-పదవులు వచ్చినా ప్రజల వెంటే ఉంటాం -ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్
ప్రజా సమస్యలను పరిష్కరించడంపైనే తమకు ప్రేమ ఉంటుందే తప్ప పదవులపై కాదని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్‌లో చేపడుతున్న మంచినీటి పైపులైన్ల పనులు, గంగపుత్రుల సంఘం నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో ప్రజల సమస్యలు ఏమిటో తమకు తెలిశాయన్నారు. అవే సమస్యలపై మళ్లీ తమను అడిగే అవకాశం ఇవ్వకుండా వాటి పరిష్కారం కోసం పని చేస్తామని తెలిపారు. పదవులు వచ్చినంత మాత్రన తాము ఎక్కడికీ పోమని, తామంతా ప్రజల వెంటే ఉంటామన్నారు.
కుల సంఘాల సమస్యల పరిష్కారానికి నాయకులు పైరవీలు చేసే అవసరం రాదన్నారు. ఉజ్వల పార్కు ప్రాంతంలో వివిధ కుల సంఘాల భవనాలకు గతంలోని ప్రభుత్వాలు స్థలాలు కేటాయించాయని గుర్తు చేశారు. వీటిని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు వారం రోజుల్లో తానే అన్ని కుల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని సంఘాల భవనాలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారు. తమకు ఏ విషయంలోనూ వివక్ష లేదని స్పష్టంచేశారు. కుల వృత్తుల్లో ప్రమాదవశాత్తు మరణించే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు గీత, మత్స్య కార్మికులకు నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచామని గుర్తుచేశారు. అన్ని కుల వృత్తులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేశ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కార్పొరేటర్లు వై సునీల్‌రావు, జయశ్రీ, రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.