‘సంఘటిత శక్తికి ఎంతో బలం ఉంటుంది. గన్ ఫెన్సింగ్ కంటే సోషల్ ఫెన్సింగ్ శక్తిమంతం. మిలిటరీ కంటే పవర్ ఫుల్. సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటే విధంగా తయారుకావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాను దత్తత తీసుకున్న మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం రెండు గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరుపేదలైన 42 మందికి రూ.3.36కోట్లతో కొనుగోలు చేసిన 42 ట్రాక్టర్లను అందజేశారు. 20 మందిని డ్రిప్ ఇరిగేషన్ సంప్‌హౌజ్ ఆపరేటర్లుగా, మరో ఇద్దరిని ఎరువుల గోదాం ఇన్‌చార్జీలుగా నియమించారు. ట్రాక్టర్ల లబ్ధిదారులకు తాళాలు అప్పగించిన ముఖ్యమంత్రి.. ట్రాక్టర్ ఎక్కి స్టార్ట్ చేశారు. -గన్‌ఫెన్సింగ్ కంటే సోషల్ ఫెన్సింగ్ శక్తిమంతం -ఎర్రవల్లి, నర్సన్నపేట దత్తత గ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు -రెండు గ్రామాలు ఆదర్శంగా మారుతాయని వెల్లడి -శ్రావణమాసంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లలోకి -ప్రతి ఇంటికీ రెండు బర్రెలు, 10కోళ్లు -ఇంటింటికీ రిలయన్స్ ఫ్రీ ఇంటర్‌నెట్ -2800 ఎకరాల్లో ఈసారి సోయాబీన్, మక్కజొన్నసాగు -నేను చేయాలనుకున్న పనిలో ఇప్పటికీ ఓడిపోలే..అది నా జాతకంలోనే ఉంది -42 మంది నిరుపేదలకు ట్రాక్టర్ల పంపిణీ -20 మంది సంప్‌హౌజ్ ఆపరేటర్లు, ఇద్దరు గోదాం ఇన్‌చార్జీల నియామకం

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించిన ఆయన.. రెండు గ్రామాల ప్రజలు ఐకమత్యంతో, సంఘటిత శక్తిగా ఆదర్శంగా నిలువాలని కోరారు. వచ్చే శ్రావణమాసంలో ఎల్‌ఈడీ బల్బుల వెలుగుల ధగధగలు, పచ్చని తోరణాల మధ్య డబుల్ బెడ్‌రూం ఇండ్లలోకి పోతామని, 2800 ఎకరాల్లో డ్రిప్ ద్వారా సోయాబీన్, మొక్కజొన్న పంటలు సాగుచేసుకోబోతున్నామని అన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజల ఐక్యత, ఇతర అంశాలపై సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఎర్రవల్లి, నర్సన్నపేటలు ఇక స్వయంపాలిత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు ఇకమీదట స్వయంపాలిత గ్రామాలుగా మారిపోవాలి. ఈ రెండు గ్రామాలు స్వయంపాలిత, స్వయం సమృద్ధి, స్వయం శాసిత, స్వయం ఆధారిత గ్రామాలుగా మారాలి. మన ఊరిని మనమే బతికించుకుంటాం. ఏ ఒక్క కుటుంబం పనిలేకుండా ఉండకూడదు. గ్రామాల్లో ఏం పని జరుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలియాలి. అర్థం కాకపోతే గ్రామస్థులు అడిగి తెలుసుకోవాలి. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి మాదిరిగా మనం గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి. హైదరాబాద్‌వాళ్లు ఇక్కడ ఇండ్లు కట్టుకోవాలనుకోవాలి. వచ్చే శ్రావణమాసం తరువాత అది జరుగుతది. రెండు గ్రామాల్లో నిరుపేదలైన 60 మందికి ఉపాధి కల్పించాం. రూ.3.36 కోట్లతో కొనుగోలు చేసిన 42 ట్రాక్టర్లను అందించాం. గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ కోసం నిర్మిస్తున్న 14 సంప్‌హౌజ్‌ల వద్ద 20 మంది ఆపరేటర్లను నియమించుకున్నాం. గ్రామంలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఎరువుల గోదాముల వద్ద పనిచేయడానికి మరో ఇద్దరిని నియమించుకున్నాం. ఊరిలో ఎవ్వరూ ఉపవాసం ఉండొద్దు. పనిలేకుండా ఉండొద్దు. ఇకమీదట పంటలకు కావాల్సిన ఎరువులు ఇక్కడికే వస్తాయి, తక్కువ ధరకు అన్ని రకాల ఎరువులను గోదాముల్లో ఉంచుకుంటాం. ఉపాధి కోసం చెప్పుల దుకాణం, హెయిర్ కటింగ్ సెలూన్, బట్టల దుకాణం, హోటళ్లు పెట్టిస్తాం. ఇక మీదట అందరూ మన ఊరి దుకాణంలోనే చెప్పులు కొనాలి, ఇక్కడే కటింగ్‌లు చేయించుకోవాలి. ఇతర వస్తువులు కొనుక్కోవాలని ప్రమాణం చేసుకోవాలి. మన మార్కెట్ వద్ద కూరగాయలు అమ్ముకునే విధంగా చూసుకోవాలి. చిన్న పంచాయతీలు బంద్ పెట్టుకోవాలి. కోపాలను మనస్సుల్లో నుంచి తీసేసుకోవాలి.
ఇంటికి రెండు పాడి బర్రెలు, 10 కోళ్లు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటికి రెండు పాడి బర్రెలు, 10 కోళ్లు అందిస్తాం. బర్రెలను మీకు నచ్చినవి, సాదగలిగేవి మీరే ఎంపిక చేసుకోండి. రెండూర్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. బర్రెలను ఇండ్ల వద్ద కాకుండా బావుల దగ్గర కొట్టాలు (దొడ్లు) ఏర్పాటు చేసుకుని కట్టేసుకోవాలి. శ్రావణమాసంలో డబుల్ బెడ్‌రూం గృహప్రవేశాల రోజునే బర్రెలు, దేశవాళి కోళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం వీటిని కొని ఉచితంగా అందిస్తుంది. అగ్రికల్చర్ అలైడ్ ఇన్‌కమ్ అంటారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లు కూడా పాలు, కోడిగుడ్లు, కోళ్లు అమ్ముకుని సంపాదించుకునే మార్గం ఇది. ప్రతి మనిషి ఏదైనా పనిచేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాం. ఇతర గ్రామాల్లో ఇలా ఇవ్వడం కుదరదు. ఇతరచోట్ల సబ్సిడీ మీద ఇస్తారు. వచ్చే శ్రావణ మాసంలో ఆగస్టు 4 తరువాత యాగం చేసి, అమ్మవారికి దండం పెట్టకుని, పచ్చని తోరణాలు, ఎల్‌ఈడీ బల్బుల ధగధగ వెలుగుల మధ్య పండుగ వాతావరణంలో కొత్త ఇండ్లలోకి పోతాం. ఆరోజు అందరితో కలిసి నేను ఇక్కడ తింటాను. మిగతా ఊర్లలా కాకుండా రెండు గ్రామాల్లో 24 గంటలు నీళ్లు వస్తాయి. కొత్త పైపులైన్ పనులు మిగిలిపోవడం వల్ల ప్రస్తుతానికి (మిషన్‌భగీరథ) గోదావరి జలాలు ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు అందుతున్నాయి. త్వరలోనే ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు వస్తాయి.
2800 ఎకరాల్లో సోయాబీన్, మొక్కజొన్న సాగు రెండు గ్రామాల్లోని 2,800 ఎకరాల్లో ఈసారి సోయాబీన్, మొక్కజొన్న పంటలు సాగుచేసుకుంటున్నాం. డ్రిప్ ఇరిగేషన్ పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. గోదావరి నీళ్లు పాములపర్తి ప్రాజెక్టు ద్వారా రావడానికి ఏడాదిన్నర సమయం పడుతుంది. అప్పుడు గ్రామాల చెరువుల్లో 360 రోజులూ నీళ్లుంటాయి. ఆలోగా కూడ వాగు, చేబర్తి చెరువుల నుంచి రెండు గ్రామాల్లో నిర్మించుకుంటున్న నాలుగు కొత్త చెరువులను నింపుకోవాలి. అవికాకుండా రెండు గ్రామాల్లో 170 బోర్లలో నీళ్లున్నాయి. వాటినుంచి కూడా కుంటల్లోకి నీళ్లు నింపుకొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంత ఖర్చు అయినా విడుదల చేస్తాం. అయితే వ్యవసాయశాఖ, ఆగ్రానమిస్ట్‌లు చెప్పింది వినాలి.
ఏ పంటలు ఏ భూమిలో సాగుచేసుకోవాలి, ఏ మందులు వాడాలో వారు చెప్పే సూచనలు తప్పకుండా పాటించాలి. ఈసారి మాత్రం 800 ఎకరాల రేగడి భూమిలో సోయాబీన్ సాగుచేసుకుంటాం. సోయాబీన్ ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు పండుతుంది. క్వింటాలుకు 5,200 ధర వస్తుంది. 10 క్వింటాళ్లకు రూ. 52 వేలు వస్తాయి. మరో 2వేల ఎకరాల్లో ఈసారికి మామూలు రకం మొక్కజొన్న సాగుచేసుకుంటాం. మొక్కజొన్నలకు ఇప్పుడు మార్కెట్లో క్వింటాలుకు 1400 ధర ఉంది. సాగుకు అన్ని విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.
ఇంటింటికీ రిలయన్స్ ఇంట్నట్ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఇంటింటికి ఇంట్నట్ కనెక్షన్ అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘ఇటీవల నన్ను రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. మా రెండు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నాం. హైదరాబాద్ తరహాలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అన్ని సదుపాయాలు అక్కడ కల్పిస్తున్నామని వారితో చెప్పిన. నా సూచనల మేరకు ఇటీవలే సంస్థ ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి సర్వే చేసుకున్నారు. రెండు గ్రామాల్లో ఇంటింటికి ఇంట్నట్ కనెక్షన్లు ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. ఈ గ్రామాల్లోని ప్రజలు ఇంట్లో కాలుమీద కాలువేసుకుని అమెరికాలో ఉన్నవారితో మాట్లాడుకోవచ్చని కేసీఆర్ నవ్వుతూ అన్నారు. దీంతో గ్రామస్థులంతా చప్పట్ల వర్షం కురిపించారు. ‘రెండు గ్రామాలకు ప్రత్యేక నర్సరీ నుంచి మొక్కలు తెప్పిస్తున్నాం. ప్రతి ఇంట్లో కరివేపాకు, నిమ్మ, కొబ్బరి చెట్లు పెట్టుకోవాలి. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను జోన్లుగా విభజించి జోన్లవారీగా ప్రత్యేక రంగులు వేయాల’ని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
సింగపూర్‌లో జోన్లవారీగా రంగులు వేసిన కాలనీలు అద్భుతంగా ఉన్నాయని, ఈ రెండు గ్రామాలు సింగపూర్ మాదిరిగా మారాలని సూచించారు. ‘నా జాతకంలో ఒకటుంది. నేను ఏ పని చేయాలనుకున్నా ఇప్పటివరకు ఓడిపోలే. ఏది జరగాలనుకున్ననో అవి జరిగాయి. నా జాతకం ప్రకారం ఎర్రవల్లి, నర్సన్నపేటలు అద్భుతంగా తయారవుతాయి. ఆ సక్సెస్‌ను మనం చూస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్షికమంలో జేసీ వెంకట్రాం రెడ్డి, గడా ఓఎస్డీ హన్మంతరావు, ఆగ్రానమిస్ట్ ప్రవీణ్‌రావు, గ్రామ వీడీసీ చైర్మన్ కృష్ణాడ్డి, ఎంబరి రాంచంద్రం, సర్పంచ్‌లు భాగ్యబాల్‌రాజు, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోషల్ ఫెన్సింగ్.. మిలిటరీ కంటే పవర్‌ఫుల్ నాలాంటి వాళ్లు వచ్చినప్పుడు పోలీసులు వస్తారు. రక్షణ కోసం ప్రత్యేకంగా గన్‌ఫెన్సింగ్ పెడతరు. గన్‌ఫెన్సింగ్ కంటే బలమైనది సోషల్ ఫెన్సింగ్. ఒకరికొకరు ఆసరా ఉండే ఈ ఫెన్సింగ్ మిలిటరీ కంటే పవర్ ఫుల్. ఎంతో ధైర్యాన్ని, బలాన్ని, మాకు ఏం కాదనే భరోసాను ఇస్తుంది. ఎర్రవల్లిలో మేము 100 శాతం క్షేమంగా ఉంటామనే నమ్మకం మీలో ఉండాలి. ఆ విజయం సాధించేవరకు ముందుకుసాగాలి. ఎక్కడా లేని విధంగా రెండు గ్రామాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఏ ఒక్కరూ కూడా ఉపవాసం ఉండకుండా, పనిలేకుండా ఉండకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పటికే ఎర్రవల్లిని చూసిపోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోతున్నారు. మున్ముందు బస్సులు, కార్లు కట్టుకుని ఇక్కడికి వచ్చి అభివృద్ధి, ఐక్యతను మీ నుంచి తెలుసుకోవాలి. ప్రజల సంఘటిత శక్తిలో చాలా పవర్ ఉన్నది. ప్రజలు ఐక్యతతో ఉంటే ఆ శక్తి కొండలను కూడా బద్దలు కొడుతుంది.
ఐతే ప్రజల్లో ఉన్న ఆ శక్తిని వివరించి చెప్పేవాళ్లు లేకపోవడం దురదృష్టకరం. ఎర్రవల్లి, నర్నన్నపేట ప్రజల సంఘటిత శక్తి ఏమిటో దేశానికి చాటిచెప్పాలి. మీరే మార్గదర్శకులు కాబోతున్నారు. ఐక్యతతో ఏం సాధించారో దేశానికే ఓ సందేశం కాబోతున్నారు. ఆ అవకాశం మీకు వచ్చింది. ఈ సమయంలో గ్రామస్థులంతా ఓపిక, చిరునవ్వు, ప్రేమభావంతో ఉండాలి. ఈ రెండు గ్రామాలకు చెందిన ఒక్కొక్కరూ ఇతర ప్రాంతాలకు వెళ్ళి అభివృద్ధి, ఐక్యత గురించి చెప్పేంత స్థితికి రావాలి. ఊరంతా బతికేవిధంగా అందరూ కలిసి ఉపాయం చేయాలి. ఇప్పటికే కంటి పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాం. అవసరమైనప్పుడు గ్రామాల్లో శ్రమదానం చేస్తున్నం. ఒక్కటొక్కటిగా అన్ని పనులు అవుతున్నాయి. ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. నేను ఇక్కడే ఉంటా. ఈ ఊరోడినే కాబట్టి ఎవ్వరికి ఏ లోటురాకుండా సపోర్ట్‌గా ఉంటా. కేసీఆర్‌కు రుణపడి ఉంటాం భూమిలేక బతుకుదెరువుకోసం పట్నం పోయి తిరిగి వచ్చి ఊరిలోనే బతుకుతున్నాం. దేవుని రూపంలో మా ఊరికి వచ్చిన సీఎం కేసీఆర్ సారు వలన మా ఊరు బాగుపడుతున్నది. భూమిలేని నాకు బతుకుదెరువు కోసం ఉచితంగా ట్రాక్టర్‌ను ఇచ్చి ఉపాధి చూపిచ్చిండ్రు. భూమి ఉన్నవారితో సమానంగా బతుకడానికి దారి చూపించిండ్రు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేనిది. – ఊషిగారి పోచయ్య, ఎర్రవల్లి