Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సర్కారు దవాఖానల్లో విలువైన వైద్యం ఉచితంగా

-ఖరీదైన మందులతో కరోనాకు చికిత్స
-చేతులెత్తేస్తున్న కార్పొరేట్‌ హాస్పిటళ్లు
-రోజుకు రూ.2 లక్షల బిల్లులు దారుణం
-అధిక వసూళ్లు, ఫిర్యాదులపై విచారణ
-కరోనా చికిత్సకు రూ.10 వేలు మించదు
-అడ్డగోలు ఫీజులపై చర్యలు తప్పవు
-త్వరలోనే లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు
-వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
‌ -పీపీఈ కిట్‌ ధరించి టిమ్స్‌లో కరోనా పేషెంట్లతో మాటామంతీ

ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ మందులు కార్పొరేట్‌ హాస్పిటళ్లలో సైతం అందుబాటులో లేవని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లు లేవని ప్రైవేటు దవాఖానలు చేతులెత్తేస్తున్నాయని, అయితే తాము ఆ మందులను సమకూర్చుకొని అవసరమైన ప్రతి రోగికి విలువైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆదివారం తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌) దవాఖానను ఈటల సందర్శించారు.

పీపీఈ కిట్లు ధరించి కొవిడ్‌ పేషెంట్లు, కరోనా వారియర్స్‌తో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన టిమ్స్‌ను పూర్తిస్థాయిలో కొవిడ్‌ దవాఖానగా అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఇక్కడ 1,350 బెడ్ల సౌకర్యం, ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్లు, వెంటిలేటర్ల సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. రోగుల భద్రత, నర్సింగ్‌ సిబ్బంది, ఔషధాలను కూడా సమకూర్చుతామని పేర్కొన్నారు. టిమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్లు మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. 24 గంటలు దవాఖానలో అందుబాటులో ఉంటున్నట్టు వైద్యులు చెప్పడంతో వారిని.. ఈటల అభినందించారు. టిమ్స్‌లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని దవాఖాన డైరెక్టర్‌ డాక్టర్‌ విమలా థామస్‌కు సూచించారు.

తొలిదశలో గుర్తిస్తే చికిత్స ఖరీదైంది కాదు

తొలిదశలో వైరస్‌ను గుర్తిస్తే చికిత్స ఖరీదైనది కాదని మంత్రి ఈటల స్పష్టంచేశారు. ఆక్సిజన్‌, మందులన్నీ కలిపితే రూ.10 వేలకు మించదని తెలిపారు. ప్రైవేటులో రోజుకు లక్ష, రెండు లక్షలు వసూలు చేయడం దారుణమని, అంత ఖర్చయ్యే చికిత్స అసలులేదని చెప్పారు. అడ్వాన్స్‌ చెల్లించనిదే చేర్చుకోకపోవటం, రోజుకు లక్ష, రెండు లక్షల దాకా ఫీజులు వసూలుచేస్తున్నారంటూ ప్రైవేటు దవాఖానల మీద ఫిర్యాదులు రావటంతో విచారణ కమిటీ ఏర్పాటుచేసినట్టు మంత్రి ఈటల వెల్లడించారు. నిబంధనలు పాటించని, అడ్డగోలుగా ఫీజులు వసూలుచేసే దవాఖానలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ రోగుల కోసం కావాల్సినన్ని పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంచి సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు

లక్షణాలు కనిపించగానే నిర్ధారణ పరీక్షల కోసం దవాఖానకు వెళ్లాలని, కొందరు నాలుగైదు రోజుల ఆలస్యం చేస్తున్నారని ఈటల తెలిపారు. అందుకే వైరస్‌ తీవ్రత అధికమై వారిని రక్షించడం కష్టమవుతున్నదని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చి శ్వాస ఇబ్బంది కలిగితే తక్షణమే దవాఖానలో చేరాలని సూచించారు. లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణం కాపాడటం వందశాతం సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలోని పలు దవాఖానల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటుచేయాలని నిర్ణయించామని, అప్పుడు ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేకపోయినా ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. త్వరలోనే లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను టిమ్స్‌, సరోజిని కంటి దవాఖాన, కింగ్‌ కోఠి, ఫీవర్‌ హాస్పిటల్‌, చెస్ట్‌ దవాఖాన, ఉస్మానియాలో అందుబాటులోకి తెస్తామని ఈటల ప్రకటించారు.

పీపీఈ కిట్‌ ధరించి.. పేషెంట్లతో ముచ్చటించి

ముందుగా మంత్రి ఈటల రాజేందర్‌ టిమ్స్‌ దవాఖానలో అన్ని గదులను కలియతిరిగారు. పీపీఈ కిట్‌ ధరించి కరోనా పేషెంట్లతో నేరుగా మాట్లాడారు. ఐసీయూలోకి వెళ్లి ప్రతి బాధితుడికి ధైర్యం చెప్పారు. వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎన్నిసార్లు బెడ్‌ వద్దకు వస్తున్నారు, చికిత్స విధానం ఎలా ఉన్నది, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా… అంటూ ప్రశ్నలు అడిగారు. వైద్య సిబ్బం ది, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులతోనూ మాట్లాడారు. పేషెంట్లకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించిన ఆయన.. గతంలో కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నందున నాణ్యతలో లోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. టిమ్స్‌లో సరిపడా వైద్య సిబ్బందిని ఏర్పాటుచేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం డీఎంఈ రమేశ్‌రెడ్డి, దవాఖాన డైరెక్టర్‌ విమలా థామస్‌తో కలిసి టిమ్స్‌ ప్రాంగణంలో ఈటల మొక్కలు నాటారు. అంతకుముందు టిమ్స్‌లో చికిత్స పొందుతున్న సీపీఎం రైతు సంఘం నాయకుడు మల్లారెడ్డిని ఆయన పరామర్శించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.