-పేదలందరికీ ఆహారభద్రత కార్డులు -కుటుంబానికి 20కిలోల బియ్యం సీలింగ్ రద్దు -ఒక్కొక్కరికీ తలా 5 కిలోల చొప్పున ఇస్తాం.. -రేషన్ కార్డులపై దుష్ప్రచారాలను నమ్మొద్దు: మంత్రి ఈటెల

రేషన్ కార్డులపై దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి ఈటెల అన్నారు. శుక్రవారం ఫ్యాప్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డులకింద ఒక్కొక్కరికి 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 5 కిలోలకు పెంచుతున్నామని, కుటుంబానికి 20 కిలోలు మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను కూడా ఎత్తి వేస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి తలా 5 కిలోల చొప్పున అందజేస్తామన్నారు.
ఆహారభద్రత కార్డుల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు ఏమీ తీసుకురాలేదని, గత ప్రభుత్వంలో ఉన్న నిబంధనలనే అమలు చేస్తున్నామని, ఎవరూ అపోహలు చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న కార్డులు కేవలం రేషన్ సరుకుల కోసం మాత్రమేనని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ వంటి ఇతర సంక్షేమ పథాలకు సంబంధం లేదని ఈటెల స్పష్టం చేశారు.