాలు, ఆస్తితగాదాలు, మహిళల ఆత్మహత్యలు.. ఇవన్నిటికి కారణమైన పితస్వామ్య వ్యవస్థ నశించాలి. టీఆర్‌ఎస్‌అనేకాదు.. ఏపార్టీలోఉన్న, లేకున్నా అంబేద్కర్ ఆలోచనావిధానంతోనే ముందుకు వెళతాను. మా అధ్యక్షుడి కులం ఏదయినా కావచ్చు కానీ నన్నైతే సొంత బిడ్డలెక్కనే చూసిండు. చొప్పదండి నియోజకవర్గ సమస్యల పరిష్కారంతోపాటు పార్టీని మరింత బలోపేతం చెయ్యడమే నాముందున్న లక్ష్యం అంటూ ముగించింది శోభ! ప్రస్తుతానికి ఏర్పడింది భౌగోళిక తెలంగాణే అయినా రేపటి సామాజిక తెలంగాణ ఆశకు ఊపిరి పోసేలా.. కరీంనగర్‌జిల్లా నుంచి శాసనసభలో అడుగుపెట్టిన తొలి దళిత మహిళ బొడిగె శోభ! తెలంగాణ ఉద్యమం సాధించిన తొలి విజయం.. ఆమెలాంటి మరి కొందరు భూమిపుత్రులు శాసనసభలో అడుగుపెట్టడం!

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.