ఉద్యోగులందరి కడుపు నిండేలా.. కొత్త సంవత్సరం కానుకగా పదో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఫిట్‌మెంట్ ఎంతశాతం ఇవ్వాలనే విషయంపైన, ఉద్యోగుల పంపిణీపైన లెక్కలు తేలలేదని, అందుకే కొద్దిగా ఆలస్యమవుతున్నదని తెలిపారు. సంక్రాంతి తర్వాత 99% ఉద్యోగులు సంతోషపడేలా, ఉద్యోగుల ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేలా, వారు ఊహిస్తున్న పద్ధతిలోనే పీఆర్సీ ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు.
-ఉద్యోగులకు కేసీఆర్ నూతన సంవత్సర కానుక
-రాజీవ్ స్వగృహ ఇండ్లు కేటాయిస్తాం
-హెల్త్‌కార్డులు కేసీఆర్ పెట్ పథకం
-పైగా భూముల విషయం తేలినంక ఇంక్రిమెంట్
-టీఎన్జీవో డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి
హెల్త్‌కార్డుల విషయంలో ఉద్యోగులపై నయాపైస కూడా భారం పడకూడదనేది ప్రభుత్వ సంకల్పమని కేసీఆర్ చెప్పారు. పైగా కుటుంబీకుల ఆస్తుల విక్రయంలో అనుకున్నంత రెవెన్యూ వచ్చినట్లయితే అదనంగా ఒక ఇంక్రిమెంట్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణలో ఏ ఉద్యోగీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సీఎం.. ఉద్యోగులందరూ ప్రభుత్వ కుటుంబ సభ్యులని చెప్పారు. నూటికి నూరుపాళ్లు తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని స్పష్టంచేశారు.
సంక్రాంతివరకు పీడదినాలు. అందుకని ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. పీడదినాలు పోయిన తర్వాత పీఆర్సీపైన ప్రకటన ఉంటుంది అని సీఎం తెలిపారు. మంగళవారం రవీంద్రభారతిలో టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభ జరిగింది. టీఎన్జీవో డైరీతోపాటు తెలంగాణ మోటార్ వెహికల్స్ అసోసియేషన్, వాటర్‌వర్క్స్ అసోసియేషన్ డైరీలనుకూడా సీఎం ఆవిష్కరించారు. ఈ సభకు టీఎన్జీవో అధ్యక్షులు జీ దేవీప్రసాద్ అధ్యక్షత వహించారు. ఉద్యోగుల విభజనను ఇంత వరకూ తేల్చని కమలనాథన్ కమిటీ పనితీరును సీఎం ఈ సందర్భంగా తప్పుపట్టారు. కమలనాథన్‌కు ఏం బీమారో నాకర్థంకాదు.
ఆర్నెల్లయింది. ఉద్యోగుల లెక్కలు చెప్పలేదు అన్నారు. దేవీప్రసాద్ సారథ్యంలో ఉద్యోగులందరూ ఒక ఆదివారం మిషన్ కాకతీయ కోసం రాష్ట్రవ్యాప్తంగా శ్రమదానం చేస్తామని ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. దటీజ్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అంటూ సీఎం ప్రశంసించగానే చప్పట్లు మార్మోగాయి. ఇప్పుడిప్పుడే వేరు పడ్డ సంసారం. కొన్ని చిక్కులు ఉన్నయి. వాటిని సర్దుబాటు చేస్తాం. కొద్దిగా ఓపికపట్టాలి అన్నారు. సంక్షేమ పథకాలను అమలుచేయడం ప్రభుత్వ బాధ్యతని, భారమైనప్పటికీ వీటిని నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు.
వ్యవసాయం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యరంగమని సీఎం చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం మూడో ప్రాధాన్య రంగమని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఏదైనా పథకానికి సర్వే చేయాలంటే సరైన సామాన్లు కూడా ఉండేవి కావని అన్నారు. వాటర్‌గ్రిడ్ వంటి పథకాలను మన ఉద్యోగులపై నమ్మకంతోనే ప్రభుత్వం ఆధ్వరంలోనే చేపడుతున్నామని కేసీఆర్ చెప్పారు.
సకల జనుల సమ్మె అసాధారణం రాష్ట్రసాధన ఉద్యమఘట్టాలను ప్రస్తావించిన సీఎం.. సకల జనుల సమ్మె ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఒక అసాధారణమైన, అద్భుతమైన ఉద్యమమని అన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం సారథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు, సకల వృత్తులకు చెందినవాళ్లు కేసులకు భయపడకుండా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆ రోజుల్లో ప్రతీరోజూ వారితో కలిసి ఉద్యమించామని, మళ్లీ ఇన్ని రోజులకు వారితో కలిసిమెలిసి మాట్లాడుకునే అవకాశం వచ్చిందని చెప్పారు.
ఉద్యోగులు సైనికులవలే పోరాడినందుననే ఈ విజయం సాధ్యమయిందని సీఎం వ్యాఖ్యానించారు. కోదండరాం నాయకత్వంలో తెలంగాణ విద్యావంతుల వేదిక సభలకు వెళ్లడం మరిచిపోలేని అనుభూతులను ఇచ్చిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలనుకూడా కోదండరాం సారథ్యంలోని ప్రజాసంఘాలకు వివరిస్తామని, వారి సూచనలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే అరుదైనదని పేర్కొన్నారు. సకల జనుల సమ్మె కాలానికి ప్రత్యేక సెలవు ఇచ్చే విషయం న్యాయస్థానంలో ఉన్నదని, అది పరిష్కారం కాగానే ఉద్యోగులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నిర్ణయం తీసుకుందామని హామీ ఇచ్చారు.
ఉద్యోగులకు హెల్త్‌కార్డులు కేసీఆర్ పెట్ పథకం ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలని, నగదు రహితంగా అందరికీ వైద్య సదుపాయాలు కల్పించాలని, ఈ విషయంలో ఉద్యోగులపై నయా పైసకూడా భారం పడకూడదనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం చెప్పారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు కేసీఆర్ పెట్ పథకం అని వ్యాఖ్యానించారు. కొంతమందికి తొందరెక్కువ ఉంటుంది. కొన్ని పత్రికలకు తెలంగాణ ప్రభుత్వంపైన ప్రేమ ఎక్కువగా ఉన్నది. పాపం.. రాస్తూనే ఉన్నాయి అని ఆయన ఎద్దేవా చేశారు. అంతమాత్రాన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
12కార్పొరేట్ దవాఖానల యాజమాన్యాలు కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నాయని, వారితో త్వరలో మాట్లాడి, అన్ని హాస్పిటళ్లలో ఉద్యోగులకు నగదు రహిత వైద్యం లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు మండలి చైర్మన్ కే స్వామిగౌడ్ మాట్లాడుతూ కేసీఆర్‌కు అరవై ఏండ్లు వచ్చాయని, తెలంగాణ ఉద్యమం అరవై ఏండ్లు నడిచిందని, అందుకని ఫిట్‌మెంట్ కూడా.. అంటూ తన మాటలు పూర్తి చేసేలోపు సీఎం కేసీఆర్ ఆయనను వారించారు. ఆయన కోటును పట్టుకుని గుంజారు. స్వామిగౌడ్‌ను వారించడంపై సీఎం తన ప్రసంగం సమయంలో వివరణ ఇచ్చారు.
స్వామిగౌడ్ తన పద్ధతిలో తాను మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు ఉద్యోగసంఘాల నాయకుడు కాదు. శాసనమండలి చైర్మన్. ఆయన ఫిట్‌మెంట్‌పైన ఎంత చెప్పితే ఆ శాతాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. మండలి చైర్మన్ మాటను శిరసావహించాల్సి వస్తుంది. అందుకే స్వామిగౌడ్ కోటు గుంజాల్సి వచ్చింది అని చెప్పారు. పైగా ప్రభువుల కుటుంబాలకు చెందిన ఆస్తులు లక్షల కోట్లలో ఉన్నాయని, ఆ కుటుంబీకులు కూడా తాము గడ్డివాము దగ్గర కుక్కలమయ్యామని మొత్తుకుంటున్నారని సీఎం చెప్పారు.
వాటిని విక్రయిస్తామని, నిధులు సమకూరగానే ఉద్యోగులకు అదనంగా ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ పరిస్థితి దారుణంగా ఉన్నదనే విషయాన్ని, అసెంబ్లీ ముందు, గవర్నర్ బంగ్లాముందు మోకాళ్లలోతు నీళ్లు నిలుస్తున్నాయన్న విషయాలను జీహెచ్‌ఎంసీ అధికారులకు, ఇంజినీర్లకు వివరించామని తెలిపారు. వీటన్నింటిలో మార్పులు తెస్తున్నామని, ఈ మార్పులకోసం ఉద్యోగులు శ్రమించాలని కోరారు.
ఉద్యోగులకు రాజీవ్‌గృహకల్ప ఇండ్లు రాజీవ్‌గృహకల్పలో చాలా ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని అనేక కారణాలతో యజమానులకు అప్పగించలేదని సీఎం చెప్పారు. ఒకవైపు ప్రభుత్వం రూ.280 కోట్ల మిత్తి అనవసరంగా చెల్లిస్తున్నదని అన్నారు. ఈ ఇండ్లను నిర్మాణ వ్యయాన్ని మాత్రమే తీసుకొని నయాపైసా లాభం లేకుండా ఉద్యోగులకు కేటాయిస్తామని, బ్యాంకులద్వారా రుణాలు కూడా ఇప్పిస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం ఒక కమిటీని వేసి కార్యాచరణ రూపొందించాల్సిందిగా వేదికపైనే ఉన్న దేవీప్రసాద్‌కు సీఎం సూచించారు.
వెసులుబాటు ఉండేలా బదిలీలు ఉద్యోగులందరికీ వెసులుబాటు ఉండేలా బదిలీలు ఉంటాయని సీఎం చెప్పారు. భార్యాభర్తలు కచ్చితంగా ఒకేచోట పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. యూ ఆర్ నాట్ బ్రిటిష్ కలెక్టర్స్ అంటూ హెచ్చరించామని కూడా చెప్పారు. ఏ ఉద్యోగిని ఎవరూ ఇబ్బంది పెట్టరని, అదేసమయంలో దేశంలోనే ఆదర్శవంతంగా, అవినీతిరహితంగా సేవ చేయాలని పిలుపునిచ్చారు.
మన ఖ్యాతి ఢిల్లీకి పాకింది ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు ఒకే కుటుంబమని చాటుతూ ఒక సుహృద్భావవాతావరణంలో అవినీతిరహితంగా తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రమంత్రులందరూ అవినీతికి దూరంగా ఉన్నారని, వారిశాఖలలో అవినీతిని పారదోలుతున్నారని అన్నారు. మన ప్రభుత్వం అవినీతిరహితమని ఢిల్లీవరకు తెలిసిందని చెప్పారు. ప్రధాని దగ్గరనుంచి కూడా అభినందనలు అందుతున్నాయని తెలిపారు. సీపీఐ కూడా తెలంగాణ ప్రభుత్వం అవినీతిలేకుండా సాగుతున్నదని ప్రశంసించిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిని, మంత్రులను వేలుపెట్టి చూపడానికి వీలులేకుండా పరిపాలన కొనసాగించగలుగుతున్నామని ఆయన చెప్పారు.