
-యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు -సమస్యల పరిష్కారానికే కీ మేకర్స్ -మన దేశంలో యువతే ఎక్కువ… అదే మనకు కలిసొచ్చే అంశం -సృజనాత్మకతను వెలికితీసేందుకే టీ హబ్ -కీ మేకర్స్ యూత్ సమ్మిట్ -2019ను ప్రారంభించిన కేటీఆర్
సామాన్యులకు ఉపయోగపడని టెక్నాలజీ ఏదైనా వృథా అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడమే కీ మేకర్స్ లక్ష్యమని, యువతను ఒక వేదికపైకి చేర్చి సమస్యలకు పరిష్కారమార్గాలు చూపేవిధంగా వారిలో నైపుణ్యం పెంచాలన్నారు. ఆదివారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన కీ మేకర్స్ యూత్ సమ్మిట్2019ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్నది మనదేశంలోనేనని, యువశక్తిని ఉపయోగించుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. యువతరం సరైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో యువతరం సరైన ఆలోచనావిధానంతో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. 1950 వ దశకంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని.. అప్పుడు వృద్ధిరేటు చాలా తక్కువగా ఉండేదని తెలిపారు.
ఆనాటి సమస్యలేవీ ఇప్పుడు పీడించడంలేదని అన్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద వ్యాధులతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగేదని, ఇప్పుడు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. భారతదేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా టెక్నాలజీలో, ఉపాధిలో, ఎకానమీలో లభిస్తున్న అవకాశాలు మన కండ్లతో చూస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా గణాంకాల ప్రకారం ప్రకారం 6.5 శాతంతో దేశం అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. భారతదేశం ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమని కేటీఆర్ పేర్కొన్నారు. మనదేశంలో పర్‌క్యాపిటా ఇన్‌కమ్ కూడా 5.5 వృద్ధి రేటుతో ప్రతి ఏడాది పెరుగుతున్నదని తెలిపారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే అధిక జనాభా కలిగిఉండడమే భారతదేశ విశేషమని పేర్కొన్నారు.
భయమంటే ఏమిటో తెలియదు భారత యువకులు చాలా ధైర్యశాలులు. మన యువత భయం లేకుండా ముందుకు సాగుతున్నది. మీరు ఉద్యోగాలు కల్పించాలనుకోవచ్చు. ఉద్యోగం సంపాదించుకోవాలనుకోవచ్చు. అయితే భయపడేతత్వం ఉండకూడదు. ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వకపోతే అతనికే నష్టం అనే భావనతో వెళ్తే మనకు ప్రయోజనం కలుగుతుంది. అలాంటి ఆలోచనతో, ధైర్యంగా ముందుకు వెళితే ఇంటర్వ్యూలను ఫేస్ చేయడం కష్టంకాదు. నేను నా కొడుకు వయసున్నప్పుడు ఏదైనా విషయంపై ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెప్పేవాణ్ణి. నా కొడుకు నాతో మాట్లాడాలనుకున్నప్పుడు, నాకు నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా చెప్తున్నాడు. అలాంటి యూత్ మన దేశంలో ఉన్నది అని కేటీఆర్ యువతీయువకులకు వివరించారు.

సమస్యలు పరిష్కరించాలి ప్రస్తుత యువతలో అక్షరాస్యత చాలా ఎక్కువ. మన ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతున్నది. అలాగే చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. సీఎం కేసీఆర్.. నేను మంత్రిగా ఉన్నప్పుడు కొత్త కొత్త పరిష్కారాలతో ముందుకు వెళ్లేవాళ్లం. టీ-హబ్ గురించి మాట్లాడినా.. ఆయన మమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడిగేవారు. దీనివల్ల సమాజానికి లాభం జరుగుతుందా? సొసైటీ సమస్యలను పరిష్కరిస్తుందా. రోజు వారీ జీవితంలో ప్రజలకు ఎలా సహాయం చేస్తుందని అడిగేవాడు. ఎలా ప్రజలకు సహాయ పడుతుందో ఆలోచించేవాళ్లం. చిన్న చిన్న సృజనాత్మక ఆలోచనలే విజయవంతమవుతాయి. ట్రాఫిక్ చెకింగ్ కోసం రూపొందించిన ఆర్టీఎం వాలెట్‌కు 28 లక్షల కంటే ఎక్కువ డౌన్‌లోడ్స్ వచ్చాయి. ఈవిధంగా కామన్‌మ్యాన్ సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచనలుండాలి. ఇప్పటి జనరేషన్ ఉద్యోగం వస్తే చాలని అనుకోవడం లేదు. మా జనరేషన్‌లో 30 ఏండ్లు ఉద్యోగంలో ఉన్నానని గర్వంగా చెప్తారు. ఇప్పటి వాళ్లు అది విని ఎలా? అని ఆశ్యర్య పోతారు. ప్రస్తుతం యువత 30 ఏండ్లు ఒకే ఉద్యోగం చేయాలని అనుకోవడంలేదు. వినూత్నమైన ఆలోచనలతో తామే పదిమందికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచిస్తున్నది. అలా ఆలోచించే యువతే కావాలి అని కేటీఆర్ అన్నారు.
మన సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించింది ప్రపంచమంతా భారతీయుల సామర్థ్యాన్ని గుర్తించింది. మన దేశానికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల్ల లాగా చాలామంది మంచి స్థానాల్లో ఉన్నారు. సవాళ్లను గుర్తించి, వాటిని అంగీకరిస్తేనే పరిష్కరించే ఆలోచన వస్తుంది. సమాజంలోని ప్రతి అవసరాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ఇంగ్లిష్ భాష అవసరమే.. కానీ మన సంప్రదాయాలను మరిచిపోవద్దు. ప్రపంచంతో సంబంధాలు ఏర్పచుకోవడంతోపాటు యువత ఆలోచనలను చర్చించేందుకే తెలంగాణలో టీ హబ్‌ను స్థాపించాం. చాలా యూనివర్సిటీల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ కమర్షలైజ్డ్ కెపాసిటీ లేదు. ఆలోచనలకు కొదువలేకపోయినా ఆర్థికపరమైన సమస్యలు వస్తున్నాయి. ప్రైవేట్ సంస్థల సహకారంతో పరిశోధనలు చేయాలి. సృజనాత్మక ఆలోచనలు వెలికితీసి, సమాజానికి ఉపయోగపడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారి కోసమే టాస్క్ ఏర్పాటుచేశాం. ఇదొక ఫినిషింగ్ స్కూల్‌లాగా ఉంటుంది.

నిజామాబాద్‌కు చెందిన ఫణీంద్ర సామా.. ఫౌండర్ ఆఫ్ రెడ్‌బస్. నిజామాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లి విప్రోలో పనిచేసేవాడు. బెంగళూరు నుంచి బస్ దొరకకపోతే అన్న ఆలోచన రావడంతో.. రెడ్‌బస్ యాప్ రూపొందించారు. రోజూవారీ సమస్యలకు పరిష్కారమార్గాలు చూపిన చాలామంది పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులు అయ్యారు. తెలంగాణలో యువ మహిళలకు అవకాశాలను కల్పించేందుకు వీ హబ్ ఏర్పాటు చేశాం. తెలంగాణ ఏర్పాటు చేసిన టీ వర్క్స్ ఇన్నోవేటర్ ఐడియా కార్యరూపం దాల్చడానికి ఉపయోగపడుతుం ది. యువత ముందుకు నడవాల్సిన సమయం వచ్చింది. సమాజంలోని ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చుకోవాలి. మనం చేసే ప్రతి పని విజయవంతం కాదు. విజయాన్నే కాదు, ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. కృతనిశ్చయంతో ముందుకు వెళితే మనల్ని ఎవరూ ఆపలేరని యువతకు సూచించారు.
ఆలోచనలు ఆచరణలోకి రావాలి నేనే స్కూల్‌కు వెళ్లే రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చా లా పెద్ద పబ్లిసిటీ క్యాంపెయిన్ చేసేది. ఇప్పు డు జనాభా అనేది మనకు సమస్య కాదు. జనాభా పెరుగుదలలో నిలకడ వచ్చింది. 1.2 రేటుతో పెరుగుతున్నది. ఈ రేటు రెండు దశాబ్దాల కిందటితో పోలిస్తే చాలా తక్కువ. ఇండియాలో యువ జనాభాయే చాలా ఎక్కువ. దీనిని డీ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. మన దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది 27 ఏండ్ల వయస్సు కంటే తక్కువగానే ఉన్నారు. 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏండ్ల వయసు కంటే తక్కువ ఉన్నారు. యువత ఎక్కువగా ఉన్న దేశం ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుంటుంది. పారిశ్రామిక స్ఫూర్తితో యువత ముందుకు నడువవచ్చు. ఇలాంటి ఆలోచనలు ఆచరణలో దేశాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్తాయి. పాపులేషన్ డివిడెండ్ అంటే యూత్ అంతా ఒకచోట చేరి వారి మేధస్సును ఉపయోగించి.. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను అందించి ప్రజలకు మేలు చేయగలగాలి అని కేటీఆర్ అన్నారు.