కరోనా వైరస్ రెండో దశ మరింత ప్రమాదకరంగా ముందుకువచ్చి ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేలాది మరణాలకు కారణమవుతున్నది. 2020లో కొవిడ్-19 వైరస్‌ను మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నియంత్రించగలిగింది.లాక్‌డౌన్‌లు, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం, వైద్య సౌకర్యాలను, మందులను అందుబాటులోకి తేవడం వల్ల మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలోని మరణాల శాతం చాలా తక్కువగా ఉన్నది. మొదటి దశ కొవిడ్ -19 సృష్టించిన విధ్వంసం నుంచి దేశ ప్రజలు, దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా తేరుకోనే లేదు. ఈలోగా రెండో దశ వైరస్ మరింత వేగంగా దూసుకొచ్చి దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది.
కరోనా తొలి దశ వైరస్‌తో మనం నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. తొలిరోజుల్లో ఒక జిల్లాలో లేదా పట్టణంలో ఒకరికి వైరస్ సోకగానే అతను ఎవరెవరిని కలిశాడో పరిశోధన ప్రారంభించి సంబంధితులను వెంటనే దవాఖానలకు తరలించి వైద్య పరీక్షలు చేసేవారు. కరోనా సోకిన వ్యక్తి నివసించే ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ (రెండో జోన్)గా ప్రకటించి పోలీసులచే దిగ్బంధించేవారు. ఇప్పుడు దేశమే రెడ్‌జోన్‌గా మారింది. వ్యక్తి పరిధి నుంచి కమ్యూనిటీ అవధులు దాటి కరోనా వైరస్ మనం పీల్చుకునే గాలిలో భాగమైంది. భూమి ఉపరితలంలో ఆరడుగుల ఎత్తు దాకా ఈ వైరస్ గాలిలో తేలియాడుతూ నోరు, ముక్కు, కళ్ళల్లోంచి సైతం మనిషి లోనికి ప్రవేశిస్తున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దీని నివారణకు సంపూర్ణ లేదా పాక్షిక లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చాయి. ఆయా రాష్ర్టాల్లోని పరిస్థితి తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌లను విధించాయి. ఈ లాక్‌డౌన్ మన రాష్ట్రంలో ఆశించిన ఫలితాన్నిస్తున్నదని మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడాన్ని బట్టి అర్థమవుతున్నది.
వృద్ధులు సైతం కరోనా వైరస్‌ను జయించి క్షేమంగా ఉన్నారు. కరోనా పులినోట్లో తలపెట్టి బయటికి వచ్చినవారి కథలను పుంఖానుపుంఖాలుగా ప్రచారం చేస్తే రోగులకు బతుకుతామనే నమ్మకం కలుగుతుంది. ‘నమ్మకమే సగం బలం’ అని పెద్దలంటారు. నమ్మకం కొండనైనా కదిలిస్తుందనే నానుడి ఉంది. కరోనా జాగ్రత్తలు చెప్తూనే ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో కరోనా బారిన పడి సుమారు 260 మంది దాకా జర్నలిస్టులు మరణించారనే నిజాన్ని జర్నలిస్టులు పరిగణనలోకి తీసుకోవాలి.
గత సంవత్సరం కొవిడ్-19 మొదలైన దగ్గర్నుంచి ఈ రోజు దాకా నేను నిరంతరం ప్రజల మధ్యే ఉన్నాను. లాక్‌డౌన్ వేళల్లో కూడా అధికారుల అనుమతిని పొంది కరోనా బాధితులకు అండగా వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మా కుటుంబ సభ్యులందరికీ గత నెలలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారితో నిరంతరం కలిసే వున్నా నాకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ ఏనాడూ రాలేదు. అలాగని యాంటీ బాడీస్ (పాజిటివ్ వచ్చి పోయిన తర్వాత శరీరంలో ఉండేవి) కూడా నా రక్త కణాల్లో కనిపించలేదు. డాక్టర్లు నిర్ధారించేదేమంటే నా శరీరంలో కరోనా వైరస్‌ను మట్టుపెట్టగల రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పుష్కలంగా ఉన్నదని! ఈ రోగ నిరోధక శక్తి అప్పటికప్పుడు వచ్చిందేమీ కాదు. కొన్నేళ్లుగా నేను తీసుకుంటున్న మల్టీ విటమిన్, మినరల్, ఫైటో న్యూట్రియంట్స్ ప్రోటీన్ల ద్వారా నాకు సమకూరింది. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ కూడా విటమిన్లను తీసుకోవడం ద్వారా కరోనా రాకుండా నివారించడం సాధ్యమని చెప్పారు. పలుమార్లు వైద్యులు ఇదే విషయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ సలహాలను ప్రజలు పట్టించుకోవాలి. కూరగాయలు, పండ్లు, పసుపులోని కర్క్యుమిన్, కృష్ణ తులసి ఆకులు, వెల్లుల్లిలోని అలిసిన్, కలబంద, అడివి ఉసిరి రసాలు, తిప్పతీగ, అశ్వగంధ తదితర మూలికలతో తయారుచేసిన ఫుడ్ సప్లిమెంట్లను లాక్‌డౌన్‌లో కూడా కొరియర్ సర్వీస్ ద్వారా ఇంటికి తెప్పించుకోవచ్చు.
పాజిటివ్ సోకిన వ్యక్తులు విపరీతమైన ఆందోళనకు, భయానికి గురవ్వడం మరణాలకు ఒక ముఖ్యకారణమని వైద్యులు చెప్తున్నారు. పోషక విలువలు గల ఆహారంతో పాటు ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవలసిన అవసరాన్ని చెప్పడంలో, భయాందోళనలను తగ్గించడంలో మీడియా పాత్ర ఎంతో ప్రధానమైనది. ప్రస్తుతం ఏ టీవీ ఛానెల్ చూసినా మరణాలనే ఎక్కువగా చూపించడం వల్ల ప్రజల్లో, రోగుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. దీనికి భిన్నంగా ‘లా ఆఫ్ ఏవరేజెస్’ అనే సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని వందలో తొంభై తొమ్మిది మంది సురక్షితంగా బయటపడుతున్న వాస్తవాన్ని ప్రచారం చేయాలి. గత 15 నెలల్లో కరోనాతో మరణించినవారు 2 లక్షల 83 వేల మంది. ఈ విషయాలను, గణాంకాలను వెల్లడించడం ద్వారా పత్రికలు, టీవీ ఛానెళ్లు ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి. (వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు) వి. ప్రకాశ్