ప్రణాళికాబద్ధంగా రాష్ర్టాభివృద్ధి: డిప్యూటీ సీఎం రాజయ్య

పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు. సోమవారం వరంగల్‌లోని కాకతీయ డిగ్రీ కళాశాలలో మెడికల్ డయాగ్నిస్టిక్స్ అండ్ మైక్రోబయోలాజికల్ అనాలిసిస్ ఆఫ్ పోర్టబుల్ వాటర్ అండ్ ఫుడ్ అంశంపై నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో మాట్లాడారు. నవ తెలంగాణ నిర్మాణంతోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు నిజమవుతాయన్నారు. పోరాడి సాధించుకున్న 69 రోజుల తెలంగాణ రాష్ట్రంలో ప్రణాళికబద్ధంగా పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన ప్రణాళిక, మన శాఖ-మన ప్రణాళికను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, ప్రతి ప్రభుత్వ శాఖలో ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ శాఖలను అభివృద్ధి చేసేందుకు పంచవర్ష ప్రణాళికలో కావాల్సిన నిధులను సమకూర్చనున్నట్లు చెప్పారు. ఆదివాసీలు, గిరిజనుల ప్రాంతాలు విద్యకు దూరంగా ఉండడంతో నాటువైద్యం, మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు జరుగుతున్నాయన్నారు. భద్రాచలం, ఏటూరునాగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించగా సమస్యలు తెలిశాయని వివరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ మార్తమ్మ అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రొఫెసర్ ఎస్ మధూసూదన్‌రెడ్డి, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ బీ సుదర్శన్‌బాబు, ఆర్జేడీ డాక్టర్ బీ దర్జన్ పాల్గొన్నారు.