Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్

-అందుకు శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలి -వ్యవస్థీకృత నేరస్థులను పసిగట్టే టెక్నాలజీ రావాలి -పోలీస్ శాఖకు కేటాయించిన బడ్జెట్, ప్లాన్ ఆఫ్ యాక్షన్‌పై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

KCR01

సేఫ్‌సిటీ, స్మార్ట్‌సిటీ అన్న పేరు రావాలంటే శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని, అలా ఉన్న నగరమైనా, రాష్ట్రమైనా సుస్థిరంగా అభివృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. పోలీసు శాఖకు కేటాయించిన నిధులు, వాటి వినియోగానికి పోలీస్ ఉన్నతాధికారులు చేపట్టిన కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వార్షిక బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయంగా పోలీస్ శాఖకు రూ. 1200కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ శాఖకు ప్రత్యేక ప్రణాళిక బడ్జెట్‌ను ప్రతిపాదించిన చరిత్ర లేదు.

సీఎంతో సమీక్ష సందర్భంగా పోలీస్ శాఖకు బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పించినందుకు డీజీపీ అనురాగ్ శర్మ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి సీఎంకు పోలీస్ శాఖలో చేపట్టబోతున్న నూతన ఆవిష్కరణలు, కార్యక్రమాలపై వివరించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పోలీస్ శాఖ పనితీరు, నిధుల కేటాయింపులతో చేపట్టాల్సిన పనులు, నేరనియంత్రణ, కమాండ్ కంట్రోల్ సెంటర్, పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం తదితర అంశాలపై వారితో చర్చించినట్టు తెలిసింది. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. ప్రపంచదృష్టిని ఆకర్షించేలా, అందరిచేత శభాష్ అనిపించేలా కొత్త రాష్ట్రంలో పోలీస్ శాఖ పనిచేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. వారి కదలికలను నేరాలకు ముందే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

టెక్నాలజీని బాగా అందిపుచ్చుకొని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ సురక్షిత నగరం అనేలా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇక బడ్జెట్ నిధులపై పోలీసు అధికారులు సీఎంకు వివరిస్తూ, అత్యాధునిక హంగులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే తాము ఉపయోగించబోతున్న టెక్నాలజీపై నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఐటీ బ్యాక్‌బోన్ సపోర్ట్ పేరిట రూ.100 కోట్లతో త్వరలో కొనుగోలు చేయబోతున్న సాంకేతిక పరికరాల పనితీరును ఆయన వివరించారు. అలాగే సీసీటీవీలకు కేటాయించిన రూ.225 కోట్లతో దశలవారీగా వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా చేపట్టిన పలు సంస్కరణలు ఉపకరించాయని పోలీస్ అధికారులు వివరించారు. స్నాచర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించడంతో ఆ నేరాలు తగ్గాయని, ఇలాంటి చర్యలను మరింత విస్తృతం చేస్తే నేరనియంత్రణలో చాలా వరకు సక్సెస్ అవుతామని డీజీపీ వివరించారు. రాష్ట్రంలో త్వరలో భారీస్థాయిలో చేపట్టనున్న నియమాకాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. 10వేలకు పైగా సిబ్బందిని నియమించనున్న నేపథ్యంలో వారికి మంచి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. శిక్షణలోనే టెక్నాలజీపై పట్టుపెంచుకునేలా కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని, దానికి తగ్గట్టుగా దేశవిదేశాల్లో ఉన్న టెక్నాలజీని సైతం యువ అభ్యర్థులకు పరిచయం చేయాలని, నేరాల నియంత్రణలో అవగాహన ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. పోలీస్ అకాడమీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకూడదని, అన్ని వసతులు కల్పించి అత్యుత్తమ అధికారులుగా తీర్చి దిద్దాలని సీఎం డీజీపీని ఆదేశించినట్టు తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.