Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సాగులో సాటిలేదు

-వ్యవసాయంలో ప్రథమశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ -ప్రతి రైతు వివరాలు ఏఈవోల దగ్గరుండాలి -పంటలు వేయడం దగ్గర్నుంచి.. మార్కెటింగ్ దాకా సహకరించాలి -మూస పంటలు వద్దు.. లాభసాటి పంటలే ముద్దు -పంద్రాగస్టు నుంచి అన్ని గ్రామాల్లో రైతులతో సమావేశాలు -వ్యవసాయశాఖపై అధికారులతో సీఎం శ్రీ కేసీఆర్ సమీక్షా సమావేశం

కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయి నీళ్లు రావడం మొదలైతే.. దేశంలోనే వ్యవసాయంలో ప్రథమశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ప్రగతిభవన్‌లో శనివారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంటకాలనీలు, సంపూర్ణ యాంత్రీకరణ, ఆహారశుద్ధి కర్మాగారాల (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు) వంటివి ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ బృహత్ కార్యక్రమానికి వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) బాధ్యత వహించాలన్నారు. రైతుల సంక్షేమానికి చేయాల్సిందంతా చేస్తున్నామని.. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం, పంట పెట్టుబడి, రైతుకు బీమా వంటివి ప్రభుత్వం సమకూరుస్తున్నదని తెలిపారు. మూణ్నాలుగేండ్లు పంటలు బాగా పండితే.. రైతు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున ఏర్పాటుచేసే క్లస్టర్‌కు నియమించే ఏఈవోల వద్ద ప్రతి రైతు వివరాలు సమగ్రంగా ఉండాలని, అన్ని క్లస్టర్ల సమాచారం మొత్తం వ్యవసాయమంత్రి కంప్యూటర్‌లో నిక్షిప్తం కావాలని కేసీఆర్ స్పష్టంచేశారు. ఏ పంట ఎప్పుడు వేయాలో, ఏ భూమికి ఏ పంట అనుకూలమో ఏఈవో రైతుకు తెలియచేయాలని ఆదేశించారు. రైతు చనిపోతే, ఆయన బీమా సొమ్మును క్లెయిమ్ చేయడం దగ్గరినుంచి నామినీకి చేరేవరకూ ఏఈవో బాధ్యత తీసుకోవాలన్నారు. ఏఈవోలు అధికారుల్లా కాకుండా రైతులకు ప్రోత్సాహకర్తలుగా వ్యవహరించాలని నిర్దేశించారు.

యాంత్రీకరణకు ప్రత్యేక నిధులు రాష్ట్రం మొత్తం ప్రతి మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ ముమ్మరంగా సాగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ఏమేం యంత్రాలు అందుబాటులో ఉన్నాయి? ఇంకా ఏమేం కావాలో అధ్యయనం చేయాలన్నారు. యాంత్రీకరణదిశగా అవసరమైన యంత్రాలను సరఫరాచేయాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ నుంచి పంటకోతల దాకా అన్ని స్థాయిల్లో వ్యవసాయ యాంత్రీకరణ జరగాలన్నారు. వచ్చే బడ్జెట్లో దీనికి ప్రత్యేక నిధులుంటాయని పేర్కొన్నారు. పండ్ల తోటలు ఎంత విస్తీర్ణంలో వున్నాయో అంచనావేసి, వాటికి అనుగుణంగా పల్స్ కర్మాగారాలను ఏర్పాటుచేయాలని సూచించారు.

మూస పంటలు వద్దు.. లాభసాటి పంటలు మేలు మూస పద్ధతిలో, సంప్రదాయంగా వేసే విధానంలో పంటలు పండించే అలవాటును మార్చాలని, వీటికి బదులుగా లాభసాటి పంటలు పండించే నైపుణ్యాన్ని రైతులకు ఏఈవోలు తెలియజెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు. పెద్దఎత్తున పూలు, పండ్లు, కూరగాయలు దిగుమతిచేసుకునే పద్ధతికి స్వస్తిచెప్పి ఎగుమతిచేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల గురించిన సమగ్ర సమాచారంతో, రైతులకు అవగాహన కలిగించడానికి, వారిలో మరింత స్థైర్యం నింపడానికి వ్యవసాయశాఖ మంత్రి సంతకంతో ప్రతి రైతుకూ ఉత్తరాలు రాయాలని సూచించారు. బీమా పత్రాల పంపిణీ జరుగుతున్నప్పుడు, ఆగస్టు 15 నుంచి గ్రామగ్రామాన రైతుల సమావేశాలు- సదస్సులు నిర్వహించాలని, వాటిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎన్నికైన ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు. ఈ సమీక్షాసమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయసమితి అధ్యక్షుడు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు జితేందర్‌రెడ్డి, బాల్కసుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు పాల్గొన్నారు.

రేపు హెచ్‌ఐసీసీలో ప్రత్యేక సమావేశం రైతు జీవిత బీమా పథకానికి సంబంధించి సోమవారం జరిగే ఏఈవోలు, డీఏవోలు, రైతు సమన్వయసమితి కో-ఆర్డినేటర్ల విస్తృతస్థాయి సమావేశంలో సమగ్రంగా చర్చించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ సమావేశం హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని సందేశమిస్తారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.