-అప్పర్ భద్రకు ఇచ్చి మాకెందుకు ఇవ్వరు!
– రాష్ట్రానికి నిధులపై అమిత్ షావి అన్నీ అబద్ధాలే
-కేంద్రానికే మనం అదనంగా 2 లక్షల కోట్లిచ్చాం
-నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తా
-అమిత్ షా నువ్వు ముక్కు నేలకు రాస్తావా?
-బండి సంజయ్.. చేతనైతే బీళ్లకు నీళ్లు పారించు
-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిది ఐరన్ లెగ్
మసీదులు తవ్వుతామంటూ బీజేపీ నేతలు రాష్ట్రంలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు మసీదులు తవ్వితే.. మేం అభివృద్ధి పనులకు పునాదులు తవ్వుతాం. ప్రార్థనాలయాలు కాదు.. చేతనైతే దేవరకద్రలోని బీడు భూములు తవ్వి నీరు పారిద్దాం. మేంగుడులు కడుతున్నాం. వాటితోపాటే ప్రాజెక్టులు కూడా కడుతున్నాం. యాదాద్రి లాంటి గొప్ప ఆలయం నిర్మించిన ఘనత మా ప్రభుత్వానిదే.
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు అన్యాయం చేసిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును సొంత నిధులతో నిర్మిస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రధాని, ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కృష్ణాబేసిన్‌ను మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ అవసరాల కోసం కృష్ణానదిలో వాటా అడుగుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్లతో చేపట్టిన పనులను ప్రారంభించారు. భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ వద్ద భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో 40.65 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, బస్ డిపో సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
అమిత్ షా ముక్కు నేలకు రాస్తావా?
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రానికి తెలంగాణ 3.68 లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం మనకు ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లేనని తెలిపారు. కేంద్రం ఇచ్చినదానికంటే మనం కేంద్రానికి రూ.2 లక్షల కోట్లు అదనంగా ఇచ్చామని చెప్పారు. ‘నేను చెప్తున్న లెక్కలు తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. అమిత్ షా.. నువ్వు చెప్పేవి తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తావా?’ అని సవాల్ చేశారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామన్న అమిత్ షా ప్రకటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ‘మాతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చేవాళ్లం’ అని అమిత్ షా అంటున్నారని, దీనిని బట్టే కేంద్రం రాష్ర్టానికి ఏమీ ఇవ్వలేదని ఆయన ఒప్పుకొన్నట్టయ్యిందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్రప్రభుత్వమే రూ.1,400 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నదని తెలిపారు.
అప్పర్ భద్రకు జాతీయ హోదా.. పాలమూరుకు అన్యాయం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో సాగు, తాగు నీరు లేక ప్రజలు ముంబై వంటి నగరాలకు వలసలు వెళ్లేవారని, ఇప్పుడు సాగునీటి రాకతో కష్టాలు తీరాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉండేదని, నేడు కొత్తగా 8 లక్షల ఎకరాల ఆయకట్టును సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. తనను ప్రధానిని చేస్తే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని, 90 శాతం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులు తామే భరిస్తామని నరేంద్రమోదీ 2014 పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన మాట ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, మన పాలమూరు ప్రాజెక్టుకు మాత్రం హోదా ఇవ్వడంలేదని మండిపడ్డారు. దేవరకద్రను చంటి బిడ్డలా చూసుకొంటున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
మీరు మసీదులు తవ్వితే.. మేం అభివృద్ధి పునాదులు తవ్వుతాం
మతం పేరుతో యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ కుట్ర పన్నిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మసీదులు తవ్వుతామంటూ బీజేపీ నేతలు రాష్ట్రంలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘మీరు మసీదులు తవ్వితే.. మేం అభివృద్ధి పనులకు పునాదులు తవ్వుతాం’ అని స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఘోరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రార్థనాలయాలు కాదు.. చేతనైతే దేవరకద్రలోని బీడు భూములు తవ్వి నీరు పారిద్దాం అని పిలుపునిచ్చారు. ‘మేం గుడులు కడుతున్నాం. వాటితోపాటే ప్రాజెక్టులు కూడా కడుతున్నాం. యాదాద్రి లాంటి గొప్ప ఆలయం నిర్మించిన ఘనత మా ప్రభుత్వానిదే’ అని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ఐరన్‌లెగ్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఐరన్‌లెగ్ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్‌ను నాశనం చేయబోతున్నాడు. ఆయనది ఐరన్‌లెగ్. రేవంత్‌రెడ్డి లాంటి ఐరెన్ లెగ్ కావాలా? నరేందర్‌రెడ్డి లాంటి గోల్డెన్ లెగ్ కావాలో కొడంగల్ ప్రజలు తేల్చుకోవాలి. కాంగ్రెస్ నేతలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే వారికి 10 ఛాన్సులు ఇచ్చారు. 50 ఏండ్లు పాలించేందుకు అవకాశం ఇస్తే రైతులకు ధీమా ఇవ్వలేని దద్దమ్మలు మళ్లీ వచ్చి మరో అవకాశం ఇవ్వమంటే మనం పిచ్చోళ్లమా’ అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూదందాలు చేసి అక్రమాస్తులు కూడబెట్టడమే పనిగా పెట్టుకొన్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమాల్లో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, వీ శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేశ్‌రెడ్డి, బీ కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, బండా ప్రకాశ్, కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.
మంచినీళ్లు వస్తున్నయా?
దేవరకద్ర పర్యటనకు వెళ్తూ మంత్రి కేటీఆర్ మార్గమధ్యలో ఓ గ్రామంలోని మహిళలను పలకరించారు. మంచి నీళ్లు ఎలా వస్తున్నాయని అడిగారు. ‘రోజూ కనీసం గంటకుపైగా నీళ్లు వస్తున్నాయి. కేసీఆర్ పుణ్యాన తాగునీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్డుపైకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది’ అని వాళ్లు సంతోషం వ్యక్తంచేశారు. సిద్దాయిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించిన కేటీఆర్, వాటిని చూస్తుంఏట పల్లెటూళ్లలో కూడా అపార్ట్‌మెంట్లు కట్టినట్టు ఉన్నదని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఇప్పటికే 1,400 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 1,100 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు.
కేసీఆర్ వల్లే పాలమూరు అభివృద్ధి: శ్రీనివాస్‌గౌడ్
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే పాలమూరు జిల్లాలో వలసలు ఆగిపోయి పచ్చని పంటలు పండుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గతంలో 70 ఏండ్లు పరిపాలించినవారు బాగా బతికిన వాళ్లను కూడా వలస కార్మికులుగా మార్చేశారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ బాగు పడుతుంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయం గురించి తెలియని వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కుక్కల్లా మొరుగుతున్నారు: మంత్రి వేముల
పార్లమెంటులో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని పొగిడితే.. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాత్రం కుక్కల్లా మొరుగుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మంత్రి కేటీఆర్ ఏడేండ్లలో రాష్ర్టానికి 17 వేల పైచిలుకు కొత్త పరిశ్రమలు, 2.40 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చేలా చేశారని కొనియాడారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్రఖ్యాత సంస్థలు కార్యాలయాలు హైదరాబాద్‌లో స్థాపించేలా చేసిన ఘనత కేటీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ పల్లెలను పరిపుష్టం చేస్తుంటే.. కేటీఆర్ ఐటీ, పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. లవంగం, బుడ్డర్‌ఖాన్‌లు ఇంతటి అభివృద్ధి చేయగలరా? అని ప్రశ్నించారు.