Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సమాఖ్య స్ఫూర్తిని తెగనరికి..

-దొడ్డిదోవన మార్చడం కాదు.. దమ్ముంటే పార్లమెంటులో చట్టం తెండి
-క్యాడర్‌ రూల్స్‌ మార్పుపై కేసీఆర్‌ ఆగ్రహం.. ప్రధాని మోదీకి లేఖ
-దీంతో కేంద్రం గుప్పిట్లోకి ఏఐఎస్‌లు
-ఇది రాష్ట్రాల విధుల్లో తలదూర్చడమే
-ఇక రాష్ట్రాల పాత్ర నామమాత్రం!
-క్యాడర్‌ నిబంధనలను మార్చొద్దు
-ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలి
-కేంద్రానికి సీఎం కేసీఆర్‌ డిమాండ్‌

అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్‌) అధికారుల క్యాడర్‌ రూల్స్‌ మార్చే ప్రతిపాదనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో సంబంధం లేకుండా నేరుగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై తీసుకొనేలా ‘అఖిల భారత సర్వీసుల (క్యాడర్‌) నిబంధనలు-1954’ సవరించడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభు త్వాల విధుల్లోకి కేంద్రం నేరుగా తలదూర్చడమేనని, ఏఐఎస్‌ అధికారులను తన గుప్పిట్లోకి తెచ్చుకొనే ఎత్తుగడ అని మండిపడ్డారు. ఏఐఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ను సవరిస్తూ కేంద్రం చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదించిన సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రపు వ్యవస్థలుగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ అధికారులను రాష్ర్టాల్లో సామరస్యతతో, చక్కని సమతుల్యతతో వినియోగించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు సరిపోతాయని స్పష్టం చేశారు. ఒకవేళ మార్చాలనుకొంటే ఇలా దొడ్డిదారిన కాకుండా దమ్ముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరణలు చేయాలని సవాల్‌ విసిరారు.

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖ పూర్తి పాఠం..

నరేంద్ర మోదీ గారికి..
అఖిల భారత సర్వీసుల (క్యాడర్‌) నిబంధనలు-1954కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను.

కేంద్రం ప్రతిపాదించిన సవరణలు ఏ కోణంలో చూసినా భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సవరణలు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ల ఉద్యోగ స్వరూపాన్ని, వారి పనితీరును దెబ్బతీసేలా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభు త్వం ఈ సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్‌) అధికారులు రాష్ర్టాల్లో నిర్వర్తించే క్లిష్టమైన, కీలకమైన విధులను దృష్టిలో ఉంచుకొని.. ప్రస్తుత నిబంధనలు వారిని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు పంపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని తప్పనిసరి చేశాయి. కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలు ఈ అధికారానికి తూట్లు పొడిచేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, సంబంధిత అధికారుల అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం నేరుగా డిప్యుటేషన్‌పై తీసుకొనేలా ఉన్నాయి. ఇది రాజ్యాంగ స్వరూపానికి, సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. ఈ సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా.. నామమాత్రపు వ్యవస్థలుగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.

రాష్ట్రాల్లో పనిచేస్తున్న అధికారులను పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం నియంత్రించేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల విధుల్లో కేంద్రం తలదూర్చడమే. రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో అధికారులను జవాబుదారీగా చేయాల్సింది పోయి.. ఈ సవరణలు వారిని నిరుత్సాహానికి గురిచేసేలా, అధికారులను లక్ష్యంగా చేసుకొని వేధించేలా ఉన్నాయి. అంతిమంగా ఈ సవరణలు ఏఐఎస్‌ అధికారుల ముందు రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సహాయులుగా నిలబెడుతాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 312 నిబంధనల ప్రకారమే ‘ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ యాక్ట్‌ -1951’ను పార్టమెంటు రూపొందించిందని, దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం వివిధ నిబంధనలను రూపొందించిందని నేను అంగీకరిస్తున్నాను. అయితే రాష్ర్టాల ఆకాంక్షలను కాలరాసేలా, దేశ సమాఖ్య విధానాలను తుంగలో తొక్కుతూ ‘ఐఏఎస్‌/ఐపీఎస్‌/ఐఎఫ్‌ఎస్‌ క్యాడర్‌ రూల్స్‌- 1954’ ను సవరించి కేంద్రానికి అధికారాలను కట్టబెట్టాలని ప్రయత్నించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ ప్రతిపాదనలు క్యాడర్‌ రూల్స్‌ మార్చడమే కాదు.. కేంద్ర-రాష్ర్టాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని సవరించడంతో సమానం. కేంద్ర ప్రభుత్వం ఇలా దొడ్డిదారిన నిబంధనలను సవరించే బదులు.. దమ్ముంటే నేరుగా పార్లమెంటు ప్రక్రియ ద్వారా మార్చాలి.

ఇలాంటి వివాదాలు వస్తాయనే ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో.. ‘రాష్ర్టాల ఆకాంక్షలకు విఘాతం కలుగకుండా ఏదైనా రాజ్యాంగ సవరణ చేయాలంటే.. కేంద్రం కచ్చితంగా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఆర్టికల్‌ 368 (2)లో స్పష్టంగా పొందుపరిచారు. కాబట్టి ఏఐఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ను కేంద్రం ఏకపక్షంగా మా ర్చాలనుకోవడం రాజ్యాంగస్ఫూర్తిని అవమానించడమే. ఇది తీవ్రంగా గర్హించాల్సిన విషయం.

తాజా ప్రతిపాదనలు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏఐఎస్‌ అధికారుల పరస్పర సర్దుబాటు ప్రక్రియకు గొడ్డలిపెట్టుగా మారుతాయి. ఇది అంతిమంగా కేంద్ర-రాష్ర్టాల సంబంధాలపై ప్రభావం చూపుతుంది.

ఏఐఎస్‌ అధికారులను రాష్ట్రాల్లో సామరస్యతతో, చక్కని సమతుల్యతతో వినియోగించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు సరిపోతాయి. కాబట్టి రాజ్యాంగ సమాఖ్య రాజనీతి ని, పాలనాపరమైన పారదర్శకతను కొనసాగించేందుకు కేంద్రం ప్రతిపాదించిన క్యాడర్‌ రూల్స్‌ సవరణలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాను. 

-కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.