– తెలంగాణ ద్రోహులకు గుణపాఠం తప్పదు – ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి ప్రభుత్వాన్ని దీవించండి – భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
మెదక్ ఉప ఎన్నికల్లో రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడా అధికారంలోలేని కాంగ్రెస్‌కు ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్టేనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత, గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వాన్ని దీవించాలని విజ్ఞప్తి చేశారు. తమది రైతు ప్రభుత్వమని, ప్రతి కుటుంబానికీ రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. ర్యాలీలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మెదక్ జిల్లా ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌వైపు నిలబడ్డారని, ఉప ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు రావటం ఖాయమన్నారు. వందరోజుల టీఆర్‌ఎస్ పాలన అద్భుతంగా ఉందన్నారు. ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్ నేతలు గణేశ్‌గుప్తా, రాజనర్సు, వివిధ కులసంఘాల నేతలు పాల్గొన్నారు.