-నగరంలో పేకాట క్లబ్బులు మూత పడాల్సిందే -పోలీసు శాఖకు కొత్తగా 3833 వాహనాలు -కొత్తగా 3620 డ్రైవరు, కానిస్టేబుళ్ల నియామకం -స్వాధీనం చేసుకున్న భూమిలోనే తెలంగాణ జర్నలిస్టు భవన్: సీఎం

నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు జాతీయ/అంతర్జాతీయ కన్సల్టెంటును నియమించనున్నారు. నగరాన్ని రెగ్యులేటెడ్ సిటీగా మార్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక-పట్టణాభివృద్ధి శాఖకు బాధ్యతను అప్పగిస్తూ రాష్ట్ర క్యాబినెట్ బుధవారం తీర్మానించింది. క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మీడియాకు వివరాలు వెల్లడించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా మాస్టర్‌ప్లాన్ తయారీకి కన్సల్టెంటును నియమించాలని క్యాబినెట్‌లో తీర్మానం చేసినట్లు సీఎం తెలిపారు.
నగరంలోని వ్యర్థాలను నిర్మూలించేందుకు మరిన్ని డంపింగ్‌యార్డుల ఆవశ్యకత ఉందని, దీనికోసం కనీసం 2వేల ఎకరాల స్థలం అవసరం అవుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ తనవద్దే ఉన్నందున దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. నగరంలో అక్రమ నిర్మాణాలను ప్రస్తావిస్తూ.. నగరంలో 60వేలకు పైచిలుకు అక్రమ భవనాలు ఉన్నాయి. నాలాలు, చెరువులు, ఈఎన్‌టీ ఆస్పత్రి, దేవాదాయ భూములు అన్నీ కబ్జాకు గురయ్యాయి. సాక్షాత్తూ సెక్రటేరియట్ కు కూతవేటు దూరంలోనే క్లబ్బులు నిర్వహిస్తున్నారు. భారీసంఖ్యలో అక్రమ భవనాలు ఉన్నాయి. వీటన్నింటిపై చర్యలు తీసుకుని నగరాన్ని ఓ రెగ్యులేటెడ్ సిటీగా మార్చాలి అని సీఎం పేర్కొన్నారు. రాజ్‌భవన్, అసెంబ్లీ, సీఎం కార్యాలయాల ఎదుట చిన్నపాటి వర్షానికే భారీగా నీరు నిలుస్తున్నది. దీనిపై అధికారులతో మాట్లాడితే.. తామేమీ చేయలేమంటున్నారు.
నగరాన్ని హైటెక్ చేశాం.. అది చేశాం కొందరు అంటున్నారు. మరి నీరెందుకు నిలుస్తున్నదో వారు చెప్పాలి అని ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌లో అంగుళం భూమిని కూడా కబ్జా కానివ్వమని సీఎం స్పష్టంచేశారు. నగరంలో కబ్జాకోరుల చెరలోనున్న భూమిని స్వాధీనం చేసుకుని అందులో అంతర్జాతీయ స్థాయి వసతులతో తెలంగాణ జర్నలిస్టు భవన్‌ను నిర్మిస్తామని తెలిపారు. శాంతిభద్రతలపై సీఎం మాట్లాడుతూ సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రత పరిస్థితిని పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. ఈ క్రమంలో జంట కమిషనరేట్ల పరిధిలో పెట్రోలింగ్‌కు కొత్తగా రూ. 340 కోట్లతో 3,833 వాహనాలు ఇస్తున్నామని అన్నారు. ఈ వాహనాలను నడిపించేందుకు 3620 మంది కానిస్టేబుల్/ డ్రైవర్లు నియామకం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మరోవైపు, నగర ప్రస్తుత స్థితిగతులు, సమస్యలు, అవసరాలు తదితర అంశాలపై జీహెచ్‌ఎంసీ నుంచి ఇదివరకే అవసరమైన సమాచారాన్ని సేకరించినట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. నగరానికి సంబంధించిన జనాభా, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు తదితర అన్ని అంశాలపై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేసినట్లు చెప్పారు.