-ఏడాదిలోగా కోటి ఎకరాలసాగుభూమిలో భూసారపరీక్షలు -పూర్తి సమాచారంతో కర్ణాటక తరహాలో భూసారపటం -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -సీఎం కేసీఆర్‌తో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ భేటీ
రాష్ట్ర రైతులకు చెందిన సాగుభూముల్లో త్వరలోనే భూసారపరీక్షలు నిర్వహించి పరీక్షల సమగ్ర సమాచారంతో రైతులకు భూసారకార్డులు (సాయిల్ హెల్త్‌కార్డు)ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఏడాదిలోగా కోటి ఎకరాల వ్యవసాయభూముల్లో భూసారపరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ విలియం డీ డార్, డైరెక్టర్ సుహాస్ పీ వాణి సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతుల భూముల్లో భూసారపరీక్షలు నిర్వహిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టామని గుర్తుచేశారు. ఆ హామీని నిలబెట్టుకోవడం ద్వారా రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. తెలంగాణలో రేగడి భూములు, ఎర్రజెక్క, చౌడు ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో రకం నేలలున్నాయి. ఏ నేల ఏ పంటకు అనుకూలం ఉంటుంది? నేలల్లో భూసారం ఎంత ఉంది? అన్న వివరాలతోపాటు ఏ వాతావరణ పరిస్థితుల్లో ఏ పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వస్తాయనే అంశాలపై దృషి ్టసారిస్తాం.
భూసారపరీక్షలు నిర్వహించకపోవడంతో ఇన్ని రోజులు అన్ని నేలల్లోనూ రైతులు ఒకే రకమైన పంటలు వేస్తున్నారు. ఫలితంగా ఆశించిన దిగుబడులు రాకపోగా ఆర్థికంగా నష్టపోతున్నారు అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక తరహాలో రాష్ట్రంలో భూసార పటాన్ని రూపొందించాలనే నిర్ణయానికి వచ్చామని ఇక్రిశాట్ అధికారులకు సీఎం వివరించారు. అన్ని నేలల్లో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ర్టాన్ని విత్తన భాండాగారంగా(సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా)గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని సీఎం చెప్పారు. కర్ణాటకలో కూడా ఇక్రిశాట్ ఆధ్వర్యంలోనే భూసార పరీక్షలు జరిగాయని, వారి అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. భూసారపరీక్షలు నిర్వహించిన వెంటనే రైతు తన భూమి స్వభావం సులభంగా అర్ధం చేసుకునేలా సాయిల్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్త సమాచారంతో రూపొందించే భూసారపటం రైతులకే కాక వ్యవసాయ పరిశోధకులు, అధికారులకే వ్యవసాయ విధానాన్ని ఖరారుచేసే శాసనకర్తలకు కూడా కరదీపికలా పని చేస్తుందని సీఎం కేసీఆర్ వివరించారు. సీఎం బిజీ బిజీ… ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం సందర్శకులు, సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో 8వ నిజాం భార్య ఇస్రా కలిశారు. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో సమావేశం అయ్యారు. మూడు గంటల పాటు గవర్నర్‌తో చర్చించిన కేసీఆర్ తర్వాత సచివాలయానికి చేరుకున్నారు. బతుకమ్మ పండుగ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి కేసీఆర్‌ను శుక్రవారం సచివాలయంలో కలిశారు.