సలాం తెలంగాణ.. తెలంగాణ ప్రజా విజయానికి కేటీఆర్ అభివాదం పదేండ్లు కూడా దాటని పసిబిడ్డ తెలంగాణ.. ఈ రోజు దేశానికే దారిచూపే దీపస్తంభంగా మారిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
-సలాం తెలంగాణ.. తెలంగాణ ప్రజా విజయానికి కేటీఆర్ అభివాదం
-పాలనలో టీచింగ్ పాయింట్.. తెలంగాణ టాకింగ్ పాయింట్
-నాటి ఉద్యమ నాయకుడే నేటి ఉత్తమ పాలకుడు
-దేశం చూపు తెలంగాణ వైపు.. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు
-నాడు కరువు తెలంగాణ.. నేడు దేశం కడుపునింపే అన్నపూర్ణ
-రైతు బంధు నచ్చని నేత లేడు.. మెచ్చని ఆర్థికవేత్త లేడు
-నేడు మన కల్లం నిండా గింజలు.. పళ్లెం నిండా మెతుకులు
-ఆకలి కేకలులేని దేశం కోసం తెలంగాణ గుమ్మిగా మారింది
-బీసీలంటే.. బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ
-‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపడమంటే తమ ఆకాంక్షల సాధన కోసం -ఉద్యమ కాలం నుంచి నేటి దాకా కేసీఆర్ వెంట నడుస్తూ అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడమే.’
-మంత్రి కేటీఆర్

ఇది ఒక యువ గళం చెప్పిన కొత్త భాష్యం. ఉద్యమ తెలంగాణ.. ఉజ్వల తెలంగాణగా మారిన ప్రస్థానాన్ని మూడు భాషలలో ముచ్చటగా చెప్పిన ఒక విద్యాధికుడి స్వరమది.
ఒక సమాజం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునర్‌వైభవాన్ని ఎలా సాధించిందో గణంకాలతో వివరించిన సాధికారిక సన్నివేశమది. గతాన్ని స్మరిస్తూ.. వర్తమానాన్ని వివరిస్తూ.. భవితను బోధిస్తూ.. చేసిన విశ్లేషణ.
తెలంగాణతో పోలుస్తూ.. కేంద్ర వైఖరిని చీలుస్తూ.. ‘ప్రజల నుంచి వెలువడిన ప్రగతి కాంతి పుంజం. దేశానికి తెలంగాణ దీపస్థంభం’. ఇది ప్రతి ఒక్కరి మనసు మాట.
ధాటి మాట.. భాషా పటిమ.. ఆధారాల సమర్పణ.. వివేకపూరిత విమర్శ.. ఆరోపణల విధ్వంసం.. అనుమానాల నివృత్తి… అల్టిమేట్‌గా అది అన్‌స్టాపబుల్ ప్రసంగం.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు శనివారం మంత్రి కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఎనిమిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రోగ్రెస్ రిపోర్ట్.
చాక్లెట్ నుంచి రాకెట్ దాకా, ఎల్‌ఈడీ లైట్ల నుంచి శాటిలైట్ దాకా, టైల్స్ నుంచి టెక్స్‌టైల్ దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్‌బస్ దాకా, యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణ.
ఔను.. మాది కుటుంబ పాలనే… కచ్చితంగా కుటుంబ పాలనే నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు ఈ కుటుంబానికి పెద్ద.. ముఖ్యమంత్రి కేసీఆర్
గుజరాత్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు కోసం లక్ష కోట్లు ఖర్చుపెట్టవచ్చట.. కానీ 45 లక్షల మంది తెలంగాణ రైతులకు సాగునీరిచ్చే కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టడం తప్పా!
మోదీ ప్రభుత్వానిది హమ్..దో.. హమారే దో విధానం.. మోదీ తన దోస్తులకు రద్దు చేసిన రుణాలు 12 లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా రైతులందరికీ 9 ఏండ్లపాటు ఉచితంగా కరెంటు ఇవ్వవచ్చు.
తెలంగాణలో కరెంటు కష్టం లేదు.
తాగునీటి తండ్లాట అసలు లేదు.
పేకాట క్లబ్బు, గుడుంబా గబ్బు లేదు.
ఇంటి అనుమతులకు ఇబ్బంది లేదు.
ఉగ్రవాదుల ఊసు లేనే లేదు.
బాంబు పేలుళ్ల భయం లేదు.
మత ఘర్షణల ముచ్చటే లేదు.
కర్ఫ్యూల కలకలం లేదు.
గంగాజమున తెహజీబ్‌కు ఢోకా లేదు.
పరిశ్రమలకు పవర్ హాలిడే లేదు.
పెట్టుబడిదారులకు బెడద లేదు.
కష్టపడేటోళ్లకు ఉపాధికి కొదవ లేదు
సర్కారులో పైరవీకార్లకు అడ్రస్ లేదు
పథకాల కోసం చక్కర్లు కొట్టే పన్లేదు
బస్తీకి సుస్తీ అయితదనే ఆందోళన లేదు
మంచం పట్టిన మన్యం అనే వార్త లేదు
చదువులపై తల్లిదండ్రులకు బెంగ లేదు
అభివృద్ధి పనులకు ఆటంకం లేదు
సంక్షేమంలో మనకు తిరుగు లేదు
తెలంగాణ మాడల్‌కు సాటి లేదు
ప్రభుత్వ సంకల్పాన్ని, పాలనా సంసరణలను సమర్థంగా అమలుచేసి, సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధిని ప్రతి పల్లెకు చేర్చిన లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, రైతన్నకు.. శాంతి భద్రతలు కాపాడుతున్న హోంగార్డు నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు, వైద్య సిబ్బందికి .. పాఠాలు చెబుతున్న గురువులకు.. ప్రాణాలకు తెగించి భూమి పొరల్లో నుంచి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులకు.. ఎన్నారైలకు.. పారిశుద్ధ్యాన్ని అందిస్తున్న సఫాయీ సోదరులందరికీ సలాం.. సలాం.. సలాం..
– మంత్రి కేటీఆర్
పదేండ్లు కూడా దాటని పసిబిడ్డ తెలంగాణ.. ఈ రోజు దేశానికే దారిచూపే దీపస్తంభంగా మారిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. నాటి తెలంగాణ ఉద్యమం ‘ఉద్యమ శాస్త్రానికి’ టీచింగ్ పాయింట్ అయితే, నేటి సముజ్వల తెలంగాణ ఉత్తమ పాలనలో దేశానికే టీచింగ్ పాయింట్.. టాకింగ్ పాయింట్ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రభుత్వం తరఫున శనివారం ఆయన సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర రెండో ప్రభుత్వంలో ఆఖరి బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపడమంటే తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకోవడమేనని చెప్పారు. అభివృద్ధి-సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి-పట్టణాభివృద్ధి ఒకేసారి సాధ్యమవుతాయనడానికి తెలంగాణ
అరుదైన ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. ఐటీ, వ్యవసాయ రంగాలు ఒకేసారి అభివృద్ధి చెందిన అరుదైన ఘనత తెలంగాణకు దక్కిందని తెలిపారు. ఓవైపు పారిశ్రామికాభివృద్ధి, మరోవైపు పర్యావరణ పరిరక్షణ తెలంగాణలోనే సాధ్యమయ్యాయని చెప్పారు. ‘ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ వెంట నడిచినట్టే.. ఎనిమిదన్నరేండ్ల ప్రగతి ప్రస్థానంలో అదే స్పూర్తితో ఆయన అడుగులో అడుగు వేస్తూ వస్తున్నది. అందుకే దేశంలోనే ఉత్తమ పాలకుడిగా సీఎం కేసీఆర్‌ను అనేక సంస్థలు కీర్తిస్తున్నాయి. మొత్తంగా పదేండ్లు కూడా దాటని పసిబిడ్డ తెలంగాణ.. ఈ రోజు దేశానికే దారిచూపే దీపస్తంభంగా మారింది’ అని పేర్కొన్నారు.
నాడు కరువు.. నేడు ధాన్యం గుమ్మి
తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయరంగంలో అద్భుత విజయాలు సాధించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాడు నాబార్డ్ నివేదిక ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల్లో 26వ స్థానంలో ఉన్న తెలంగాణ, ఇప్పుడు పంజాబ్, హర్యానా తర్వాత మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. బియ్యం ఉత్పత్తిలో పదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎదిగామని చెప్పారు. ఎఫ్‌సీఐకి అత్యధికంగా ధాన్యం సమకూరుస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ‘ఒకప్పుడు కరువు కాటకాలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ, ఇప్పుడు దేశానికి ధాన్యం గుమ్మిగా మారింది. కల్లం నిండా గింజలు.. పల్లెం నిండా మెతుకులు కనిపిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం తెలంగాణ వ్యవసాయ రంగంలోకి 2019 అక్టోబర్-2021 సెప్టెంబర్ మధ్య 49.44 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు.
ఎనిమిదిన్నరేండ్లలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం సుమారు 6.70 కోట్ల టన్నులు. దీని విలువ రూ.1.20 లక్షల కోట్లు. కేంద్ర వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం తెలంగాణ వ్యవసాయ రంగంలోకి 2019 అక్టోబర్-2021 సెప్టెంబర్ మధ్య 49.44 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
– మంత్రి కేటీఆర్
బీసీల గోడు పట్టించుకోని కేంద్రం
బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్వయంగా బీసీ అయిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీసీలను పట్టించుకోవటంలేదని ఆరోపించారు. రూ.45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో కనీసం ఐదు శాతం బీసీలకు కేటాయించాలని, మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని మోదీని కోరినప్పటికీ, బీసీలకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు బ్యాక్ బోన్‌గా ఉన్నదని చెప్పారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎన్నికల సందర్భంగా ప్రజలకు పంచిపెట్టిన హామీల పత్రాన్ని కేటీఆర్ సభలో చదివి వినిపించారు. ఇందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.
మాది 4 కోట్లమంది కుటుంబం
రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తున్నదన్న ఆరోపణలపై కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే. మాది తెలంగాణలోని నాలుగు కోట్ల మందితో కూడిన వసుదైక కుటుంబం. ఈ కుటుంబానికి పెద్ద సీఎం కేసీఆర్. ప్రతి కుటుంబంలోని అవ్వా తాతలకు పెన్షన్లు ఇచ్చి పెద్ద కొడుకులా నిలిచింది, నాలుగు కోట్ల మందిని తోబుట్టువులుగా చూసుకుంటున్నది, కంటి వెలుగుతో వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది, గురుకులాలను తెరిచి లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నది, ఒంటరి మహిళలకు పెద్దన్నలా అండగా నిలుస్తున్నది, బస్తీలో పుట్టినా బంజారాహిల్స్‌లో పుట్టిన బిడ్డతో సమానంగా సకల సౌకర్యాలను అందిస్తూ కేసీఆర్ కిట్ ఇస్తున్న మేనమామ కేసీఆర్ కాదా?’ అని ప్రశ్నించారు.
దోస్తులకిచ్చింది రైతులకిస్తే దేశమంతా ఉచిత విద్యుత్తు
గత ఎనిమిదేండ్లలో ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేశారని, ఆ డబ్బుతో దేశంలోని రైతులందరికీ 9 ఏండ్లపాటు ఉచిత విద్యుత్తు ఇవ్వవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే మోటర్లకు మీటర్లు పెట్టాలె అంటున్నారు. దేశంలోని రైతులందరికీ ఉచితంగా కరెంటు ఇస్తే సంవత్సరానికి ఖర్చయ్యేది రూ.1.45 లక్షల కోట్లు. కేంద్రం పెద్దల కార్పొరేట్ దోస్తులకు తొమ్మిదేండ్లలో ఇచ్చిన నిధులతో రైతులకు తొమ్మిదేండ్లు ఉచితంగా కరెంటు ఇచ్చే అవకాశముండేది’ అన్నారు.
అద్భుతంగా ‘మేడ్ ఇన్ తెలంగాణ’
సభ్యుల సూచనల ప్రకారం కంటివెలుగు కార్యక్రమంలో క్యాటరాక్ట్ సర్జరీలు కూడా చేయిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కంటి వెలుగులో ఇస్తున్నవి తెలంగాణలో తయారైన మేడ్ ఇన్ సుల్తాన్‌పూర్ కండ్లద్దాలని చెప్పారు. మీ మేక్ ఇన్ ఇండియా ఎక్కడికి పోయిందో తెలియదు కానీ.. మేక్ ఇన్ తెలంగాణ మాత్రం బాగా పనిచేస్తున్నదని తెలిపారు. మన ఊరు, మన బడి వంటి కార్యక్రమాల్లో విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నట్టు తెలిపారు. ఇంతపెద్ద కార్యక్రమం బీజేపీ పాలిత రాష్ట్రంలో మరెక్కడైనా ఉన్నదా? అని ప్రశ్నించారు.
ఎనిమిన్నరేండ్ల పాలన క్లుప్తంగా
బీఆర్‌ఎస్ ఎనిమిదన్నరేండ్ల పాలనను కేటీఆర్ వివరిస్తూ.. ‘ఈ రోజు తెలంగాణలో కరెంటు కష్టం లేదు, తాగునీటి తండ్లాట లేదు, పేకాట క్లబ్బు లేదు, గుడుంబా గబ్బు లేదు, ఉగ్రవాదుల ఊసు లేదు, బాంబు పేలుళ్ల భయం లేదు, మత ఘర్షణల ముచ్చటే లేదు, కర్ఫ్యూల కలకలం అసలే లేదు,పరిశ్రమలకు పవర్ హాలిడే లేదు, పెట్టుబడిదారులకు పైరవీకారుల బెడద లేదు, కష్టపడేటోళ్లకు ఉపాధికి కొదవ లేదు, ప్రభుత్వంలో పైరవీకారులకు అడ్రస్ లేదు, పథకాల కోసం ఆఫీస్‌ల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర లేదు, సుస్తీ చేస్తే ఏమైతుందో అనే ఆందోళన బస్తీల్లో లేదు, మంచం పట్టిన మన్యం అనే వార్తలు లేవు, అభివృద్ధి పనులకు ఆటంకం లేదు, సంక్షేమానికి తిరుగు లేదు, తెలంగాణ మాడల్‌కు ఈ దేశంలో సాటి మరొకటి లేదు, అందుకే దేశం చూపు తెలంగాణ వైపు, దేశ ప్రజల చూపు సీఎం కేసీఆర్ వైపు ఉన్నది’ అని పేర్కొన్నారు.
రైతుబంధు ఎకరాలవారీగా
5 ఎకరాల లోపు – 91.33%
5-10 ఎకరాలు – 7.28%
పది ఎకరాలపైన – 1.39%
సామాజిక వర్గాలవారీగా
బీసీ రైతులు – 48 %
ఎస్సీ రైతులు – 9%
ఎస్టీ రైతులు – 13%
రైతుబంధులో 70 శాతం బడుగులకే
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు వేసిన ఒకే ఒక నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.10 విడతల్లో రూ.65,558 కోట్లు జమ చేశామని, ఏటా ఇస్తున్న రూ.15,500 కోట్లలో 70 శాతం బడుగు బలహీన వర్గాల రైతుల ఖాతాల్లోనే పడుతున్నాయని వెల్లడించారు.
94,500 కుటుంబాలకు రైతుబీమా
రాష్ట్రంలో కులమతాల పట్టింపు లేకుండా రైతులందరికీ రైతుబీమా అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతుబీమా ప్రీమియం కింద ప్రభుత్వం ఏటా రూ.1,450 కోట్లు కడుతున్నదని చెప్పారు. ఇప్పటిదాకా 94,500 కుటుంబాలకు రూ.4,725 కోట్ల బీమా సాయం అందించామని వివరించారు.
దేశాన్ని జాగృతం చేస్తాం
తాము రైతుల బాగు కోసం ఇంత కష్టపడుతుంటే కేంద్రంలోని అధికార పార్టీ మాత్రం రైతులను ముంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘రైతును కూలీని చేస్తాం, వ్యవసాయాన్ని ఖూనీ చేస్తాం, పండించిన పంటకు మద్ధతు ధర ఇవ్వం, ధాన్యం కొనుగోలు చేయమంటే దగా చేస్తాం, మోటర్లకు మీటర్లు పెట్టాలె.. డిస్కాంలను ప్రైవేటికరించాలె అని సావగొడుతరు’ అని విమర్శించారు. అందుకే సీఎం కేసీఆర్ ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని ఎత్తుకొన్నారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షాలు విఫలమైన ఈ సందర్భంలో తాము దేశాన్ని జాగృతం చేస్తామని ప్రకటించారు.