Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సర్పంచ్‌లకే పూర్తి బాధ్యతలు

-ఉపాధి హామీ పథకాన్నీ వారికే అప్పగిస్తాం -త్వరలో ఈ-పంచాయతీలుగా తీర్చిదిద్దుతాం -రెండేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు పూర్తి -విద్యుత్‌పై ఆంధ్ర సీఎం చంద్రబాబు కొర్రీలు -భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

Harish Rao సర్పంచ్‌లకు పూర్తి బాధ్యతలు ఇస్తామని, ఉపాధి హామీ పథకాన్ని కూడా వారికే అప్పగిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి సర్పంచ్‌గా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం అంటే మూడు రకాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ సచివాలయం అని అభివర్ణించారు. స్థానిక సంస్థలను స్థానిక సచివాలయాలుగా అభివృద్ధి చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలిపారు. ఇప్పటి నుంచి స్థానిక సంస్థలకు బదులు స్థానిక సచివాలయాలుగా పిలువబడుతాయన్నారు. కేరళ, కర్నాటక రాష్ర్టాల్లో గ్రామ సచివాలయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో గ్రామ సచివాలయాల పద్ధతిని అమలు చేస్తున్నామని వివరించారు. దీని కోసం రాష్ట్ర అధికారులను కేరళ, కర్నాటక రాష్ర్టాలకు శిక్షణ కోసం పంపిస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని పంచాయతీలన్నింటినీ కంప్యూటరీకరణ చేసి ఈ-పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని సర్పంచ్‌లకే అప్పగించబోతున్నామని, దీంతో నిరుపేదలకు వంద రోజులు పని దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రెండేళ్లలో విద్యుత్‌ను ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. విద్యుత్ సమస్యలతో తెలంగాణ ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలతోపాటు 450 మెగావాట్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రా సీఎం చంద్రబాబు వారి వశం చేసుకున్నారని, తెలంగాణ వాటాలో 1.2 శాతం తగ్గించారని ఆగ్రహించారు. ఆరు దశాబ్దాలుగా సీమాంధ్రులతో కలిసున్న పాపానికి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లన్నీ వారి ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకున్నారన్నారు. రెండు, మూడు రోజులుగా విద్యుత్ సమస్య తీవ్రమవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెంటనే సీఎం స్పందించి నాప్తా బేజ్‌డ్ పద్ధతిలో రూ.12 యూనిట్ చొప్పున 350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

రాష్ట్రంలో నూతన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రెండు, మూడేండ్లలో విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు విద్యుత్ విషయంలో ఎన్ని కొర్రీలు పెట్టినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుందన్నారు. వర్షాలు సమృద్ధిగా లేక కరువు ఛాయలు నెలకొంటున్నాయని, అయినా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణిమురళీయాదవ్, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రాములుగౌడ్, ఎంపీపీ యాదగిరియాదవ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు ఎల్లయ్య, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్, పది జిల్లాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.