తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. కార్మికులు కోరిన దానికంటే ఒక శాతం ఫిట్‌మెంట్ ఎక్కువగా ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. టీఎంయూ, ఈయూ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. గత ప్రభుత్వాల పాలన వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. తెలంగాణ ధనిక రాష్ట్రం. అడుక్కుతినే రాష్ట్రం కాదు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలి. ఇతర సంస్థలతో పోల్చి చేస్తే కార్మికులకు వేతనాలు తక్కువగా ఉన్నాయి. వారి సమస్యలు నాకు తెలుసు. అందుకే వారికి 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తున్నాం.

ఫిట్‌మెంట్‌ను జూన్ నుంచి అమలు చేస్తాం పెరిగిన ఫిట్‌మెంట్‌ను జూన్, 2015 నుంచి అమలు చేస్తాం. వేతన బకాయిలను సగం, నగదు, మరో సగం బాండ్ల రూపంలో ఇస్తారు. బకాయిలను మూడు దశల్లో చెల్లిస్తాం. నగదు బకాయిలను వచ్చే దసరా, ఉగాది, ఆపై దసరాకు చెల్లిస్తాం. 50 శాతం బాండ్ల రూపంలో ఇస్తాం. ఆర్టీసీలోని 4,300 కాంట్రాక్టు కార్మికులను రేపటి నుంచి క్రమబద్దీకరిస్తాం. సమ్మె కాలానికి కూడా జీతాలు ఇస్తాం. 56,740 మంది కార్మికులు ఆర్టీసీని నమ్ముకొని బతుకుతున్నారు. రూ. 400 కోట్లకు పైగా నష్టాలతో ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ రూ. 400 కోట్లకు పైగా నష్టాలతో నడుస్తోంది. గత పాలకులు చేసిన తప్పుల వల్లనే ఇదంతా జరిగింది. రూ. 1900 కోట్ల అప్పులకు రూ. 186 కోట్ల వడ్డీ కడుతున్నాం. గతంలో నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని లాభాల్లో నడిపించాను. ప్రతీ సంవత్సరం బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రత్యేక కేటాయింపులుంటాయి. హైదరాబాద్‌లో తిరిగే బస్సులకు రూ. 200 కోట్ల సబ్సిడీని జీహెచ్‌ఎంసీనే భరిస్తది. రవాణా వ్యవస్థను లాభాల్లోకి తీసుకురావడమే లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకు తగిన విధంగా ముందుకెళ్తాం. తెలంగాణ ఆర్టీసీని కాపాడుకునేందుకే తానే రంగంలోకి దిగుతా. మే చివరలో ఒక రోజు నేనే కార్మిక సంఘాల నేతలతో కూర్చొని మాట్లాడుతా. తెలంగాణలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోకుండా చూసుకుంటాం. ఆర్టీసీ కార్మికులను బిడ్డల్లాగా చూసుకునే అధికారులు అవసరం. అప్పుడే సంస్థ లాభాల్లోకి వస్తుంది.