Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రెండుజిల్లాల్లో వాటర్‌గ్రిడ్ పైలట్‌ప్రాజెక్టు

-నల్లగొండ, రంగారెడ్డిల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం -హైదరాబాద్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని సూచన -నగర డిజిటలైజేషన్, సర్వేపై జెనిసిస్ సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ

KCR Review on Water grid pilot project

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకం అమలును ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణం కోసం భౌగోళికమైన మ్యాప్‌లు రూపొందించడం, సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేయడంపై ముంబైకి చెందిన జెనిసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో సమావేశం అయ్యారు.

వాటర్‌ట్యాంక్‌లు, చెరువుల పునరుద్ధరణకు సర్వే నిర్వహించడం కోసం, హైదరాబాద్ నగర సమాచారాన్ని కూడా డిజిటలైజ్ చేయడానికి జెనిసిస్ సంస్థ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సీఎం అధికారుల సమావేశంలో నిర్ణయించారు. వాటర్‌గ్రిడ్ పథకం కోసం ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌కు సమీపంలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, మేడ్చల్ మండలాల్లో ఉన్న పది నుంచి 15 చెరువులను గుర్తించి, పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేయించాలని, ఈ ప్రయోగం విజయవంతమైతే, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు, మండలాలు, గ్రామాల్లో అమ లు చేయవచ్చన్నారు.

ఇలాంటి సర్వేలు నిర్వహించడం, మ్యాప్‌లు తయారుచేయడంలో, పట్టణ పరిపాలన, గ్రామీణ నీటిసరఫరా పథకాల అమలులో తమ కంపెనీకి ఎంతో అనుభవం ఉందన్నారు. గతంలో పుణెలోని లవాస సిటీని, ముంబై, ఉత్తరప్రదేశ్‌లలో కొన్ని నగరాలను తమ టెక్నాలజీని ఉపయోగించి డిజిటలైజేషన్ చేశామని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని కూడా 3-డీ ఎన్విరాన్‌మెంటల్ సిటీగా రూపొందిస్తామని జెనిసిస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సాజిద్ మాలిక్, వైస్‌ప్రెసిడెంట్ ఎస్డీ త్రిపాఠి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు తెలిపారు. హైదరాబాద్ ఎంతో చరిత్రాత్మకమైన నగరమని, కట్టడాలకు నష్టం కలగకుండా ఇస్తాంబుల్ నగరంలాగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు.

హైదరాబాద్ నగరం బహుముఖంగా విస్తరిస్తున్నదని, నగర జనాభా త్వరలోనే రెండు కోట్లకు చేరుకునే అవకాశం ఉందని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నగర డిజటలైజేషన్ ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌లో ఎన్నో ప్రాంతాల్లో నిర్మాణాల ఆధునీకరణ చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం, ఆధునీకరించిన నగర నమూనాలను పూర్తిగా మ్యాప్‌ల ద్వారా భద్రపర్చాలన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారని, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందో సర్వేలో పొందుపర్చాలని సీఎం చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా సర్వే చేసి, డిజిటలైజ్ చేయగలిగే సామర్థ్యం జెనిసిస్ సంస్థకు ఉందా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు.

హైదరాబాద్‌ను అన్ని హంగులతో కూడిన మాస్టర్‌ప్లాన్‌తో అభివృద్ధి చేసే ప్రణాళికను ముందు వివరించాలని అడిగారు. నగరంలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 7,500 కిలోమీటర్ల రోడ్లను విస్తరించి, ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని, అందుకోసం ఎంతో ముందుచూపుతో కూడిన ప్రణాళిక అవసరమన్నారు. హైదరాబాద్‌కు ప్రతీఏటా అదనంగా పది లక్షల జనాభా వచ్చి చేరుతున్నదని, నగరం అశాస్త్రీయంగా అభివృద్ధి చెందితే భవిష్యత్ తరాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, నగరంలో ఎన్నో ఏండ్ల కింద నుంచి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం అమలులో ఉందన్నారు. చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో అధికారులతో అన్నారు.

ముఖ్యంగా రాజ్‌భవన్, అసెంబ్లీ, సీఎం క్యాంపు కార్యాలయంవంటి ముఖ్యమైన ప్రాంతాల్లోనే ఇలాంటి సమస్య ఉందని వాపోయారు. ఇలాంటి సమస్యలు భవిష్యత్‌లో నగరంలో తలెత్తకుండా ప్రణాళిక ఉండాలన్నారు. జెనిసిస్ కంపెనీ ప్రతినిధులతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఎంపీ నర్సయ్యగౌడ్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేశ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీ మురళి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.