– ఆర్‌బీఐ అడ్డంకులు అధిగమించి సీఎం గ్రీన్ సిగ్నల్ – విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం – 2014 మార్చి 31లోపు రుణాలు మాఫీ – మూడంచెల్లో అర్హుల జాబితా తయారు – నెరవేరుతున్న మరో కీలక ఎన్నికల హామీ
తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన రైతుల లక్ష రూపాయల లోపు రుణమాఫీకి ముందడుగుపడింది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అడ్డంకులు సృష్టించినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టబడాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం దీనిపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది.
2014 మార్చి 31వ తేదీ వరకు రైతులు తీసుకున్న లక్షలోపు రుణాల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. రైతులకు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని అప్పు ఖాతాలున్నప్పటికీ ఒక కుటుంబానికి ఒక లక్ష రూపాయల మేరకు రుణం మాఫీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడంచెల్లో అర్హులైన రైతులను ఎంపిక చేస్తారు.
లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వ్యవసాయదారుల జాబితాను రూపొందించేందుకు ముందుగా గ్రామస్థాయిలో బ్యాంకుల బ్రాంచ్‌ల వారీగా రైతులు, వారు తీసుకున్న రుణాల వివరాలను క్రోడీకరిస్తారు. దీనిని మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సరి చూసుకుంటారు. గతేడాది పంట సంవత్సరంతోపాటు పాత రుణాలు, బంగారు తాకట్టు రుణాల వివరాలను కూడా ఇదే సందర్భంగా సేకరిస్తారు. ఈ రుణాలన్నింటి మొత్తం ఒక కుటుంబానికి లక్ష రూపాయలకు మించితే కేవలం లక్షవరకే ప్రభుత్వం నుంచి రుణమాఫీ వర్తిస్తుంది.
ఈ మొదటి దశ తర్వాత అన్ని బ్యాంకుల బ్రాంచీల నుంచి వచ్చిన పూర్తి సమాచారాన్ని జాయింట్ మండల కమిటీ సమీక్షిస్తుంది. ఇక్కడ రైతులు వాణిజ్య బ్యాంకుల నుంచి, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో సరిపోల్చుతారు. ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్‌లో ఎంత మొత్తం రుణం తీసుకున్నప్పటికీ లక్ష మేరకు రుణం తీసుకున్న కుటుంబం జాబితా రూపొందిస్తారు. కుటుంబం అంటే భార్య, భర్త వారి మీద ఆధారపడి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
మూడవ దశలో జిల్లా కలెక్టర్లు రుణమాఫీకి సంబంధించిన కసరత్తు కొనసాగిస్తారు. కలెక్టర్ ఒక్కొక్క మండలం వారీగా వివరాలు సేకరించేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తారు. ఆయన ఆధ్వర్యంలో మరోసారి గ్రామస్థాయిలో సోషల్ అడిట్ జరుగుతుంది. ఈ మేరకు లక్ష లోపు రుణాల మాఫీకి అర్హులైన వారి జాబితాను పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై ప్రకటిస్తారు.
అర్హులైన రైతులకు 2014 మార్చి 31తేదీ వరకు తీసుకున్న రుణాలలో లక్ష రూపాయల వరకూ మాఫీకి అవకాశం ఉన్న వారి పేర్లు, ఇతర వివరాలు వెల్లడిస్తారు. దీంతో వారి రుణాలు రెన్యూవల్ అవుతాయి. ఈ మేరకు బ్యాంకు అధికారులు వారికి ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు కొత్త రుణాలు మంజూరు చేస్తారు. ప్రభుత్వమే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తున్నందున అర్హులైన రైతుల జాబితాను వెల్లడించిన తర్వాత కొత్త రుణాల మంజూరులో ఎలాంటి సమస్యలు తలెత్తబోవని భావిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకుల నుంచి సహకారం లభించని చోట్ల ప్రభుత్వమే నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాలో కొంత మేరకు నిధులు జమచేసే అవకాశాలున్నాయి. మిగిలిన మొత్తాన్ని నిర్దిష్ట వాయిదాలతో రైతులకు అందజేస్తారు.