Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సంక్షేమంలో నంబర్ వన్

తెలంగాణ రాష్ట్రం సంక్షేమరంగంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. సంక్షేమరంగంలో రూ.28వేల కోట్లతో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే మార్చి నుంచి రైతాంగానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందన్న సీఎం.. గ్రామాల అభివృద్ధికే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు.

KCR

-28 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాల అమలు -చిక్కుముడులు విప్పుకొంటూ బంగారు తెలంగాణ దిశగా.. -వచ్చే మార్చినుంచి రైతాంగానికి 9గంటల పగటి విద్యుత్ -విద్యుత్‌లో స్వయం సమృద్ధికి 91,500 కోట్ల పెట్టుబడులు -ప్రశంసలందుకుంటున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ -టీఎస్ ఐపాస్‌తో రెండు వారాల్లోనే పరిశ్రమలకు అనుమతులు -భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉంది.. గ్రామాల అభివృద్ధికే గ్రామజ్యోతి -హైదరాబాద్‌కు 30 టీఎంసీల నిల్వతో రెండు కొత్త చెరువులు -వచ్చే ఏడాది కృష్ణా మహా పుష్కరాలను విజయవంతం చేద్దాం -69వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి -గోల్కొండ కోటలో జాతీయజెండా ఎగురవేసిన కేసీఆర్ శనివారం గోల్కొండ కోటలో 69వ స్వాతంత్య్రదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోట ప్రాంగణంలోకి రాగానే పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించిన ముఖ్యమంత్రి, ఆ తరువాత జాతీయ జెండా ఎగురవేసే ప్రాంగణానికి వచ్చారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. తెలంగాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన గోల్కొండలో గతేడాది స్వాతంత్య్రదిన వేడుకలు జరుపుకొన్నాం. తెలంగాణ రాష్ట్రంలో చిక్కుముడులు విప్పుకొంటూ బంగారు తెలంగాణ సాధనకోసం వ్యూహాలు రూపొందించుకుంటున్నాం.

సంక్షేమం, నీటిపారుదల, విద్యుత్, పరిశ్రమల స్థాపనలో ముందుకు వెళ్తున్నాం. సంక్షేమరంగానికి బడ్జెట్‌లో 28వేల కోట్లు కేటాయించుకుని భారతదేశంలోనే సంక్షేమరంగంలో నంబర్‌వన్ రాష్ట్రంగా ముందున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలో విద్యార్థులకు సన్నబియ్యం, బీడీ కార్మికులకు జీవనభృతి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఫీజు రీయింబర్స్‌మెంట్, దళితులకు భూ పంపిణీ తదితర కార్యక్రమాలు భాగంగా ఉన్నాయి. రైతాంగానికి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రూ.17వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం మాఫీచేసింది. అందులో రెండు విడతల్లో రూ.8500కోట్లు చెల్లించాం. పెండింగ్‌లో ఉన్న రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించాం.

గోదాంలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలోపెట్టుకుని 380 గోదాంల నిర్మాణానికి శ్రీకారంచుట్టాం. వాటి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు రూ.250కోట్లు కేటాయించి అమలుచేస్తున్నాం. మార్కెట్ ఇంటర్‌వెన్షన్‌కింద రూ.400కోట్లు, ఫాం మెకనైజేషన్‌కోసం రూ.400కోట్లు, మైక్రో ఇరిగేషన్‌కు రూ.402 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

విద్యుత్‌లో స్వయం సమృద్ధి విద్యుత్‌రంగంలో గత ఏపీలో 30 సంవత్సరాలుగా అనేక కష్టాలు పడ్డాం. రైతులు, విద్యార్థులు, పరిశ్రమలు, ప్రజల ఇబ్బందులు మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వస్తే చిమ్మచీకట్లు వస్తాయని, అంధకారం నెలకొంటుందని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని తలకిందులుచేస్తూ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మార్చి నుంచి రైతాంగానికి పగటిపూటనే 9గంటల విద్యుత్‌ను ఇవ్వనున్నామని చెప్తున్నందుకు సంతోషంగా ఉంది. విద్యుత్‌లో స్వయం సమృద్ధిని సాధించేందుకు రూ.91500కోట్ల పెట్టుబడులను ఇప్పటికే సమీకరించుకున్నాం.

రాబోయే నాలుగేండ్లలో 25వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను స్థాపించబోతున్నాం. నీటి వనరులైన కాకతీయ గొలుసుకట్టు చెరువులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోని 46వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరిస్తున్నాం. ఈ సంవత్సరం 9వేల చెరువులను బాగుచేశాం. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకుపోతున్నారు. ఈ కార్యక్రమానికి అనేక ప్రశంసలు లభిస్తున్నాయి. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్రసింగ్ ఈమధ్య తెలంగాణకు వచ్చి, ఆయన పుట్టినరోజును నెక్కొండ చెరువుకట్టమీద చేసుకున్నారు.

హైకోర్టుకూడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది. రాబోయే నాలుగేండ్లలో మిషన్ కాకతీయను కొనసాగిస్తాం. దీన్ని ప్రజలు, రైతులు ఉపయోగించుకోవాలి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పరిశ్రమలకోసం సింగిల్ విండో విధానం తీసుకువచ్చాం. దీన్ని అసెంబ్లీలోనే చట్టంగా చేశాం. పశ్చిమబెంగాల్ హైకోర్టు మన టీఎస్‌ఐపాస్ విధానాన్ని ప్రశంసించింది. ఈ విధానం ప్రకారం దరఖాస్తు చేసుకున్న రెండువారాల్లో అన్ని అనుమతులు ఇస్తున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో 36 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. పరిశ్రమలకోసం 1.5లక్షల ఎకరాల భూమి సిద్ధం చేసుకున్నాం. పరిశ్రమలువస్తే ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్‌అండ్‌బీశాఖ ద్వారా రూ.20వేల కోట్లతో రోడ్లవిస్తరణ కార్యక్రమం చేపడుతున్నాం. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండులేన్లు, జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నాలుగులేన్ల రోడ్లను వేస్తున్నాం.

వాటర్‌గ్రిడ్‌కు హడ్కో ప్రశంసలు వాటర్‌గ్రిడ్‌ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఇటింటికీ నీళ్లు అందించే బృహత్తర కార్యక్రమం జలహారం. ఈ పథకాన్ని ప్రారంభించకముందే హడ్కో ప్రశంసలు కురిపించింది. ఢిల్లీలో అవార్డు కూడా ఇచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఈ కలను మనం నిజం చేసుకోవాలి. నీటి వనరుల విషయంలో మనం దగా, మోసానికి గురయ్యాం. గోదావరిలో 90 టీఎంసీలు, కృష్ణాలో 360టీఎంసీల నీటి హక్కు ఉన్నా నీళ్లు మాత్రం మనకు రాలేదు. ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.

కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించినా.. అరకొర పనులే చేశారు. నీటి వనరుల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంపై సమగ్ర అధ్యయనం చేసి ఒక ప్రణాళికను ప్రజల ముందుకు తెచ్చాం. పోలీసులకు అన్నిరకాల వసతులు ఏర్పాటు చేశాం. మొత్తం పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాం. అంతర్జాతీయ స్థాయిలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను, షీటీంలను ఏర్పాటు చేశారు. పేకాటను నిషేధించాం. ఎన్నడూ లేనివిధంగా పోలీసులుకూడా సామాజిక కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు.

గోదావరిలాగే కృష్ణా పుష్కరాలు 144ఏండ్లకు ఒకసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలను విజయవంతం చేసుకున్నాం. పుష్కరాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీసులు, అధికార వ్యవస్థ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. రాబోయే కృష్ణా మహాపుష్కరాలను కూడా అంతే ఘనంగా నిర్వహిస్తాం. రంజాన్ సందర్భంగా 200 దావతే ఇఫ్తార్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1.95లక్షలమంది పేదముస్లింలకు దుస్తులు పంపిణీ చేశాం. బోనాల పండుగకు రూ.10కోట్లు ఖర్చుచేశాం. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం. విశ్వనగరంగా హైదరాబాద్‌ను మార్చుకునేందుకు రూ.21వేల కోట్లతో వివిధ పథకాల రూపకల్పనకు శ్రీకారంచుట్టాం.

జీహెచ్‌ఎంసీద్వారా ఈ పథకాలు ప్రజల ముందుకు వస్తాయి. జీవో 58ద్వారా రూ.10వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి వాటిని క్రమబద్ధీకరిస్తూ పట్టాలు ఇచ్చాం. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు ఏనాడో నిర్మించారు. 1.42 కోట్ల జనాభా కలిగిన హైదరాబాద్‌లో ఒక్క రిజర్వాయర్ కూడా లేకపోవడం బాధాకరం. 30టీఎంసీల చొప్పున మరో రెండు చెరువులను హైదరాబాద్‌కు ఉత్తర, దక్షిణ భాగాల్లో నిర్మించనున్నాం. స్థలం గుర్తించాం. నగరానికి తాగునీటి కొరత లేకుండా చేస్తాం.

గ్రామాలే దేశ ఆత్మ భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉంది. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అని జాతిపిత గాంధీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా గ్రామాల అభివృద్ధి జరుగలేదు. గ్రామాల అభివృద్ధి కోసమే గ్రామజ్యోతి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే నాలుగేండ్లలో రూ.25వేల కోట్లు ఖర్చు పెట్టి, గ్రామాల్లో సమస్యలను పారదోలుతాం. 25వేల రిక్షాలు కొని గ్రామాలకు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ఇవ్వనున్నాం. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డుమెంబర్లు, ఎంపీపీలు అందరూ గ్రామజ్యోతిలో భాగస్వాములు కావాలి.

పల్లెల్ని పట్టుగొమ్మలుగా తీర్చిదిద్దుదాం. తెలంగాణ నూతన రాష్ట్రంలో ప్రజల సహకారంతో ముందుకు వెళున్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ మధ్య ఆహ్వానం పంపింది. ఈ సమావేశానికి వచ్చి ప్రసంగించాలని కోరింది. ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పురోగమిస్తుందని చెబుతున్నాను. జై తెలంగాణ. జై హింద్.

సీఎం చేతుల మీదుగా పలువురికి సత్కారం విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన పలువురు పోలీసులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పతకాలు ప్రదానం చేశారు. వారితో పాటు తెలంగాణ తల్లి చిత్ర రూపకర్త బైరోజు వెంకటాచారి, కరాటే క్రీడాకారిణి సయిదా ఫలక్, చెస్‌లో అసియా చాంపియన్ చిన్నారి ప్రణీత్, ముఖ్యమంత్రి పీఏ వెంకటనారాయణ, వేములవాడ ఆలయం ఈవో దూస రాజేశ్వర్‌కు సీఎం శాలువాలు కప్పి సత్కరించారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.