-కేంద్రం నుంచి రావాల్సిన నిధులు -పట్టణ అభివృద్ధి నిధులు విడుదల చేయాలి -ఉడాన్ పథకంలో వరంగల్‌ను చేర్చాలి -ఇప్పటికే అక్కడ రన్‌వే సిద్ధంగా ఉన్నది -కొత్త ఎయిర్‌పోర్టుల సర్వే పూర్తిచేయాలి -కేంద్రానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ వినతి -కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రితో భేటీ -స్వచ్ఛ భారత్ పథకం కింద : రూ.217.49 కోట్లు -అమృత్ పథకం కింద : రూ.351.77 కోట్లు -ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ : రూ.783.75 కోట్లు -పీఎంఏవై కింద ఇవ్వాల్సినవి: రూ.1184.8 కోట్లు

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,537.81 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కోరారు. ఉడాన్ పథకంలో వరంగల్‌ను కూడా చేర్చి, ఆ నగరానికి విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురీని ఢిల్లీలో సోమవారం మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన పట్టణాభివృద్ధి శాఖ నిధులు రూ.2537.81 కోట్లను విడుదల చేయాలని కోరారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన పురపాలక చట్టం అంశాలను కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిపారు. అక్టోబరులో మరోసారి పూర్తినివేదికతో రావాలని కేంద్రమంత్రి సూచించారని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నుంచి స్వచ్ఛ భారత్ పథకం కింద రూ.217.49 కోట్లు, అమృత్ పథకం కింద రూ.351.77 కోట్లు, 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ.783.75 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వాల్సిన రూ.1184.8 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరామని కేటీఆర్ తెలిపారు.
వరంగల్ జిల్లా మామునూరును ఉడాన్ పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశామన్నారు. త్వరలో వరంగల్ ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. వరంగల్‌లో ఇప్పటికే రన్‌వే సిద్ధంగా ఉన్నదని, దీనిద్వారా ఉడాన్ పథకం ద్వారా విమాన సర్వీసులను నడిపించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం ఆరుచోట్ల విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. ఇందుకోసం అవసరమైన సర్వే పనులు వేగవంతం చేయాలని కోరినట్టు చెప్పారు. మంత్రి కేటీఆర్ వెంట ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఉన్నారు.